మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ | India is the third largest economy | Sakshi
Sakshi News home page

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

Published Thu, Nov 6 2014 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

వార్తల్లో వ్యక్తులు
 ప్రసార భారతి చైర్మన్‌గా ఎ. సూర్య ప్రకాశ్
 ప్రసార భారతి బోర్డు చైర్మన్‌గా సీనియర్ పాత్రికేయుడు, పయనీర్ పత్రిక కన్సల్టింగ్ ఎడిటర్ ఎ. సూర్య ప్రకాశ్ అక్టోబరు 28న ఎంపికయ్యారు. ఆయన ఈ హోదాలో మూడేళ్లు కొనసాగుతారు.
 
 మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్
 మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా దేవేంద్ర గంగాధర్ ఫడ్నవీస్ (44) అక్టోబరు 31న ముంబయిలో ప్రమాణ స్వీకారం చేశారు.
 
 ఐసీసీఆర్ అధ్యక్షునిగా లోకేశ్‌చంద్ర
 సాంస్కృతిక సంబంధాల భారతీయ మండలి (ఇండియా కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్) చైర్మన్‌గా లోకేశ్‌చంద్రను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అక్టోబరు 27న నియమించారు. ఆయన పదవీకాలం ముడేళ్లు.
 
 ఐరాస శాంతి పరిరక్షణ కమిటీలో భారతీయుడు
 ఐక్యరాజ్య సమితి అత్యున్నత శాంతి పరిరక్షణ కమిటీలో భారత విశ్రాంత సైన్యాధికారి లెఫ్టినెంట్ జనరల్ అభిజిత్ గుహా నియమితులయ్యారు. 14 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలో ఆయనను సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ నియమించారు.
 
 అవార్డులు
 ఉత్తమ కేంద్రీయ వర్సిటీకి రాష్ట్రపతి అవార్డు
 ఉన్నత విద్యలో అత్యుత్తమ ఫలితాలను సాధించేలా కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించేందుకు  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ‘విజిటర్స్’ అవార్డులను నెలకొల్పారు. ఉత్తమ వర్సిటీతోపాటు పరిశోధన, నూతన ఆవిష్కరణలకు సంబంధించి ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. రాష్ట్రపతి సందర్శకుని(విజిటర్)గా ఉన్న కేంద్రీయ  వర్సిటీలకు ఈ అవార్డు పొందేందుకు అర్హత ఉందని రాష్ట్రపతి  భవన్ తెలిపింది. ఉత్తమ వర్సిటీకి ప్రశంసాపత్రం, పరిశోధనలకు రూ. లక్ష చొప్పున నగదు అందజేస్తారు.
 
 మన్మోహన్‌సింగ్‌కు జపాన్ పురస్కారం
 మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ జపాన్ జాతీయ పురస్కారం ది గ్రాండ్ కార్డన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ పౌలోనియా ఫ్లవర్స్‌కు ఎంపికయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు, మైత్రీ బంధం పటిష్టతలో మన్మోహన్ కృషిని ఆ దేశం గుర్తించింది. ఈ గౌరవం లభించిన తొలి భారతీయుడు మన్మోహన్‌సింగ్.
 
 మలాలాకు ప్రపంచ బాలల అవార్డు
 నోబెల్ శాంతి బహుమతి విజేత, పాక్ బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసుఫ్ జాయ్ ప్రపంచ బాలల అవార్డు (వరల్డ్ చిల్డ్రన్స్ ప్రైజ్ )ను అక్టోబరు 29న స్వీడన్‌లోని స్టాక్ హోమ్‌లో అందుకున్నారు. బాలల నోబెల్‌గా పిలిచే ఈ అవార్డును 2000లో ఏర్పాటు చేశారు.
 
 జాతీయం
 భారత్‌లో పర్యటించిన వియత్నాం ప్రధాని
 వియత్నాం ప్రధాన మంత్రి గుయెన్ టాన్ డుంగ్ భారత్‌లో పర్యటించారు. అక్టోబరు 28న ప్రధాని మోదీతో సమావేశమై పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. వీటిలో ప్రధానమైనది ఓఎన్‌జీసీ లిమిటెడ్, పెట్రో వియత్నాం సంస్థల మధ్య ఒప్పందం. దీని ప్రకారం దక్షిణ చైనా సముద్రంలో భారత్ కొత్తగా ఒక చమురు బ్లాకు, మరో సహజ వాయువు బ్లాకులో అన్వేషణ చేపడుతుంది. ఈ ప్రాంతంపై చైనా, వియత్నాంల మధ్య వివాదం కొనసాగుతోంది.
 
 న్యూఢిల్లీలో సార్క్ విద్యా మంత్రుల సదస్సు
 దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య (సార్క్) విద్యా మంత్రుల, అధికారుల రెండో సదస్సు న్యూఢిల్లీలో అక్టోబరు 31న జరిగింది. సమాచార సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, విద్యా నాణ్యతను మెరుగుపరచుకోవడంలో పరస్పరం సహకరించుకోవాలని సదస్సు నిర్ణయించింది.
 
 కర్ణాటకలో 12 నగరాలకు కొత్త పేర్లు
 59వ కర్ణాటక రాజ్యోత్సవంలో అక్టోబరు 31న రాష్ట్ర ప్రభుత్వం 12 నగరాలకు కొత్త పేర్లను ప్రకటించింది. బెంగ ళూర్‌ను బెంగళూరు, మంగుళూర్‌ను మంగళూరు, బెల్గామ్‌ను బెలగావీ, గుల్బర్గాను కలబురగి, మైసూర్‌ను మైసూరు, హుబ్లీని హుబ్బలీగా పిలుస్తారు.
 
 భారత మత్స్యకారులకు ఉరిశిక్ష విధించిన శ్రీలంక
 భారత్‌కు చెందిన ఐదుగురు తమిళ జాలర్లకు శ్రీలంక లోని కొలంబో హైకోర్టు అక్టోబరు 30న ఉరిశిక్ష విధించింది. 2001లో భారత్ నుంచి శ్రీలంకకు మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ చేశారన్న అభియోగాలపై కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
 
 రాష్ట్రీయం
 తెలంగాణకు ఇండియా టుడే అవార్డు
 తెలంగాణ రాష్ట్రం ఇండియా టుడే అవార్డుకు ఎంపికయింది. మౌలిక వనరులున్న అతిపెద్ద రాష్ట్రం (బిగ్ బెస్ట్ స్టేట్ ఇన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్)గా తెలంగాణ ప్రథమస్థానంలో నిలిచింది. కేంద్ర సాంకేతిక,సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేతుల మీదుగా తెలంగాణ పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అవార్డును న్యూఢిల్లీలో అందుకున్నారు.
 
 ఛత్తీస్‌గఢ్ నుంచి 1000 మె.వా. విద్యుత్తు
 1000 మెగావాట్ల విద్యుత్తును ఛత్తీస్‌గఢ్ నుంచి కొనుగోలు చేసేందుకు తెలంగాణ ఒప్పందం కుదుర్చుకొంది. నవంబరు 3న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రమణ్‌సింగ్, కేసీఆర్‌ల సమక్షంలో ఇంధన శాఖ కార్యదర్శులు రాయ్‌పూర్‌లో సంతకాలు చేశారు.
 
 రాష్ట్ర ఉత్సవంగా ‘సంజీవయ్య’ జయంతి
 మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి రోజైన ఫిబ్రవరి 14న రాష్ట్ర ఉత్సవంగా జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబరు 30న ఉత్తర్వులు జారీ చేసింది.
 
 కాకినాడలో తొలి మహిళా బ్యాంకు
 ఆంధ్రప్రదేశ్‌లో తొలి భారతీయ మహిళా బ్యాంకును తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో నవంబరు 1న ఆ బ్యాంకు సీఎండీ ఉషా అనంత సుబ్రమణ్యన్ ప్రారంభించారు.
 
 అరేబియా సముద్రంలో నీలోఫర్ తుపాను
 అరేబియా సముద్రంలో ఏర్పడిన నీలోఫర్ తుపాను నవంబరు 1న గుజరాత్‌లో కచ్ జిల్లాలోని నాలియా గ్రామం వద్ద తీరం దాటింది. దీనివల్ల సౌరాష్ట్ర, కచ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. నీలోఫర్ కారణంగా ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడ్డాయి.
 
 
 సైన్స్ అండ్ టెక్నాలజీ
 విజయవంతంగా షార్ ఎయిర్ డ్రాప్ పరీక్ష
 శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) అక్టోబరు 31న ఎయిర్ డ్రాప్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. మానవ రహిత ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి, తర్వాత భూ వాతావరణంలోకి తీసుకువచ్చేందుకు ఈ ప్రయోగం నిర్వహించారు.
 
 భూమికి చేరిన చైనా లూనార్ ఆర్బిటర్
 చంద్రుడి కక్ష్యను చేరిన చైనా వ్యోమనౌక జియావోఫియ్ వారం రోజుల తర్వాత తిరిగి నవంబరు 1న భూమికి చేరింది. ఈ నౌకను అక్టోబరు 24న లాంగ్‌మార్చ్ రాకెట్ ద్వారా ప్రయోగించారు. 8.40 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన ఈ ఆర్బిటర్ భూమి, చంద్రుడి ఫోటోలు తీసి పంపింది. చంద్రుడి కక్ష్యలోకి వ్యోమ నౌకను పంపి తిరిగి భూమికి తీసుకొచ్చిన మూడో దేశంగా చైనా నిలిచింది. ఇప్పటికే అమెరికా, రష్యాలు ఈ ఘనత సాధించాయి.
 
 కూలిన వ్యోమనౌక స్పేస్ షిప్- 2
 రోదసీలోకి పర్యాటకులను తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన వ్యోమనౌక స్పేస్‌షిప్-2 అక్టోబరు 31న కాలిఫోర్నియాలోని మొజావీ ఎడారిలో కూలిపోయింది. వర్జిన్ గెలాక్టిక్ అనే సంస్థ ఈ నౌకను రూపొందించి, పరీక్షిస్తున్నప్పుడు అది 45 వేల అడుగుల ఎత్తులో పేలిపోయింది. 2015లో ఇది సిద్ధం కావాల్సి ఉంది.
 
 
 క్రీడలు
 ఐఎస్‌ఎస్‌ఎఫ్ చైర్మన్‌గా అభినవ్ బింద్రా
 భారత షూటర్ అభినవ్ బింద్రా అంతర్జాతీయ షూటింగ్ క్రీడల సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) చైర్మన్‌గా ఎంపికయ్యాడు. ఈ నిర్ణయాన్ని ఐఎస్‌ఎస్‌ఎఫ్ అక్టోబరు 30న ప్రకటించింది. ప్రస్తుతం బింద్రా ఈ కమిటీలో సభ్యునిగా ఉన్నాడు. కాగా ఈ హోదాలో నియమితులైన తొలి భారతీయుడు ఆయనే.
 
 రూ.250 కోట్లు చెల్లించాలని  విండీస్‌కు బీసీసీఐ నోటీసు
 వెస్టిండీస్ క్రికెట్ ఆటగాళ్లు సిరీస్‌ను రద్దుచేసుకొని అర్థంతరంగా తిరిగి వెళ్లడంతో నష్టపరిహారంగా రూ. 250 కోట్లు చెల్లించాలని వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ నోటీసు ఇచ్చింది. పారితోషికం విషయంపై విండీస్ ఆటగాళ్లు,బోర్డుకు మధ్య వివాదం నెలకొనడంతో భారత్‌లో జరగనున్న మ్యాచ్‌లు ఆగిపోయాయి. దీంతో బీసీసీఐకి పలు రూపాల్లో భారీ నష్టం వాటిల్లింది.
 
 పంకజ్ అద్వానీకి ప్రపంచ  బిలియర్డ్స్ చాంపియన్ టైటిల్
 భారత బిలియర్డ్స్ క్రీడాకారుడు పంకజ్ అద్వానీ టైమ్ ఫార్మాట్‌లో ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఇంగ్లండ్‌లోని లీడ్స్‌లో అక్టోబరు 29న జరిగిన ఫైనల్‌లో రాబర్డ్ హాల్ (ఇంగ్లండ్) ను ఓడించాడు. మూడోసారి గ్రాండ్ డబుల్ సాధించిన తొలి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. కాగా కెరీర్‌లో 12వ ప్రపంచ టైటిల్. మహిళల టైటిల్ విజేత ఎమ్మా బోని (ఇంగ్లండ్). ఈమె రెవన్న ఉమాదేవి (భారత్)పై విజయం సాధించింది.
 
 బ్రాడ్‌మన్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సచిన్, స్టీవ్‌వాకు చోటు
 మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ (భారత్), స్టీవ్‌వా (ఆస్ట్రేలియా)లకు బ్రాడ్‌మన్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు లభించింది. అక్టోబరు 29న సిడ్నీ మైదా నంలో నిర్వహించిన కార్యక్రమంలో సచిన్, స్టీవ్‌వా పేర్లను గార్డ్ ఆఫ్ ఆనర్స్‌లో చేర్చినట్లు బ్రాడ్‌మన్ ఫౌండేషన్ ప్రకటించింది.
 
 సెంట్రల్ జోన్‌కు దులీప్ ట్రోఫీ
 దులీప్ ట్రోఫీని సెంట్రల్ జోన్ క్రికెట్ జట్టు గెలుచుకుంది. నవంబరు 2న న్యూఢిల్లీలో జరిగిన పైనల్‌లో సౌత్ జోన్‌ను సెంట్రల్‌జోన్ ఓడించి పదేళ్ల తర్వాత తిరిగి దులీప్‌ట్రోఫీని దక్కించుకుంది. ఈ ట్రోఫీని సెంట్రల్‌జోన్ గెలుచుకోవడం ఆరోసారి.
 
 అంతర్జాతీయ
 లింగ అసమానత్వ సూచీలో భారత్‌కు 114వ స్థానం
 ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్)-2014 లింగ అసమానత్వ సూచీలో భారత్ 114 వ స్థానంలో నిలిచింది. గతేడాది ఉన్న 101 స్థానం నుంచి 13 స్థానాలు భారత్ దిగజారింది. మొత్తం 142 దేశాల పనితీరు ఆధారంగా అక్టోబరు 28న విడుదల చేసిన సూచీలో మొదటి స్థానంలో ఐస్‌లాండ్ నిలిచింది.
 
 పాలస్తీనాను అధికారికంగా గుర్తించిన స్వీడన్
 పాలస్తీనా ప్రాంతాన్ని అధికారికంగా గుర్తించిన తొలి యూరోపియన్ యూనియన్ దేశంగా స్వీడన్ నిలిచింది. ఇప్పటివరకు 130 ఇతర దేశాలు పాలస్తీనాను అధికారికంగా గుర్తించాయి.
 
 బంగ్లాదేశ్ జమాత్ అధ్యక్షుడికి మరణశిక్ష
 బంగ్లాదేశ్ జమాత్-ఇ-ఇస్లామీ అధ్యక్షుడు ఎం.రహ్మాన్ నిజామి (71)కు బంగ్లాదేశ్ యుద్ధ నేరాల ట్రైబ్యునల్ అక్టోబరు 29న మరణశిక్ష విధించింది. 1971 యుద్ధంలో అనేక మంది లౌకిక వాద మేధావుల హత్యలతో పాటు ఇతర నేరాల్లో కారకుడిగా గుర్తించిన ట్రైబ్యునల్ నిజామికి ఈ శిక్షను ఖరారు చేసింది.
 
 జపాన్‌లో ఫెస్టివల్ ఆఫ్ ఇండియా
 జపాన్ రాజధాని టోక్యోలో ఏడాదిపాటు రెండు దశల్లో జరిగే ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమం అక్టోబరు 27 న ప్రారంభమయింది. ఈ ఏడాది ఆగస్టులో ఆ దేశంలో పర్యటించిన ప్రధాని మోదీ జపాన్-భారత్ ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరిచే ఉద్దేశంతో ఫెస్టివల్ ఆఫ్ ఇండియాను నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
 
 వ్యాపార అనుకూల దేశాల్లో భారత్‌కు 142వ స్థానం
 ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన వ్యాపార అనుకూల దేశాల జాబితాలో భారత్ 142వ స్థానంలో నిలిచింది. మొత్తం 189 దేశాలకు సంబంధించిన జాబితాను ప్రపంచ బ్యాంకు అక్టోబరు 29న విడుదల చేసింది. సింగపూర్, న్యూజిలాండ్, హాంకాంగ్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.
 
 మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
 పర్చేజింగ్ పవర్ పారిటీ (పీపీపీ) విభాగంలో భారత్ మూడో స్థానంలో నిలిచిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రకటించింది. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం అక్టోబరులో పీపీపీ అంశంలో భారత్ 7277.279 బిలియన్ అమెరికన్ డాలర్లతో స్థూల జాతీయోత్పత్తిలో 6.8 శాతాన్ని చేరింది. చైనా ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో 16.48 శాతంతో మొదటి స్థానంలో, అమెరికా ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో 16.28 శాతంతో రెండోస్థానంలో నిలిచాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement