పరిశోధనలే ప్రాణం... ప్రపంచ స్థాయి ప్రశంసలు | Appreciation of life in the world-class research | Sakshi
Sakshi News home page

పరిశోధనలే ప్రాణం... ప్రపంచ స్థాయి ప్రశంసలు

Published Thu, Oct 9 2014 2:39 AM | Last Updated on Sat, Sep 2 2017 2:32 PM

పరిశోధనలే ప్రాణం... ప్రపంచ స్థాయి ప్రశంసలు

పరిశోధనలే ప్రాణం... ప్రపంచ స్థాయి ప్రశంసలు

 ఆ యువకుడికి పరిశోధనలంటే ప్రాణం.. అలాని అందరిలా కాకుండా... వేల మందిలో ఒకడిలా ఉండాలనుకున్నాడు.  అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పేరు తీసుకురావాలనే సంకల్పంతో సాగుతున్నాడు. ఆ ప్రయత్నంలో ఇదివరకెవ్వరూ కనిపెట్టని సిలియమ్ అనే అరుదైన ప్రొటీన్ పదార్థం-దాని నిర్మాణం గుట్టును విప్పే పరిశోధనలకుప్రాణం పోశాడు. ఫలితం పలు ప్రపంచ వేదికలు వేనోళ్ల పొగిడాయి. ప్రతిష్టాత్మక సైన్స్ మ్యాగజైన్ అద్భుతం అంటూ ప్రశంసించింది..స్ర్టక్చరల్ బయాలజీ అండ్ బయో కెమిస్ట్రీ విభాగంలో రాణిస్తున్న తెలుగు తేజం, యువ శాస్త్రవేత్త సాగర్ భోగరాజు  సక్సెస్ స్పీక్. మాది నిజామాబాద్. నాన్న బీఆర్ వేణుగోపాలరావు. నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పని చేసి పదవీ విరమణ చేశారు. అమ్మ విజయలక్ష్మి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. తమ్ముడు సత్యం. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. మేమిద్దరం కాన్పూర్ ఐఐటీలోనే చదువుకున్నాం.
 
 తెలుగు మీడియం విద్యార్థినే:
 పదో తరగతి వరకు చదువంతా తెలుగు మీడియంలోనే సాగింది. ఇంటర్మీడియెట్ ఇంగ్లిష్ మీడియం కావడంతో ప్రారంభంలో కొంత ఇబ్బంది అనిపించింది. చిన్నప్పటి నుంచి శాస్త్రవేత్తగా స్థిరపడాలనేది కోరిక. దానికితోడు పరిశోధనలంటే ఆమితమైన ఆసక్తి. అందుకే ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ చదివినప్పటికీ.. ఐఐటీలో చేరాక బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్‌పై దృష్టి సారించాను. అంతేకాకుండా ఐఐటీ ఇంజనీరింగ్‌లో రెండు సార్లు జూనియర్ సైంటిస్ట్ పురస్కారాలను కూడా అందుకున్నాను.
 
 మ్యూనిచ్ వర్సిటీకి ఎంపిక:

 2008లో ఢిల్లీలోని ఎవాల్యూ సర్వ్ అనే మేధో హక్కుల సంస్థలో క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చింది. అక్కడ పనిచేస్తూ, జర్మనీ దేశం మ్యూనిచ్ నగరంలోని మ్యాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయో కెమిస్ట్రీలో పీహెచ్‌డీకి దరఖాస్తు చేశాను. 2009లో ఆ వర్సిటీ ఐదు దశల్లో ఐదురోజుల పాటు ఇంటర్వ్యూ నిర్వహించింది. ఐదుగురు ప్రొఫెసర్లు వివిధ విభాగాలకు సంబంధించి ప్రశ్నలు అడిగారు. అందు లో కనబరిచిన ప్రతిభతో పాటు బయోకెమిస్ట్రీలో నేను ఎంచుకున్న అంశం భిన్నంగా ఉండడంతో పీహెచ్‌డీకి అవకాశం లభించింది. గతేడాది పీహెచ్‌డీ పూర్తయి ప్రస్తుతం పోస్టు డాక్టోరల్‌ఫెలోషిప్ చేస్తున్నాను.
 
 బయోకెమిస్ట్రీనే ఎందుకంటే:

 ఐఐటీ పూర్తి చేసినవారు సాధారణంగా సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడడం సహజం. కానీ చిన్నప్పటి నుంచి శాస్త్రవేత్త కావాలన్నది నా లక్ష్యం.ఇందుకు సరైన మార్గం ఏమిటా? అని ఆలోచించాను. మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులంటే చాలా ఇష్టం. అలా ఆ రెండింటికి అనుబంధంగా ఉండేలా బయోటెక్నాలజీలో ఎంటెక్ చేశాను. బయో కెమిస్ట్రీలో పరిశోధనలకు బోలెడంత అవకాశం ఉంది కాబట్టి నేను సాఫ్ట్‌వేర్ వైపు వెళ్లలేదు.
 
 సిలియంపై పరిశోధన:
 జ్ఞానేంద్రియ శక్తులకు మూల కారణమైన కణ నిర్మాణమే సిలియం. ఇది ఓ రకమైన ప్రోటీన్ సముదాయం. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయి. పీహెచ్‌డీలో భాగంగా ఐదేళ్ల నుంచి మ్యాక్స్ ప్లాంక్ యూనివర్సిటీలో ఇదే అంశంపై పరిశోధనలు చేస్తున్నాను.  ఈ దిశగా ఒంటరిగానే ముందుకు వెళుతున్నాను.
 
 సైన్స్ మ్యాగజైన్ ప్రశంస
 ప్రపంచ శాస్త్రవేత్తలకు సంబంధించిన సైన్స్ మ్యాగజైన్‌లో నా పరిశోధనలపై 2013 జూలై 31న ప్రత్యేక వ్యాసం ప్రచురితమైంది. సిలియం కణ భాగ నిర్మాణం-దాని ప్రొటీన్ సముదాయం, ఐఎఫ్‌టి-81 ప్రొటీన్ నిర్మాణంపై పరిశోధనలు అరుదైనవిగా సైన్స్ మ్యాగజైన్ ప్రశంసించడం మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. అలాగే ఇటలీ, పారిస్, లండన్, స్పెయిన్, స్విట్జర్లాండ్,అమెరికాలలో జరిగిన పలు అంతర్జాతీయ సైన్స్ వేదికలపై నా పరిశోధనలను వివరించాను. అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తల నుంచి ప్రశంసలు లభించాయి. ఫార్చ్యూన్ ఆర్గనైజేషన్ కూడా నా కృషి అత్యంత ప్రధానమైనదిగా అభివర్ణించింది.
 
 పక్కా ప్రణాళికే దిక్సూచి:
 సాధించాలనే సంకల్పానికి పక్కా ప్రణాళిను జతచేస్తే విజయం సాధించగలం. ఎంచుకున్న లక్ష్యం ఏదైనా ఈ విజయ సూత్రాన్ని పాటిస్తే ఎవరైనా సఫలీకృతులవుతారన్నది నా నమ్మకం.
 
 దేశానికి పేరు తీసుకురావాలి:
 స్ట్రక్చరల్ బయాలజీ అండ్ బయో కెమిస్ట్రీ విభాగంలో శాస్త్రవేత్తగా రాణించి మన దేశానికి పేరు తీసుకురావాలన్నదే లక్ష్యం.
 
 అకడెమిక్ ప్రొఫైల్
 టెన్త్: 499/600 మార్కులు
 ఇంటర్: 960/1000 మార్కులు
 ఎంసెట్: 3 వేల ర్యాంకు
 గేట్ (2006): 115 వ ర్యాంకు
 
 సహకారం: సంజీవ్ బర్కుంట,
 నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్.
 
 మీ సలహాలు,
 సందేహాలు పంపాల్సిన చిరునామా:
 సాక్షి భవిత,
 కేరాఫ్ సాక్షి జర్నలిజం స్కూల్,
 8-2-696, 697/75/1, సితార గ్రాండ్ హోటల్ పక్కన, రోడ్ నెం.12,
 బంజారాహిల్స్,
 హైదరాబాద్-500008.
 ఈ-మెయిల్ :
 sakshieducation@gmail.com
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement