హ్యూస్టన్‌ అట్టహాసం! | Sakshi Editorial Article On Howdy Modi Event | Sakshi
Sakshi News home page

హ్యూస్టన్‌ అట్టహాసం!

Published Tue, Sep 24 2019 1:33 AM | Last Updated on Tue, Sep 24 2019 1:33 AM

Sakshi Editorial Article On Howdy Modi Event

తాను ప్రారంభించే ఏ పథకాన్నయినా, కార్యక్రమాన్నయినా... పాల్గొనే ఎలాంటి సందర్భాన్న యినా అసాధారణ స్థాయికి తీసుకెళ్లి జనంలో చెరగని ముద్రేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రభాగాన ఉంటారు. అమెరికాలోని హ్యూస్టన్‌ నగరంలో ఆదివారం నిర్వహించిన మెగా ఈవెంట్‌ ‘హౌడీ మోదీ’ ఈ సంగతిని మరోసారి రుజువుచేసింది. వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి రిపబ్లికన్‌ అభ్యర్థిత్వాన్ని సాధించాలని ఉవ్విళ్లూరుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు కనీసం అరడజను సమావేశాలు నిర్వహిస్తే తప్ప ఇంతమంది ప్రేక్షకులు లభ్యమయ్యే అవకాశం లేదంటే అతిశయోక్తి కాదు. ఈ సభ ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించినవారంతా ట్రంప్‌ను మోదీ ఎంతగా ఆకట్టుకున్నారో గమనించే ఉంటారు. స్టేడియం చుట్టూ సభికులకు అభివాదం చేద్దామని మోదీ ప్రతిపాదించడం, ఆ వెనువెంటనే అందుకు ట్రంప్‌ అంగీకారం తెలిపి, ఆయన ఎటు తీసుకెళ్తే అటు కదలడానికి సిద్ధపడటం ఆసక్తి కలిగించే అంశం. అంతేకాదు, మరోసారి డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి రావాలని మోదీ కోరుకుంటూ ‘అబ్‌ కీ బార్‌– ట్రంప్‌ సర్కార్‌’ నినాదం ఇచ్చారు. అధ్యక్షుడిగా ఎన్నికైనవారిని లాంఛనంగా అభినందించడం తప్ప గతంలో ఏ ప్రధానీ అధికారంలో ఉన్నవారికి మద్దతుగా ప్రచారం చేసిన దాఖలా లేదు. అలాగే అమెరికా అధ్యక్షుడెవరూ గతంలో వేరే దేశాల అధినేతలు పాల్గొనే సభకు హాజరైన సందర్భం లేదు. ఇంత పెద్ద సభకు హ్యూస్టన్‌ను ఎంచుకోవడం యాదృచ్ఛికం కాదు. ఈ నగరం డెమొక్రాట్లకు పట్టుండే టెక్సాస్‌ రాష్ట్రంలోనిది. ఈ సభ ట్రంప్‌కూ, రిపబ్లికన్లకూ ఎంతవరకూ సాయపడుతుందో వేచిచూడాలి.

అనేక వివాదాస్పద నిర్ణయాలతో బలమైన మద్దతుదార్లను కూడగట్టుకున్నట్టే, వ్యతిరేకతను కూడా మూటగట్టుకుంటున్న ట్రంప్‌కు ఇలాంటి నినాదాలు ఈ ఎన్నికల కాలంలో నిస్సందేహంగా ఉపకరిస్తాయి. ప్రవాస భారతీయుల్లో(ఎన్నారై) బీజేపీకి, ప్రత్యేకించి మోదీకి అభిమానులుగా ఉన్న వారంతా ఆయనవైపు మొగ్గుచూపుతారు. అభ్యర్థిగా ట్రంప్‌ మరోసారి బరిలోకి దిగితే రిపబ్లికన్‌ పార్టీకి ముందు భారీగా విరాళాలు, ఆ తర్వాత ఓట్లు రాలే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో కూడా ట్రంప్‌కు భారతీయులు గట్టి మద్దతునిచ్చారు. అయితే ఆయన అధికారంలోకొచ్చాక అమెరికాలోని ఇతర ప్రవాసులతోపాటు ఎన్నారైలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీసాలు, చదువు, ఉపాధి వగైరా అంశాల్లో సమస్యలెదురవుతున్నాయి. కొందరైతే చదువులు మధ్యలోనే వదులుకొని వెనక్కి రావాల్సివచ్చింది. అలాగే అక్కడ ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటున్నవారు ఆ దేశం దాటి బయటికొస్తే వెనక్కిరావడం అసాధ్యమన్న నిర్ణయానికొచ్చి తమ ఆప్తుల పెళ్లిళ్లు, ఇతర శుభకార్యా లకు హాజరుకావడం కూడా మానుకున్నారు. వీటితోపాటు చైనాతో చేస్తున్నంత స్థాయిలో కాకపో యినా భారత్‌తో కూడా ట్రంప్‌ టారిఫ్‌ల యుద్ధం మొదలెట్టి హడలెత్తించడానికి ప్రయత్నించారు. ఇవన్నీ సహజంగానే ఎన్నారైలలో ట్రంప్‌ పట్ల వ్యతిరేక భావన తీసుకొచ్చాయి. ఇప్పుడు మోదీ ఇచ్చిన పిలుపుతో ఇదంతా ఏమేరకు సమసిపోతుందో చూడాలి. ఇంత పెద్ద సదస్సుకు హాజరైన భారతీయుల్లో వివిధ రాష్ట్రాలకు చెందినవారున్నారని, వారి హృదయాలను స్పృశించాలని మోదీకి బాగా తెలుసు. అందుకే ప్రసంగం హిందీ, ఇంగ్లిష్‌లలో సాగినా... తెలుగుతోసహా అన్ని ప్రాంతీయ భాషల్లోనూ ‘భారత్‌లో అంతా బావుంది’ అంటూ పలికి వారిని ఉత్సాహపరిచారు. ప్రసంగాలకు ముందు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనల్లోనూ వివిధ రాష్ట్రాల సంప్రదాయ నృత్యాలు, ఇతర కళారూపాలు చోటుచేసుకోవడంలోనూ ఇదే ప్రతిఫలించింది.

కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తినిచ్చే 370వ అధికరణ రద్దు భారత్‌ ఆంతరంగిక వ్యవహారమని ఇప్పటికే ట్రంప్‌ ప్రభుత్వం ప్రకటించగా...కశ్మీర్‌ అంశాన్ని ఈ సభలో ప్రస్తావనకు తీసుకురావడం ద్వారా ట్రంప్‌ముందూ, ఆయతోపాటు ఆ వేదికపై కూర్చున్న పాతికమంది కాంగ్రెస్‌ సభ్యులు, గవర్నర్ల ముందూ మోదీ దృఢమైన వైఖరిని చాటగలిగారు. ఆ అధికరణ జమ్మూ–కశ్మీర్‌ అభివృద్ధికి ఆటంకంగా మారిందని, అది ఉగ్రవాదానికి ఊతమిచ్చిందని, వేర్పాటువాదాన్ని ప్రోత్సహించిందని ప్రధాని ఇచ్చిన వివరణ సభికులకు మాత్రమే కాదు... వారికి కూడా. చాలా అంశాల్లో తరచు పర స్పర విరుద్ధమైన అభిప్రాయాలు ప్రకటించి అయోమయంలో ముంచెత్తే అలవాటున్న ట్రంప్‌ బహుశా ఇకముందు కశ్మీర్‌ విషయంలో అలాంటి అయోమయానికి తావివ్వబోరని భావించవచ్చు. అలాగే కశ్మీర్‌ అంశంలో అమెరికాపై ఇంకా దింపుడు కళ్లం ఆశ పెట్టుకుని ఉంటే పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ దాన్ని వదులుకోక తప్పదు. అయితే కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన అంశంపై ఈమధ్య అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు కొందరు మాట్లాడుతున్నారు. దీనిపై అమెరికా ప్రభుత్వం స్పందించాలంటున్నారు. ఇప్పుడు మోదీ ఇచ్చిన వివరణ వారిని ఏమేరకు సంతృప్తిపరిచిందో చూడాలి. అగ్రరాజ్యమైనందువల్ల ప్రపంచంలోని ఏ అంశంపైన అయినా స్పందించే హక్కు తమ కున్నదని అమెరికా భావిస్తుంటుంది. 

వచ్చే రెండు రోజుల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు జరగాల్సి ఉంది. దాదాపు అయిదు దశాబ్దాలుగా మన దేశానికి సాధారణ ప్రాధాన్యతల వ్యవస్థ(జీఎస్‌పీ) కింద కల్పిస్తున్న వెసులుబాట్లను ఇటీవల ట్రంప్‌ రద్దు చేశారు. మన దేశం నుంచి దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై నిరుడు భారీగా సుంకాలు పెంచారు. వీటికి జవాబుగా మన దేశం కూడా మూడు నెలలక్రితం అమెరికా ఉత్పత్తులపై అదనపు సుంకాలు విధించింది. ఈ చర్చల్లో వీటిపై రాజీ కుదిరే అవకాశం ఉంది. 2018–19 మధ్య అమెరికాకు మన ఎగుమతుల విలువ రూ. 52,406 కోట్లుంటే, అక్కడి నుంచి దిగుమతులు రూ. 35,549 కోట్లు ఉన్నాయి. ఈ వాణిజ్యాన్ని మరింత పెంచడానికి ఇరు దేశాల అధినేతలూ ప్రయత్నిస్తారు.  హ్యూస్టన్‌ సభ ప్రభావంతో ఆ ఒప్పందం మన దేశానికి అనుకూలంగానే ఉంటుందనుకోవాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement