టి. మురళీధరన్
టి.ఎం.ఐ. నెట్‌వర్క్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ) ఆఫర్ చేస్తున్న కోర్సుల వివరాలు తెలపండి?
- చరణ్, గద్వాల్.
దేశంలోని ప్రముఖ డిజైనింగ్ స్కూళ్లలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ) ఒకటి. ఈ సంస్థకు అహ్మదాబాద్, గాంధీనగర్, బెంగళూరులలో క్యాంపస్‌లు ఉన్నాయి.
కోర్సుల వివరాలు:
గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రాం ఇన్ డిజైనింగ్ (జీడీపీడీ). స్పెషలైజేషన్లు: ఇండస్ట్రియల్ డిజైన్, కమ్యూనికేషన్ డిజైన్, టెక్స్‌టైల్స్ డిజైన్.
అర్హత : ఇంటర్ ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత.
వ్యవధి: నాలుగేళ్లు
ప్రవేశాలు: డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (డీఏటీ) ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రాం ఇన్ డిజైనింగ్ (పీజీడీపీడీ). ఈ కోర్సు అహ్మదాబాద్, గాంధీనగర్, బెంగళూరు క్యాంపస్‌లలో ఉంది. స్పెషలైజేషన్లు: ప్రొడక్ట్ డిజైన్, ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్ డిజైన్, సిరామిక్ అండ్ గ్లాస్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్, యానిమేషన్ ఫిల్మ్ డిజైన్, ఫిల్మ్ అండ్ వీడియో కమ్యూనికేషన్, టెక్స్‌టైల్స్ డిజైన్, ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ ఆటోమొబైల్, టాయ్ అండ్ గేమ్, ఫొటోగ్రఫీ, అపెరల్, లైఫ్ స్టైల్ యాక్సెసరీస్, న్యూమీడియా.
అర్హత: ఎంపిక చేసుకున్న ప్రోగ్రాంను బట్టి ఆయా ప్రోగ్రాంలో నాలుగేళ్ల డిగ్రీ లేదా డిప్ల్లొమా (10+2+4) కోర్సు చేసి ఉండాలి.
వ్యవధి: మూడేళ్లు
ప్రవేశం: డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (డీఏటీ) ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
డిజైనింగ్‌లో యూజీ కోర్సులను అహ్మదాబాద్ క్యాంపస్ మాత్రమే ఆఫర్ చేస్తుంది.
వివరాలకు: www.nid.edu
కెరీర్: డిజైనింగ్ కోర్సులు పూర్తిచేసిన తర్వాత ఎంచుకున్న స్పెషలైజేషన్ ఆధారంగా వివిధ రంగాల్లో అవకాశాలు ఉంటాయి. ఈ క్రమంలో మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్స్, ఫ్యాషన్, ఆర్కిటెక్చర్, ఎంటర్‌టైన్‌మెంట్, ఇంటీరియర్ డిజైన్, అడ్వర్టైజింగ్, ఐటీ వంటి నిత్య నూతన వస్తువులను ఉత్పత్తి చేసే రంగంలో అవకాశాలను దక్కించుకోవచ్చు.
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) ప్రవేశ ప్రక్రియ వివరాలను తెలపండి?
-మధు, మెదక్.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్న ఆసియా ఆర్థిక వ్యవస్థను ఉన్నత శిఖరాల దిశగా నడిపించడానికి అవసరమైన, సమర్థవంతమైన బిజినెస్ లీడర్‌సను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) ఏర్పాటైంది. ఈ ఇన్‌స్టిట్యూట్‌కు హైదరాబాద్, మొహాలీ (పంజాబ్)లలో క్యాంపస్‌లు ఉన్నాయి. ఐఎస్‌బీ.. షార్ట్ టర్మ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (పీజీపీ) ఇన్ మేనేజ్‌మెంట్, డాక్టోరల్ డిగ్రీతో సమానమైన ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్, పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ ఫెలోషిప్ వంటి కోర్సులను ఆఫర్ చేస్తుంది.
అండర్ గ్రాడ్యుయేట్ అభ్యర్థుల కోసం ఐఎస్‌బీ యంగ్ లీడర్స్ ప్రోగ్రామ్‌ను కూడా అందిస్తుంది. పీజీపీలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, స్ట్రాటజీ అండ్ లీడర్‌షిప్ వంటి ఎలక్టివ్స్ ఉన్నాయి.
ప్రతి కోర్సుకు భిన్నమైన ప్రవేశార్హతలను ఐఎస్‌బీ నిర్దేశించింది. సాధారణంగా జీమ్యాట్ స్కోర్, మేనేజీరియల్ అనుభవం, నాయకత్వ లక్షణాలు వంటి అంశాలాధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నారు.
వివరాలకు: www.isb.edu
రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఆఫర్ చేసే పీహెచ్‌డీ కోర్సు వివరాలను తెలపండి?
- శ్రీధర్, నిజామాబాద్.
భారత ప్రభుత్వ అణు శక్తి విభాగం ఏర్పాటు చేసిన ప్రధాన పరిశోధన సంస్థల్లో రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ-ఇండోర్ ఒకటి. ఈ ఇన్‌స్టిట్యూట్ యాక్సిలేటర్స్, లేజర్స్ సంబంధిత అంశాల్లో పీహెచ్‌డీ కోర్సును అందిస్తుంది. ఈ కోర్సులో ఏడాది కోర్సు వర్క్, నాలుగేళ్ల రీసెర్చ్ వర్క్ ఉంటుంది.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎంఎస్సీ (ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ లైఫ్ సెన్సైస్). సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్‌లో నిర్దేశిత అర్హత సాధించిన విద్యార్థులకు నిర్వహించే ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వివరాలకు: www.cat.ernet.in
ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ఐఎస్‌ఎం)-ధన్‌బాద్ అందించే ఎంబీఏ కోర్సులో చేరేందుకు అర్హత, ప్రవేశ ప్రక్రియ విధానాన్ని తెలపండి?
- శేఖర్, సంగారెడ్డి
ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ఐఎస్‌ఎం)-ధన్‌బాద్, రెండేళ్ల ఎంబీఏ, మూడేళ్ల ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ కోర్సులను అందిస్తుంది.
ఎంబీఏ (రెండేళ్ల కోర్సు): 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు కోర్సులో చేరేందుకు అర్హులు.
ప్రవేశాలు: క్యాట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ (మూడేళ్ల కోర్సు): 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. పేరున్న ప్రభుత్వ, ప్రైవేటు, సెమీ గవర్నమెంట్ సంస్థల్లో ఎగ్జిక్యూటివ్/సూపర్‌వైజర్‌గా ఏడాది అనుభవం అవసరం.
ప్రవేశం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
వివరాలకు: www.ismdhanbad.ac.in