వైఎస్ చేశారు కాబట్టి తప్పా? | ysr doing .It is so wrong to have? | Sakshi
Sakshi News home page

వైఎస్ చేశారు కాబట్టి తప్పా?

Published Sat, Apr 12 2014 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 AM

వైఎస్ చేశారు కాబట్టి తప్పా?

వైఎస్ చేశారు కాబట్టి తప్పా?

 అదే లీజును బాబు హయాంలో ఇస్తే మాత్రం తప్పులేదా?
 ఓఎంసీకి లీజు మంజూరు చేసింది చంద్రబాబు కాదా?
ఎవరి హయాంలో లీజుకిచ్చినా ప్రభుత్వానికొచ్చే సొమ్ము ఒకటేగా?
అప్పటికే ఉన్న కంపెనీకి ఇవ్వలేదంటూ పిచ్చి రాతలెందుకు?
కొత్త కంపెనీకి ఇస్తే కొత్త ఉద్యోగాలు వస్తాయి కదా!
ఓఎంసీకి నాణ్యమైన, విలువైన ఖనిజం కట్టబెట్టేశారని రాసింది మీరేగా?
అక్కడ నాసిరకం తప్ప నాణ్యమైన ఖనిజం లేనేలేదని సీబీఐ తేలిస్తే మీ అబద్ధపు రాతలకు క్షమాపణ చెప్పలేదెందుకు?
అఖిలపక్షం డిమాండ్ చేయగానే ఓఎంసీకి కమిటీని పంపింది వైఎస్ కాదా?
బ్లాక్ గెలాక్సీపై చంద్రబాబు డ్రామాను ఎన్నడూ బయటపెట్టలేదేం?
వేల కోట్ల ముడుపులు చేతులు మారినా మీకు కనిపించలేదా?
     
ఇంకెన్నాళ్లు రామోజీ ఈ విషపురాతలు

 
 ఇవి ఎన్నికల కామెర్లు. ‘పచ్చ’ పార్టీ  కోసం కొనితెచ్చుకున్న పచ్చకామెర్లు. అంతే!! వచ్చే నెల 7న సీమాంధ్రలో పోలింగ్ ముగిసేదాకా రామోజీకి ఈ వ్యాధి తగ్గే చాన్సే లేదు. అందుకే రోజూ ప్రత్యేక పేజీలు పెట్టి మరీ విషం గక్కటం. లేకపోతే బాబు లీజుకిస్తే తప్పులేదట గానీ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఇచ్చిన లీజులు మాత్రం అన్నీ తప్పేనట!! ఒక కంపెనీకి బాబు ఇస్తే తప్పులేదు గానీ అదే కంపెనీకి వైఎస్సార్ ఇస్తే మాత్రం ఘోరమట!! నామా నాగేశ్వరరావుకు గ్రానైట్ లీజులిచ్చినా, రిలయన్స్‌కు కోస్తా తీరం మొత్తాన్ని కబళించేసుకోవచ్చని వీలునామా రాసేసినా... అవన్నీ జాతి ప్రయోజనాల కోసం చేసినవట!! ఎందుకంటే నామా బాబు అనుచరుడు కాబట్టి... రిలయన్స్ సంస్థ తన కంపెనీల్లో రూ.2,400 కోట్లు ‘‘పెట్టుబడి’’ పెట్టింది కాబట్టి!! ఇది ఏ మార్కు పాత్రికేయం రామోజీ? ఈ రాష్ట్రాన్ని ఇంకా ఎంతకాలం మీ రాతలతో అంధకారంలో ఉంచుతారు? గురువారంనాడు ‘ఘనులు తీసిన గోతులు’ అంటూ ఒక పేజీ నిండా వండేసిన మీ కథనం ఏ మార్కు జర్నలిజం? భూమిలో ఉన్న ఖనిజం తవ్వకుండా బయటికొస్తుందా? గనులు తవ్వాక గోతులు రాకుండా ఇంకేం వస్తాయి? ఇవెక్కడి రాతలు? వైఎస్సార్ హయాంలో జరిగిన ప్రతి పనికీ దురుద్దేశం అంటగట్టి... దానికి ఆయన్ను బాధ్యుడిని చేస్తూ రాస్తున్న రాతల్లో ‘‘ఏది నిజం?’’
 
 అనంతపురం జిల్లా డి.హీరేహళ్ మండలం ఓబుళాపురం గ్రామంలో ఓఎంసీకి 25.99 హెక్టార్లను లీజుకిచ్చింది సాక్షాత్తూ చంద్రబాబు నాయుడు. 1996, డిసెంబర్ 10న జీవో నంబరు 236 ద్వారా రామ్మోహన్‌రెడ్డికి ఈ లీజుకు అనుమతినిచ్చారు. 1997లో లీజు అగ్రిమెంట్ చేసుకున్నారు. 2002లో రామ్మోహన్‌రెడ్డి నుంచి ఈ లీజును ఓఎంసీకి బదలాయించింది కూడా చంద్రబాబు నాయుడి ప్రభుత్వమే. తర్వాత కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం నిర్మిస్తామన్న హామీతో వైఎస్ హయాంలో మరో రెండు లీజుల్ని ఓఎంసీ తీసుకుంది. ఇదీ... జరిగిన కథ. వైఎస్ ఇలా చేయటం వల్ల ప్రజా సంపద దుర్వినియోగమెలా అవుతుంది?

 ఎవరి హయాంలో లీజుకిచ్చినా ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో గానీ, పన్నుల రూపంలో గానీ వచ్చే సొమ్ములో తేడాలుంటాయా? ఏ కంపెనీకిచ్చినా సర్కారుకు వచ్చే సొమ్ము ఒకటేకదా! అయినా వెనకబడిన కడప జిల్లాలో 2 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఆరంభించి 10 మిలియన్ టన్నుల స్థాయికి విస్తరించేలా ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించబట్టే ఓఎంసీకి వైఎస్ ప్రభుత్వం లీజు మంజూరు చేసింది తప్ప ఊరికేకాదు. ఈ విషయాన్ని వైఎస్ అసెంబ్లీలోనే చెప్పారు. ఇందులో తప్పేంటి?

 అప్పటికే నడుస్తూ ఉన్న శాతవాహన లాంటి సంస్థలను పక్కనబెట్టి ఓఎంసీకి లీజుకు ఇచ్చేశారంటూ రామోజీ గగ్గోలు పెట్టారు. శాతవాహన ప్లాంటు నడుస్తోందంటే దానర్థమేంటి? దానికి ఖనిజం ఉన్నట్లేగా? దీనికి లీజు ఇవ్వడం కంటే కొత్త సంస్థకు ఇస్తే మరో ఫ్యాక్టరీ వస్తుందని, దీనివల్ల మరికొన్ని వేల మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఆలోచించటం తప్పా? రామోజీకి ఈ మాత్రం లేదా?
 అడ్డగోలుగా లీజులు కేటాయించారన్న రామోజీ వాదనలో నిజమెంత? లీజు కోసం వచ్చిన 30 దరఖాస్తుల వివరాలనూ కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపించటం, వాటన్నిటినీ పరిశీలించాక కేంద్రం ఓఎంసీకి లీజుకివ్వటం... ఇవన్నీ రామోజీకి మాత్రమే అడ్డగోలుగా కనిపిస్తాయెందుకు? తన కవల లాంటి చంద్రబాబు చేయలేదనా? లీజుల కేటాయింపులు, రాయల్టీ వసూలుకు సంబంధించిన నియమ నిబంధనలను కేంద్రం గానీ, రాష్ట్రం గానీ ఓఎంసీ కోసం ఏమైనా సవరించాయా? అందరికీ వర్తించిన నిబంధనల్నే దీనికీ అమలు చేశారుగా? చంద్రబాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనూ ఈ విధానం ప్రకారమే లక్షల హెక్టార్లకు లీజులు ఇచ్చారుగా? దీన్లో వైఎస్ మాత్రమే చేసిన తప్పేంటి?

 ఈ మతలబు మీకు తెలీదా రామోజీ?

 ప్రకాశం జిల్లాలో వేల కోట్ల రూపాయల విలువైన అత్యంత అరుదైన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్  నిక్షేపాలను ప్రైవేటు సంస్థలకు ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థకు రిజర్వు చేయాలంటూ 1998 డిసెంబర్ 23న చంద్రబాబు నేతృత్వంలోని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఏపీఎండీసీకి గనులను రిజర్వు చేయాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించడంతో ప్రైవేటు సంస్థలు రంగంలోకి దిగాయి. ఈ ప్రతిపాదనలు విరమించుకుంటే అత్యంత భారీ స్థాయిలో ముడుపులు ముట్టజెబుతామంటూ అప్పటి ప్రభుత్వ పెద్దతో కొందరు ప్రైవేటు ప్రతినిధులు రాయబారాలు నడిపారు. ఆయన కోరుకున్నదీ అదే. ఆయన ఆశించిందీ అదే. బాబు వ్యూహం మేరకు చర్చలు జరిగాయి. మంతనాల్లో కుదిరిన ఒప్పందం ప్రకారం... ప్రభుత్వ పెద్ద నుంచి అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. తదనుగుణంగా  కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు లేఖ రాశారు.

‘చీమకుర్తి, తాళ్లూరు మండలాల్లో బ్లాక్ గ్రానైట్ నిక్షేపాలున్న ప్రాంతాన్ని ఏపీఎండీసీకి రిజర్వు చేయాలన్న  ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది’ అన్నదే ఆ లేఖ సారాంశం. ఏపీఎండీసీకి గనుల రిజర్వేషన్ ప్రతిపాదనను విరమించుకున్న చంద్రబాబు సర్కారు చకచకా ప్రైవేటు సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి లీజులు మంజూరు చేసేసింది. జూలై 2000 నుంచి మార్చి 2004 మధ్య ఏకంగా 155 లీజుల కింద 363.945 హెక్టార్ల గ్రానైట్ క్వారీలను లీజుకు ఇచ్చేసింది. ఈ మొత్తం తతంగం ‘ఈనాడు’కు ఏనాడూ తప్పుగా అనిపించలేదు. ఎందుకంటే ఈ గలీజు కథ నడిపింది తన కవల లాంటి చంద్రబాబు కాబట్టి. వేరే రకంగా ఈ కుంభకోణం బయటకు రాలేదెందుకంటే... అప్పట్లో ‘సాక్షి’ లాంటి మీడియా లేదు కాబట్టి. ఉన్నదల్లా బాకా పత్రికలు, తోకపత్రికలే కాబట్టి!!! ఏమంటారు రామోజీ? ఇది కాదా అసలు నిజం!!
 
 
 ఇవీ... ‘ఈనాడు‘ అడ్డగోలు రాతలు..
 

 వైఎస్ ప్రభుత్వం ఓఎంసీకి అత్యంత నాణ్యమైన, విలువైన ఖనిజాన్ని కట్టబెట్టిందని, దాన్ని తవ్వేసి లక్షల కోట్లు గడించారని గతంలో రాసింది ‘ఈనాడే’. అయితే సీబీఐ దర్యాప్తు జరిపి... ఈ ప్రాంతంలో నాసిరకం ఖనిజం మాత్రమే ఉందని తేల్చటంతో మరో రాగం అందుకుంది. చుట్టుపక్కల వేరేవారు తవ్విన ఖనిజాన్ని... బెదిరించి గాలి జనార్దనరెడ్డి తక్కువ రేటుకు కొని, ఈ లీజు పర్మిట్‌తో ఎగుమతి చేశారని!! అంతే తప్ప తాను మొదట్లో రాసిన కథనాలన్నీ తప్పయినందుకు ఏనాడూ క్షమాపణ చెప్పింది లేదు. మరి దీన్నెలా అర్థం చేసుకోవాలి? రామోజీ రాతల్లో నిజమెంతో అర్థం కావటం లేదా? పెపైచ్చు తానేం చెప్పినా ‘ఎస్’ అనే అధికారుల్నే వైఎస్ పెట్టుకున్నారంటూ మరో దిగజారుడు రాత. ఏం! శ్రీలక్ష్మిని గానీ, కృపానందాన్ని గానీ ఐఏఎస్‌కు ఎంపిక చేసింది వై.ఎస్.రాజశేఖరరెడ్డా? వాళ్లు చంద్రబాబు హయాంలో పనిచేయలేదా? పర్మిట్లపై ఓఎంసీకి అంటగడుతున్న అభియోగాలన్నీ కోర్టులో ఉన్నవేగా? వాటిపై రామోజీ తీర్పులెందుకు? అయినా క్షేత్ర స్థాయిలో అధికారులో, సిబ్బందో తప్పు చేస్తే అది ముఖ్యమంత్రికెలా తెలుస్తుంది? ఆంధ్ర-కర్ణాటకల మధ్య గనుల సరిహద్దు రేఖలను తేల్చాలని రెండు రాష్ట్రాలూ ఏళ్ల తరబడి ప్రయత్నిస్తున్నా ఇప్పటికీ తేలలేదు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సరిహద్దును ఖరారు చేయాలని సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించి ఏడాదైనా ఇంకా మల్లగుల్లాలు నడుస్తూనే ఉన్నాయి.

ఈ సరిహద్దు రేఖ తేలే వరకూ ఏ లీజు సంస్థ ఎక్కడ అక్రమ తవ్వకాలు జరిపిందో నిర్ధారించలేమని సీబీఐ కూడా చెప్పింది. మరి ఈ వాస్తవాలన్నీ పక్కనబెట్టి రామోజీ రాస్తున్న రాతల్లో నిజం ఎంత? అయినా ఓఎంసీని వైఎస్ ఏనాడైనా వెనకేసుకొచ్చారా? ఆ సంస్థ మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడుతోందని, అఖిలపక్షాన్ని పంపాలని విపక్షాలు అడగ్గానే విపక్ష కమిటీని ఓబుళాపురం గనులకు పంపింది వైఎస్ కాదా? అక్కడికి వెళ్లొచ్చిన సభ్యులు తమ దృష్టికి ఎలాంటి అక్రమాలూ రాలేదని మీడియా సమక్షంలోనే ప్రకటించారు. ఇక బళ్లారి ఐరన్ ఓర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు, ఓఎంసీకి మధ్య సరిహద్దు వివాదం తలెత్తగా దానిపై ఉన్నతస్థాయి సర్వే బృందాన్ని నియమించిందీ వైఎస్సే. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇంతకంటే ఏం చేస్తారు? ఇవన్నీ వదిలిపెట్టి రామోజీ రాస్తున్న రాతలకు అర్థమేంటి?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement