సివిల్స్ మెయిన్స్ జాగ్రఫీకి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియజేయండి? | Let us know how to prepare for Civils Mains Geography ? | Sakshi
Sakshi News home page

సివిల్స్ మెయిన్స్ జాగ్రఫీకి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియజేయండి?

Published Wed, Jul 9 2014 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM

సివిల్స్ మెయిన్స్ జాగ్రఫీకి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియజేయండి?

సివిల్స్ మెయిన్స్ జాగ్రఫీకి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియజేయండి?

- పి.సంయుక్త, తిలక్‌నగర్
కాంపిటీటివ్ కౌన్సెలింగ్ : సివిల్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్-1లో జాగ్రఫీకి సంబంధించి సిలబస్‌లో పేర్కొన్న అంశాలు:  వరల్డ్ జాగ్రఫీ-కీలక అంశాలు, ప్రపంచవ్యాప్తంగా (దక్షిణాసియా, భారత ఉపఖండంతో సహా) ప్రధాన సహజ వనరుల విస్తరణ, ప్రపంచ వ్యాప్తంగా (భారత్ సహా) వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఉనికి.
 
 గతంతో పోలిస్తే జనరల్ స్టడీస్ పేపర్‌లో జాగ్రఫీ సబ్జెక్టు పరిధి విస్తృతమైంది. గతేడాది కేవలం ఇండియా జాగ్రఫీని మాత్రమే సిలబస్‌లో పేర్కొంటే.. ఈసారి వరల్డ్ జాగ్రఫీని అదనంగా చేర్చారు. జాగ్రఫీకి సంబంధించి ఏ మూల నుంచైనా ప్రశ్నలు రావొచ్చు. ఈ నేపథ్యంలో జాగ్రఫీ ఆప్షనల్‌తో పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ పేపర్లో మంచి స్కోర్ సాధించడానికి వీలుంది.  
 
 వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీ: వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీలోని అంశాలకు ఆకాశమే హద్దు. అందువల్ల ప్రిపరేషన్‌లో భాగంగా తొలుత బేసిక్ అంశాలపై పట్టు సాధించాలి. ఆ తర్వాత ముఖ్యమైన అంశాలను, సమకాలీన అంశాలతో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలి. ఇందులోని ముఖ్యాంశాలు.. భూ స్వరూపాలు (ల్యాండ్ ఫార్మ్స్), వాతావరణం, మృత్తికలు, సహజ ఉద్భిజాలు(నేచురల్ వెజెటేషన్) వంటి భౌతిక, భౌగోళిక అంశాలు. వీటిని రెండు విధాలుగా విభజించి చదవాలి. అప్పుడే పేపర్‌లో గరిష్టంగా మార్కులు సాధించడానికి వీలుంటుంది.
 
 భౌతిక, భౌగోళిక అంశాలు: 1. సమకాలీన ప్రాధాన్యం ఉన్న అంశాలు. 2. ప్రత్యేక లక్షణాలున్న అంశాలు.
  ఓ విషయం గురించి చదువుతున్నప్పుడు ఆ అంశం నుంచి ఎలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశముందో ఆలోచించి చదవాలి. అప్పుడే ప్రిపరేషన్ సఫలీకృతమవుతుంది.
 ఉదా: శీతోష్ణస్థితి అనే అంశంపై చదువుతున్నప్పుడు ఒక ప్రాంతంలోని శీతోష్ణస్థితి అక్కడి ఆర్థిక వ్యవస్థపై ఎలా ప్రభావం చూపుతోందన్న దానిపై దృష్టి సారించాలి.
 ముఖ్యమైన భూభౌతిక దృగ్విషయాలు: భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, తుపానులు తదితరాలు. తొలుత ఈ అంశాలపై శాస్త్రీయ అవగాహన పెంపొందించుకోవాలి. తర్వాత అవి ఎక్కడెక్కడ.. ఎందుకు? సంభవిస్తున్నాయో తెలుసుకోవాలి.
 -  మానవ జోక్యం వల్ల ఏ భౌగోళిక అంశాల్లో మార్పులు వస్తున్నాయి? ఆయా మార్పుల ప్రభావం ఏమిటి? వంటి అంశాలపై దృష్టి సారించాలి. క్లుప్తంగా చెప్పాలంటే.. ‘అభివృద్ధి-పర్యావరణం’ కోణంలో చదవాలి.
 -  జాగ్రఫీ సిలబస్‌లోని మరొక కీలకాంశం- ముఖ్యమైన సహజ వనరుల విస్తరణ. దీనిపై
 ప్రిపరేషన్‌లో భాగంగా సహజ వనరుల్లో ప్రధానమైనవి, సమకాలీన (వివాదాల్లో ఉండటం వంటివి) ప్రాధాన్యం ఉన్నవి ఏమిటో గుర్తించాలి. ఏ రకమైన వనరులు ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి.. అలా ఉండటానికి అనుకూలించిన పరిస్థితులు ఏమిటి? తదితర విషయాలపై అభ్యర్థులు అవగాహన పెంపొందించుకోవాలి.  ఓ ప్రాంత అభివృద్ధిలో అక్కడి సహజ వనరులు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయో చూడాలి. అభివృద్ధికి, వనరుల విస్తరణకు మధ్య సంబంధాన్ని అవగతం చేసుకోవాలి. సహజ వనరుల విస్తరణకు సంబంధించి దక్షిణాసియా, భారత ఉపఖండానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రపంచంలో ఏ ప్రాంతాల్లో ఏ రకమైన పరిశ్రమలు ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి? దానికి గల కారణాలేంటి? వనరుల విస్తరణకు, పరిశ్రమల అభివృద్ధికి మధ్య సంబంధాలను అధ్యయనం చేయాలి. పరిశ్రమలకు సంబంధించి భారత్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
 ఇన్‌పుట్స్:  గురజాల శ్రీనివాసరావు, సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్
 
  విపత్తుల గుర్తింపులో ప్రాథమిక భావనల ప్రాధాన్యం ఏమిటి? వివిధ పోటీ పరీక్షల్లో ఈ అంశం నుంచి ఏమైనా ప్రశ్నలు అడుగుతున్నారా?
 - సందీప్‌రెడ్డి, కుషాయిగూడ
 
 గత యూపీఎస్సీ, ఎపీపీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే విపత్తు నిర్వహణ పాఠ్యాంశం నుంచి కొన్ని ప్రశ్నలను తరచూ అడుగుతున్నారు.  విపత్తుల చారిత్రక పరిశీలన, ప్రాథమిక భావనలను క్షుణ్నంగా అర్థం చేసుకున్నప్పుడే.. ఈ పాఠ్యాంశం నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చినా సులభంగా సమాధానాలు రాయగలరు. ఒక భౌగోళిక ప్రాంతంలో సంభవించిన దుర్ఘటన విపత్తు అవునా? కాదా? అని తెలుసుకోవడానికి విపత్తు ప్రాథమిక భావనలు ఉపయోగపడతాయి. ఎందుకంటే.. అన్ని వైపరీత్యాలు విపత్తు రూపాన్ని సంతరించుకోలేవు. ఉదాహరణకు.. వివిధ పోటీ పరీక్షల్లో అడిగిన కొన్ని ప్రశ్నలను పరిశీలించండి.
    విపత్తులను నమోదు చేసే కార్యక్రమం ఎప్పటినుంచి మొదలైంది?
 సమాధానం: క్రీ.పూ.435
    2005లో భారత ప్రభుత్వం నెలకొల్పిన విపత్తు నిర్వహణ సంస్థ దేశంలో, వివిధ ప్రాంతాల్లో  సంభవించే విపత్తులను ఎన్ని రకాలుగా విభజించింది?
 సమాధానం: 31
 వాస్తవాధారిత ప్రశ్నలు, మరికొన్ని ఎనలిటికల్ బేస్డ్ ప్రశ్నలను కూడా విపత్తుల నిర్వహణ పాఠ్యాంశం నుంచి అడుగుతున్నారు.  ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను   ఆరో తరగతి నుంచి ఇంటర్  వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌లో ఉన్న పాఠ్యపుస్తకాల నుంచి గ్రహించవచ్చు.  కాబట్టి అభ్యర్థులు దీన్ని దృష్టిలో ఉంచుకుని అధ్యయనం కొనసాగించాలి.
 ఇన్‌పుట్స్: ఎ.డి.వి.రమణ రాజు
  సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ జాగ్రఫీ, హైదరాబాద్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement