పదేళ్ల యూపీఏ పాలన తీరుతెన్నులు చూశాక దేశ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని బీజేపీకి పట్టంగట్టారు. సర్వేలన్నీ విజయం ఖాయమని చెబుతున్నా రాష్ట్రాల్లో కలిసొచ్చిన వారందరినీ కలుపుకోవాలని ఆ పార్టీ నిర్ణయించుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమిగా జనం ముందుకు వెళ్లినా సొంతంగానే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగల సంఖ్యాబలాన్ని బీజేపీ పొందగలిగింది. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అందరిలోనూ నెలకొన్న విశ్వాసమే అందుకు కారణం. ధరలను అదుపు చేస్తామని, ద్రవ్యోల్బణాన్ని అరికడతామని, విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్ల డబ్బును తిరిగి రప్పిస్తామని ఆ పార్టీ ఇచ్చిన హామీలు అందరినీ ఆకట్టుకున్నాయి. కుల, మత, ప్రాంతీయ అభిమానాలకు అతీతంగా జనం ఒక్కటై బీజేపీకి ఓటేశారు.
మోదీ ప్రభుత్వం ఏదో చేస్తున్నదనీ, వాటి ఫలితాలు అందబోతాయని వారందరూ ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆ విషయమై చర్చలు జరిగి తమ నుంచి జనం ఆశిస్తున్నదేమిటో, ఈ విషయంలో తాము ఇంకా చేయాల్సిందేమిటో బీజేపీ తెలుసుకోగలిగితే ఆ పార్టీ బలం మరింతగా ఇనుమడిస్తుంది. అలాంటిదేమీ జరగకపోగా ఆ పార్టీ ఎంపీలు, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు, మాట్లాడుతున్న మాటలు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. ఎన్నికల సమయంలో ‘మోదీ అంటే ఇష్టంలేనివారు పాకిస్థాన్ పొండ’ంటూ వ్యాఖ్యలు చేసిన గిరిరాజ్‌సింగ్ తర్వాత కేంద్రంలో మంత్రి అయ్యారు. అయినా ఆయన తన బాణీని మార్చుకోలేదు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక సభలో అరవింద్ కేజ్రీవాల్‌ను బంగారు జింక రూపంలో ఉన్న రాక్షసుడంటూ అభివర్ణించారు. మరో మంత్రి నిరంజన్ జ్యోతి ‘ఢిల్లీలో పాలించాల్సింది రాముడి సంతానమా, అక్రమ సంతానమా తేల్చుకోవాల’ంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు. నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలపై పార్లమెంటు ఉభయసభలూ స్తంభించాక స్వయంగా నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని ఆమె వ్యాఖ్యలు తప్పేనని వివరణనివ్వాల్సి వచ్చింది. ఆ గొడవ సద్దుమణగకముందే మరో ఎంపీ సాక్షి మహరాజ్ రంగంలోకొచ్చారు. ఆయన మహాత్ముడి హంతకుడు నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడని సంబోధించారు. అతను ‘పొరపాటున’ ఏమైనా చేసి ఉండొచ్చుగానీ దేశద్రోహి మాత్రం కాడంటూ వెనకేసుకొచ్చారు. జాతిపితగా ఈ దేశ ప్రజల మన్ననలందుకుంటున్న మహాత్ముడిని కాల్చిచంపడం ఆయన దృష్టిలో నేరం కాదు... కేవలం ‘పొరపాటు’ మాత్రమే! తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని ఆయన తర్వాత వివరణ ఇచ్చి ఉండొచ్చుగానీ కెమెరాలు అబద్ధం చెప్పవు.
ఆ విషయంలోనూ రాజ్యసభలో వివాదం చెలరేగాక మహాత్ముడి హంతకుడిని పొగిడే ఎలాంటి అంశాలకైనా ప్రభుత్వం వ్యతిరేకమని ప్రభుత్వం వివరణనిచ్చుకోవాల్సివచ్చింది. ఇదంతా ఇట్లా సాగుతుండగానే ఆగ్రాలో జరిగిన మత మార్పిళ్లు లోక్‌సభలో వివాదాన్ని రేపడం, దానిపై కూడా సర్కారు వివరణనివ్వడం తప్పలేదు. మరోపక్క అయోధ్యలో సాధ్యమైనంత త్వరగా రామమందిరం నిర్మించాలని ఈ దేశ పౌరులు కోరుకుంటున్నారని యూపీ గవర్నర్ రాంనాయక్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంకా కోర్టు విచారణలో ఉన్న ఈ వివాదంపై రాజ్యాంగ పదవిలో ఉన్న రాంనాయక్ ఇప్పటికిప్పుడు ఇలాంటి వ్యాఖ్య చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్థంకాని విషయం.
అభివృద్ధి నినాదంతో గద్దెనెక్కిన ప్రభుత్వం ఆర్థికరంగంలో అందుకు దోహదపడగల అనేక సంస్కరణలు ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించింది. పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లో ఆ అంశాలకు సంబంధించిన కీలక బిల్లులను ప్రవేశపెట్టబోతున్నట్టు చెప్పింది. ఆ బిల్లులు సజావుగా ఆమోదం పొందాలంటే అన్ని రాజకీయ పక్షాల మద్దతూ అవసరం. బీజేపీ ఆ దిశగా చేస్తున్న కృషి ఏమిటో తెలియదుగానీ ఆ పార్టీ ఎంపీలు, మంత్రులు మాత్రం కావలసినన్ని వివాదాలను నెత్తికెక్కించుకుంటున్నారు.
నిరంజన్ జ్యోతి విషయంలో తల బొప్పికట్టాకైనా తమ ఎంపీలను, తమకు మద్దతుగా నిలుస్తున్న సంఘ్ పరివార్ సంస్థలను అదుపు చేయలేని నిస్సహాయ స్థితిలో మోదీ ఎందుకున్నారో అర్థంకాదు. చెదురుమదురుగా సాగుతున్నట్టు కనబడుతున్న ఈ వ్యాఖ్యల వెనక ఒక పకడ్బందీ పథకం ఉన్నదనీ... ఈ దేశంలో దశాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఉన్న సెక్యులర్ భావజాలాన్ని దెబ్బతీయడమే దాని లక్ష్యమని కొందరు చేస్తున్న విశ్లేషణల్లో వాస్తవం ఉన్నదని ఎవరైనా అనుకుంటే అందుకు ప్రధాన బాధ్యత బీజేపీదే అవుతుంది. సుపరిపాలన అందిస్తామని, సామాజిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తామని చెప్పి అధికారంలోకొచ్చిన పార్టీ... ఆ విషయంలో తమ ప్రోగ్రెస్ రిపోర్టు ఏమిటో ప్రజలకు చెప్పవలసిన తరుణంలో ఇలా ఇతరేతర విషయాలపై తన శక్తియుక్తులన్నీ ధారపోయడం, నిత్యం సంజాయిషీలతో కాలక్షేపం చేయడం ప్రభుత్వ ప్రతిష్టను పెంచదని బీజేపీ నాయకగణం గుర్తించాలి.
ఒకపక్క మోదీ ‘మేకిన్ ఇండియా’ అని పిలుపునిస్తారు. కానీ, దేశంలో ప్రశాంత వాతావరణం లేకుండా ‘మేకిన్ ఇండియా’ విజయవంతం కావడం సాధ్యమేనా? సార్వత్రిక ఎన్నికల ముందు ఈ తరహా వివాదాలను రేకెత్తించి ఉంటే, అభద్రతను పెంచే వ్యాఖ్యలు చేసివుంటే అంతటి ఘనవిజయం సాధ్యమయ్యేదా? అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ నరేంద్ర మోదీ పూర్తిగా తనదైన ముద్ర ఉండేలా చూసుకున్నారు. తాను అనుకున్నవారికే కీలక పదవులిచ్చారు. వద్దనుకున్నవారిని ఎంతటి సీనియర్లయినా పక్కనబెట్టారు. రెండుచోట్లా పూర్తి పట్టు సాధించిన నాయకుడన్న అభిప్రాయం కలిగించారు. కానీ ఇలాంటి వివాదాలు ఆ అభిప్రాయాన్ని పలచనచేస్తాయి. అధికారంలోకొచ్చి ఆర్నెల్లు పూర్తవుతున్న తరుణంలో ఇప్పటికైనా పాలనపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలని... అనవసర వివాదాలకూ, ఉద్రిక్తతలకు ఆస్కారం లేకుండా చూసుకోవాలని బీజేపీ గుర్తించడం అవసరం.
వివాదాలతో కాలక్షేపం!
Published Sat, Dec 13 2014 1:29 AM | Last Updated on Sat, Aug 25 2018 4:39 PM
Advertisement