ఐరాస మానవ హక్కుల మండలికి భారత్ ఎన్నిక | India re-elected to UN Economic and Social Council | Sakshi
Sakshi News home page

ఐరాస మానవ హక్కుల మండలికి భారత్ ఎన్నిక

Published Thu, Oct 30 2014 4:20 AM | Last Updated on Tue, Jun 4 2019 6:37 PM

ఐరాస మానవ హక్కుల మండలికి భారత్ ఎన్నిక - Sakshi

ఐరాస మానవ హక్కుల మండలికి భారత్ ఎన్నిక

వార్తల్లో వ్యక్తులు
 హర్యానా ముఖ్యమంత్రిగా ఖట్టర్
 హర్యానా 10వ ముఖ్యమంత్రిగా మనోహర్‌లాల్ ఖట్టర్ (60) అక్టోబరు 26న బాధ్యతలు చేపట్టారు. ఆ రాష్ట్ర గవర్నర్ సోలంకి సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. హర్యానా రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత బీజేపీ సర్కారు కొలువు దీరడం ఇదే తొలిసారి. హర్యానా ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న తొలి పంజాబీ ఖట్టర్.
 
 ఇండోనేసియా అధ్యక్షునిగా జోకో విడోడో
 ఇండోనేసియా ఏడో అధ్యక్షునిగా జోకో విడోడో అక్టోబరు 20న ప్రమాణ స్వీకారం చేశారు. రాజకీయాలకు, సైన్యానికి చెందని తొలి అధ్యక్షుడు ఆయనే కావడం విశేషం. జూలైలో జరిగిన ఎన్నికల్లో మాజీ సైనికాధికారి ప్రబోవో సుబియాంతోపై జోకో విజయం సాధించారు.
 
 బ్రెజిల్ అధ్యక్షురాలిగా రౌసెఫ్ తిరిగి ఎన్నిక
 బ్రెజిల్ అధ్యక్షురాలిగా వర్కర్స్ పార్టీకి చెందిన దిల్మా రౌసెఫ్ తిరిగి ఎన్నికయ్యారు. అక్టోబరు 26న ప్రకటించిన ఫలితాల్లో ఆమెకు 51.6 శాతం ఓట్లు రాగా, ప్రతిపక్ష ఆసియో నెవెస్‌కు 48.36 శాతం ఓట్లు దక్కాయి.
 
 సుప్రీం కోర్టు సెక్రటరీ జనరల్‌గా అవధాని
 సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌గా వి.ఎస్.ఆర్. అవధాని అక్టోబరు 26న బాధ్యతలు స్వీకరించారు. ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా నరసరావుపేట.
 
 సుస్థిరాభివృద్ధిపై ప్రపంచ పరిశోధన మండలి చైర్మన్‌గా జైరాం రమేశ్
 సుస్థిరాభివృద్ధిపై ఏర్పాటైన ప్రపంచ పరిశోధన మండలి చైర్మన్‌గా మాజీ కేంద్రమంత్రి జైరాం రమేశ్‌ను అక్టోబరు 25న ఖరారు చేశారు. ఫ్యూచర్ ఎర్త్ ఎంగేజ్‌మెంట్ అనే ఈ వేదికను యూఎన్‌ఈపీ (యునెప్), యునెస్కో, ప్రపంచ పర్యావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) ఏర్పాటు చేశాయి. ప్రపంచ పర్యావరణ మార్పునకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కోవడంలో ఈ మండలి వ్యూహాత్మక సలహాలను అందిస్తుంది.
 
 జాతీయం
 జాతీయ ఐక్యతా దినోత్సవంగా పటేల్ జయంతి

 భారత ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన అక్టోబరు 31ని జాతీయ ఐక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివాస్)గా కేంద్రం ప్రకటించింది.
 
 బొగ్గు గనుల కేటాయింపు ఆర్డినెన్స్‌కు
 రాష్ట్రపతి ఆమోదం

 బొగ్గు గనులను ఇ-వేలం ద్వారా ప్రైవేటు కంపెనీలకు అప్పగించేందుకు రూపొందించిన ఆర్డినెన్స్‌ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అక్టోబరు 21న ఆమోదించారు. దీన్ని కేంద్ర కేబినెట్ అక్టోబరు 20న ఆమోదించింది. బొగ్గు గనుల కేటాయింపులో అవకతవకలపై స్పందిస్తూ 1993 నుంచి జరిగిన 214 బొగ్గు గనుల కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. దీని ప్రకారం ప్రైవేటు కంపెనీల వినియోగానికి ఇ-వేలం ద్వారా బొగ్గు గనులు కేటాయిస్తారు.
 
 సియాచిన్‌లో మోదీ పర్యటన
 జమ్మూ-కాశ్మీర్‌లోని సియాచిన్‌లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అక్టోబరు 23న దీపావళి పండుగను సైనికులతో జరుపుకున్నారు. సియాచిన్ ప్రాంతం ప్రపంచంలోనే ఎత్తై యుద్ధ క్షేత్రం.
 
 2014-15లో భారత వృద్ధి రేటు 5.6 శాతం: ప్రపంచ బ్యాంకు
 2014-15లో భారత స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5.6 శాతంగా ఉంటుందని ఇండియా డెవలప్‌మెంట్ అప్‌డేట్ పేరుతో అక్టోబరు 27న విడుదల చేసిన నివేదికలో ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. వేగవంతమైన సంస్కరణలు, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు చేపట్టడం వల్ల 5.6 శాతం వృద్ధికి అవకాశం ఉంటుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఈ వృద్ధి రేటు 2015-16లో 6.4 శాతం, 2016-17లో 7 శాతం ఉండొచ్చని అంచనా వేసింది.
 
 విదేశాల్లో నల్లధనం ఉన్న వారి పేర్లను
 వెల్లడించిన కేంద్రం

 విదేశీ బ్యాంకుల్లో అక్రమంగా ధనం దాచిన వారి పేర్లను కేంద్రం అక్టోబరు 27న సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. ఇందులో డాబర్ ఇండియా ప్రమోటర్ ప్రదీప్ బర్మన్, రాజ్‌కోట్‌కు చెందిన పంకజ్ చిమన్‌లాల్, గోవా గనుల సంస్థకు చెందిన రాధా సతీష్ టింబ్లోతోపాటు ఒక కంపెనీ సహా ఎనిమిది మంది పేర్లు ఉన్నాయి.
 
 అవార్డులు
 మలాలాకు లిబర్టీ మెడల్

 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, పాకిస్థాన్ బాలికల విద్యా హక్కుల కార్యకర్త మలాలా యూసుఫ్ జాయ్‌కి అమెరికా లిబర్టీ మెడల్-2014 దక్కింది. దీన్ని ఆమె ఫిలడెల్ఫియాలో అక్టోబరు 21న జరిగిన కార్యక్రమంలో అందుకున్నారు. 1988లో నేషనల్ కాన్‌స్టిట్యూషన్ సెంటర్ ఈ అవార్డును ఏర్పాటు చేసింది. స్వేచ్ఛ కోసం పోరాటం చేసిన వ్యక్తులకు ఇచ్చే ఈ పురస్కారాన్ని అందుకున్న అత్యంత పిన్న వయస్కురాలు మలాలా.
 
 పాలగుమ్మికి వరల్డ్ మీడియా సమ్మిట్ అవార్డు
 ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్ 2014 వరల్డ్ మీడియా సమ్మిట్ గ్లోబల్ అవార్డ్స్ ఫర్ ఎక్స్‌లెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయనతో పాటు అల్ జజీరా ఇంగ్లిష్, యు.ఎస్.ఎ టుడే, గ్లోబల్ పోస్ట్ సంస్థలు అవార్డుకు ఎంపికయ్యాయి.
 
 భారతీయ అమెరికన్ సాహిల్‌కు
 యంగ్ సైంటిస్ట్ అవార్డు

 భారతీయ-అమెరికన్ విద్యార్థి సాహిల్ దోషికి 2014 అమెరికా టాప్ యంగ్ సైంటిస్ట్ అవార్డు లభించింది. పిట్స్‌బర్గ్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న సాహిల్ కార్బన్ డయాక్సైడ్ నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే పొల్యూసెల్ అనే పరికరాన్ని రూపొందించాడు. ఇది గృహ వినియోగం కోసం విద్యుత్తును అందించడంతోపాటు కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది.
 
 అశ్వికా కపూర్‌కు పండా అవార్డు
 కోల్‌కతాకు చెందిన అశ్వికా కపూర్‌కు ప్రతిష్టాత్మక పండా అవార్డు లభించింది. యూకేలోని బ్రిస్టల్‌లో జరిగిన వైల్డ్ స్క్రీన్ చిత్రోత్సవాల్లో అక్టోబరు 24న ఈ అవార్డును ఆమె అందుకున్నారు. న్యూజిలాండ్‌లో మాత్రమే కనిపించే కకాపో చిలుక (గుడ్లగూబ చిలుక) జీవితం ఆధారంగా సిరొక్కో అనే లఘు చిత్రాన్ని నిర్మించినందుకు ఈ పురస్కారం లభించింది. గ్రీన్ ఆస్కార్‌గా పిలిచే ఈ అవార్డును పొందిన తొలి భారతీయ మహిళా అశ్వికా కపూర్.
 
 కాన్డే యెమ్‌కెల్లాకు నాయుడమ్మ అవార్డు
 ఐక్యరాజ్యసమితి అండర్ సెక్రటరీ జనరల్ డాక్టర్ కాన్డే యెమ్‌కెల్లా డాక్టర్ నాయుడమ్మ-2014 అవార్డుకు ఎంపికయ్యారు. దీన్ని నవంబర్ 13న చెన్నైలో బహుకరిస్తామని నాయుడమ్మ ఫౌండేషన్ తెలిపింది.
 
 కిరణ్‌కు గ్లోరియా బ్యారన్ బహుమతి
 గ్లోరియా బ్యార న్ ప్రైజ్ ఫర్ యంగ్ హీరోస్ బహుమతికి భారత-అమెరికన్ కిరణ్ (16) ఎంపికయ్యాడు. ‘వేస్ట్ నో ఫుడ్’ అనే వెబ్ ఆధారిత సర్వీసును ప్రారంభించినందుకు అతడికి ఈ బహుమతి లభించింది.
 
 అంతర్జాతీయం
 ఐరాస మానవ హక్కుల మండలికి భారత్ ఎన్నిక

 ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్‌ఆర్‌ిసీ)కి భారత్ తిరిగి ఎన్నికైంది. 2014 అక్టోబరు 21న జనరల్ అసెంబ్లీలో 47 దేశాల మండలికి జరిగిన ఎన్నికలో భారత్ విజయం సాధించింది. ప్రస్తుత సభ్యత్వం ఈ  డిసెంబర్‌తో ముగుస్తుంది. తిరిగి ఎన్నికవడంతో 2017 చివరి వరకు సభ్యదేశంగా కొనసాగుతుంది. వరుసగా రెండుసార్లు సభ్యత్వం పొందిన దేశం మూడోసారి పోటీ పడేందుకు వీలులేదు.
 
 ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్
 బ్యాంక్ ఏర్పాటు

 ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఎఐఐబీ) అక్టోబరు 24న బీజింగ్ కేంద్రంగా ఏర్పాటైంది. ఆసియా దేశాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు సమకూర్చే లక్ష్యంతో ఏర్పాటైన ఎఐఐబీ 2015 నుంచి పనిచేస్తుంది. దీనికి 100 బిలియన్ డాలర్ల అధీకృత మూలధనం సమకూరుస్తారు. చైనా ఆర్థికశాఖ ఉప మంత్రి జిన్ లిక్వన్ ఈ బ్యాంకుకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఈ బ్యాంక్‌కు సంబంధించిన అవగాహన పత్రంపై చైనా, భారత్‌తోపాటు మొత్తం 20 దేశాలు సంతకాలు చేశాయి. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి ఒత్తిళ్ల నుంచి బయట పడేందుకు ఆసియా దేశాలకు ఈ బ్యాంకు దోహదపడుతుంది.
 
 కుబేరులను అందించిన
 ముంబై వర్సిటీ

 ప్రపంచ వ్యాప్తంగా కుబేరులను అందించిన విశ్వ విద్యాలయాల జాబితాలో ముంబై వర్సిటీ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇందులో చదువుకున్న 12 మంది పూర్వ విద్యార్థులు వంద కోట్లకు అధిపతులు అయ్యారు. వెల్త్-ఎక్స్ యూబీఎస్ బిలియనీయర్ గణాంకాల ప్రకారం అమెరికాకు చెందిన పెన్సిల్వేనియా విశ్వ విద్యాల యం అగ్రస్థానంలో నిలిచింది.
 
 అఫ్గాన్‌లో సైనిక కార్యకలాపాలకు
 బ్రిటన్ ముగింపు

 అఫ్గానిస్థాన్‌లో సైనిక కార్యకలాపాలకు బ్రిటన్ అధికారికంగా అక్టోబరు 26న ముగింపు పలికింది. లష్కర్ గాహ్‌లో తమ నియంత్రణలో ఉన్న స్థావరాలను ఆఫ్గాన్ సైన్యానికి అప్పగించింది. దీంతో 13 ఏళ్లుగా కొనసాగిన బ్రిటన్ సైనిక చర్యలు ముగిశాయి. నాటో దళాలు ఏర్పాటు చేసిన అతిపెద్ద స్థావరం లష్కర్ గాహ్.
 
 క్రీడలు
 ఫెదరర్‌కు స్విస్ టైటిల్

 రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) స్విస్ ఇండోర్స్ (బాసెల్) టైటిల్‌ను గెలుచుకున్నాడు. అక్టోబరు 26న జరిగిన ఫైనల్‌లో డేవిడ్ గోఫిన్(బెల్జియం)పై విజయం సాధించాడు. ఫెదరర్ ఈ టెర్నీని గెలుచుకోవడం  ఆరోసారి.
 
 బాక్సర్ సరితా దేవి సస్పెన్షన్
 ఆసియా క్రీడల్లో పతకాన్ని స్వీకరించేందుకు నిరాకరించిన భారతీయ మహిళా బాక్సర్ సరితాదేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) తాత్కాలికంగా వేటు వేసింది. దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో జినా పార్క్ (దక్షిణ కొరియా)తో జరిగిన పోటీలో సరితా ఆధిక్యాన్ని కాదని పార్క్‌ను విజేతగా ప్రకటించారు. దీంతో ఆమె కలతచెంది పతకాన్ని తిరస్కరించడాన్ని ఏఐబీఏ తప్పు పట్టింది.
 
 సాకేత్‌కు ఏటీపీ డబుల్స్ టైటిల్
 ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేని పుణె ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. అక్టోబరు 24న జరిగిన ఫైనల్‌లో సాకేత్-సనమ్ సింగ్ జోడి థాయ్‌లాండ్‌కు చెందిన రటి వటానా-సొంచాట్ జోడీపై విజయం సాధించారు. సాకేత్‌కు ఇది మూడో ఏటీపీ చాలెంజర్ టోర్నీ డబుల్స్ టైటిల్.
 
 సానియా జోడీకి డబ్ల్యూటీఏ టోర్నీ ైటె టిల్
 సానియామీర్జా (భారత్)-కారాబ్లాక్ (జింబాబ్వే) జోడీ డబ్ల్యూటీఏ పైనల్స్ టోర్నీ టైటిల్ గెలుచుకుంది. అక్టోబరు 26న జరిగిన ఫైనల్‌లో సు వి సై (చైనీస్ తైపీ), సువయ్ పెంగ్ (చైనా) జోడీని ఓడించారు. సానియాకిది తొలి డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీ టైటిల్ కాగా కారా బ్లాక్‌కు మూడోది. ప్రైజ్‌మనీ రూ. 3 కోట్లు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను సెరెనా విలియమ్స్ గెలుచుకుంది. ఫైనల్లో ఆమె సిమోనా హలెప్ (రొమేనియా)ను ఓడించింది. సెరెనాకు ఇది వరుసగా మూడో డబ్ల్యూటీఏ టైటిల్.
 
 ఆసియా పారాగేమ్స్‌లో శరత్ రికార్డు
 భారత స్విమ్మర్ శరత్ మహదేవరావు గైక్వాడ్ ఆసియా పారాగేమ్స్‌లో ఆరు పతకాలతో రికార్డు నెలకొల్పాడు. ఇంచియాన్ (దక్షిణ కొరియా)లో అక్టోబరు 24న పురుషుల మెడ్లీ రిలే రేసులో శరత్‌తోపాటు, భారత బృందం కాంస్యం సాధించింది. అంతకు ముందు శరత్ ఐదు ఈవెంట్లలో కాంస్యాలు సాధించాడు. దీంతో ఆసియా క్రీడల్లో (పారా గేమ్స్‌తో కలిపి) అత్యధిక పతకాలు సాధించిన భారత క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. గతంలో పి.టి.ఉష 1986లో నాలుగు స్వర్ణాలు, ఒక రజతంతో ఐదు పతకాలు సాధించింది.
 
 పంకజ్ అద్వానీకి ప్రపంచ బిలియర్డ్స్
 చాంపియన్ టైటిల్
 భారత్‌కు చెందిన పంకజ్ అద్వానీ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్ షిప్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. అక్టోబరు 24న లీడ్స్‌లో జరిగిన 150 అప్ పాయింట్స్ ఫార్మేట్ పోటీ ఫైనల్‌లో మాజీ చాంపియన్ పీటర్ గిల్ క్రిస్ట్ (సింగపూర్) ను పంకజ్ ఓడించాడు. పంకజ్ కెరీర్‌లో ఇది 11వ ప్రపంచ టైటిల్.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement