అత్యంత అమానుషమైన ఘటనలు చోటు చేసుకున్నప్పుడు సమాజం మొత్తం కదిలిపోతుంది. తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతాయి. వాటికి తగ్గట్టుగానే ప్రభు త్వాలు కూడా స్పందిస్తాయి. ఆరేళ్లక్రితం దేశ రాజధాని నగరంలో దుండగులు ఒక యువతిని క్రూరంగా హింసించి సామూహిక అత్యాచారం చేసినప్పుడు ఏ స్థాయిలో నిరసనలు, ఆందోళనలు చెలరేగాయో అందరికీ గుర్తుండే ఉంటుంది. పర్యవసానంగా నిండా రెండు నెలలు తిరగకుండా ఆనాటి యూపీఏ ప్రభుత్వం లైంగిక నేరాలపై తీవ్ర చర్యలకు వీలు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అంతే వేగంగా ఆ తర్వాత దాని స్థానంలో నిర్భయ చట్టం కూడా వచ్చింది.
ఇప్పుడు జమ్మూ–కశ్మీర్ రాష్ట్రంలోని కథువాలో దుండగులు ఎనిమిదేళ్ల బాలికను అపహరించి, ఆరు రోజులపాటు సామూహిక అత్యాచారం జరిపి ఆమె ఊపిరి తీసిన ఉదంతం వెల్లడయ్యాక మరోసారి దేశం అట్టుడికిపోయింది. అన్ని వర్గాల ప్రజలూ ఆ ఉదంతంపై స్పందించారు. దుండగులకు అనుకూలంగా ఆ రాష్ట్రంలోని బీజేపీ మంత్రులు ప్రకటనలివ్వడం, ఆ పార్టీ కార్యకర్తలు జాతీయ జెండాలతో ఊరేగి సంఘీభావం ప్రకటించడంలాంటి చర్యలపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకున్నాకే తీరు మారింది. ఆ వెంబడే బాలికలపై అత్యాచారాలకు పాల్పడే నేరగాళ్లకు యావజ్జీవ శిక్ష లేదా మరణశిక్ష విధించేందుకు వీలు కల్పిస్తూ, అందుకోసం భారత శిక్షాస్మృతికి, లైంగిక నేరగాళ్లనుంచి పిల్లలను పరిరక్షించడానికుద్దేశించిన పోక్సో చట్టానికి సవరణలు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.
అంతకంతకు పెరుగుతున్న లైంగిక నేరాలపై అందరిలో ఆందోళన నెలకొంది. ఏం చేస్తే దీనికి అడ్డుకట్ట పడుతుందన్న అంశంలో ప్రభుత్వాలకు స్పష్టత లేకుండా పోయింది. విపక్షంలో ఉన్నవారు ప్రభుత్వంపై విరుచుకుపడటం, ‘మీ హయాంలో ఇలాంటివి జరగలేదా’ అంటూ అధికార పక్ష నేతలు జవాబివ్వడం రివాజైంది. పౌర సమాజ కార్యకర్తలు, మహిళా సంఘాల నేతలు ఈ అంశంలో ఎన్నోసార్లు ప్రభు త్వాలను హెచ్చరిస్తూనే ఉన్నారు. కేవలం చట్టాలు చేసినంత మాత్రాన వాటికవే ఏ అన్యాయాన్నయినా రూపుమాపలేవని చెబుతూనే ఉన్నారు. కానీ ఆ వైపుగా పాలకులు దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. నిర్భయ చట్టం వచ్చినప్పుడు ఇకపై లైంగిక నేరాలు అదుపులోకొస్తాయని అనేకులు విశ్వసించారు.
కానీ అందుకు విరుద్ధంగా అవి పెరుగుతున్నాయి. 2016 నాటి జాతీయ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం మహిళలపై అత్యాచారాలు, ఇతర లైంగిక నేరాలు అంతక్రితం కంటే 2.9 శాతం పెరిగాయి. బాలికలపై లైంగిక నేరాలు సైతం గణనీయంగా పెరిగినట్టు ఆ నివేదిక తెల్పింది. 2015తో పోలిస్తే 2016లో ఈ తరహా నేరాలు 82 శాతం ఎక్కువయ్యాయని వివరించింది. మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, ఒదిశా, తమిళనాడుల్లో ఈ కేసులు అత్యధికంగా జరిగాయని పేర్కొంది. మెట్రో నగరాల్లో ఈ బెడద ఎక్కువని తెలిపింది. మరోపక్క పోక్సో కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలున్నా అవి నత్తనడకన సాగుతున్నాయని తేల్చింది.
నేరాలపై సత్వర దర్యాప్తు, నిందితుల అరెస్టు, పటిష్టమైన సాక్ష్యాధారాల సేకరణ, న్యాయస్థానాల్లో చకచకా విచారణ, త్వరగా వెలువడే తీర్పు నేరగాళ్లను భయకంపితుల్ని చేస్తాయి. నిర్భయ ఉదంతం తర్వాత జస్టిస్ జేఎస్ వర్మ నేతృ త్వంలో ఏర్పాటైన ముగ్గురు సభ్యుల కమిటీ దేశవ్యాప్తంగా వచ్చిన 80,000 సూచనల్ని అధ్యయనం చేసి, వాటిపై చర్చించి విలువైన సిఫార్సులు చేసింది. అదే స్థాయిలో ఆనాటి కేంద్ర ప్రభుత్వం వాటిని సమగ్రంగా అధ్యయనం చేసి ఉంటే నిర్భయ చట్టంతోపాటు లైంగిక నేరాల కట్టడి కోసం ప్రత్యేక చర్యలు అమలయ్యేవి. పసివాళ్లపై అత్యాచారాలు నిరోధించడానికై ఆ నేరాలకు ఉరిశిక్ష విధించాలని కోరుతూ మొన్న జనవరిలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైనప్పుడు ‘అన్నిటికీ మరణశిక్షే జవాబు’ అనే ధోరణి సరికాదని అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహ అభిప్రాయపడ్డారు.
ఇంతలోనే వైఖరి మార్చుకోవడానికి కారణం కథువా ఉదం తంపై జనంలో వెల్లువెత్తిన ఆగ్రహావేశాలను గమనించడం వల్లనేనని సులభంగానే చెప్పవచ్చు. సమాజంలో నిస్సహాయులుగా ఉండేవారిపైనే అత్యధికంగా నేరాలు జరుగుతాయి. వీటిల్లో అణగారిన వర్గాలవారు, మహిళలు, పిల్లలే బాధితులు. వీరి రక్షణకు ఉద్దేశించిన వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో ఎప్పటికప్పుడు తనిఖీ నిర్వహించాలని, అలసత్వాన్ని ప్రదర్శించేవారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని జస్టిస్ వర్మ కమిటీ సూచించింది. బాధితులపట్ల పోలీసులు, ఆసుపత్రులు ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పింది. అత్యవసర సమయాల్లో స్పందించడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించింది. నేరగాళ్లకు రాజకీయ రంగం అండదండ లందించడాన్ని ప్రస్తావించి దాన్ని సరిచేయాలని కోరింది.
ఈ సూచనలన్నీ పట్టిం చుకుని ఉంటే... బూతు చిత్రాల పరివ్యాప్తిని అరికట్టకలిగి ఉంటే మహిళలపై, పసివాళ్లపై అత్యాచారాలు ఈ స్థాయిలో పెచ్చరిల్లేవి కాదు. అందుకు భిన్నంగా నేరగాళ్లకు పోలీసులు మొదలుకొని రాజకీయ నేతలవరకూ అందరి అండదండలూ లభిస్తున్నాయి. బాధితుల గోడు వినిపించుకునేవారే కరువవుతున్నారు. వీటిని చక్క దిద్దకుండా కఠిన శిక్షలు అమల్లోకి తీసుకురావడంవల్ల ఎంతవరకూ ప్రయోజం ఉంటుంది? అది మరో నిర్భయ చట్టంలా మారే అవకాశం లేదా? పైగా పసివాళ్లపై అత్యాచారానికి పాల్పడేవారిలో 95 శాతంమంది వారికి తెలిసినవారేనని గణాం కాలు చెబుతున్నాయి. ఆ నేరానికి గరిష్టంగా మరణశిక్ష విధించడం వల్ల బాధిత కుటుంబాలపై ఒత్తిళ్లు ఎక్కువై అసలు కేసే బయటికి రాకుండా చూసే ప్రమాదం లేదా? ఇప్పుడు ఆర్డినెన్స్ ఎటూ తీసుకొచ్చారు. దీని స్థానంలో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినప్పుడైనా సమగ్ర చర్చ జరిగి ఇతరత్రా నివారణ చర్యలపై దృష్టి పెట్టడం ముఖ్యమన్న ఎరుక కలగాలి. సమాజంలో పతనమవుతున్న విలువల పరి రక్షణకు తీసుకోవాల్సిన చర్యలేమిటో ఆలోచించాలి.
Comments
Please login to add a commentAdd a comment