నల్సార్‌లో ఏవియేషన్ అండ్ స్పేస్ ‘లా’ కోర్సులు.. | Nalsarlo Aviation and Space 'Law' courses | Sakshi
Sakshi News home page

నల్సార్‌లో ఏవియేషన్ అండ్ స్పేస్ ‘లా’ కోర్సులు..

Published Wed, Jun 17 2015 11:30 PM | Last Updated on Tue, Oct 16 2018 8:54 PM

Nalsarlo Aviation and Space 'Law' courses

నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (నల్సార్)... అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఈ ఇన్‌స్టిట్యూట్ వినూత్న కోర్సులకు వేదికగా మారుతోంది. న్యాయ విద్య కోర్సులకే పరిమితం కాకుండా  మేనేజ్‌మెంట్ కోర్సులు సైతం ప్రారంభించిన ఈ సంస్థ.. తాజాగా ఏవియేషన్ అండ్ స్పేస్ ‘లా’ కోర్సులను అందిస్తోంది. ఈ రంగంలో ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న వారితోపాటు, తాజా గ్రాడ్యుయేట్లకు సైతం ఉన్నత కెరీర్ అవకాశాలు కల్పించే ఈ కోర్సుల వివరాలు..
 
 ప్రస్తుతం నల్సార్‌లో ఏవియేషన్ అండ్ స్పేస్ ‘లా’స్‌కు సంబంధించి నాలుగు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి..
 
 మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఏవియేషన్ లా అండ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్ (వ్యవధి: రెండేళ్లు)
 మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్పేస్ అండ్ టెలికమ్యూనికేషన్ ‘లా’ స్ (వ్యవధి: రెండేళ్లు)
 పీజీ డిప్లొమా ఇన్ ఏవియేషన్ లా అండ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్ (వ్యవధి: ఏడాది)
 పీజీ డిప్లొమా ఇన్ జీఐఎస్ అండ్ రిమోట్ సెన్సింగ్ ‘లా’స్ (వ్యవధి: ఏడాది)
 
 ఆన్‌సైట్- ఆన్‌లైన్ విధానంలో:
 ఈ కోర్సుల ప్రత్యేకత.. బోధన ఆన్‌సైట్, ఆన్‌లైన్ విధానంలో ఉండటం. అంటే.. ప్రవేశం పొందిన వారు రోజూ తరగతులకు హాజరు కానక్కర్లేదు. అయితే ముందస్తుగా పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం నిర్దేశిత తేదీల్లో క్లాస్ రూం టీచింగ్ ఉంటుంది. దీనికి అదనంగా నిత్యం ఆన్‌లైన్ టీచింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్‌కు ఈ విధానం ఎంతో అనుకూలం.
 
 అర్హతలు:
 ఈ కోర్సుల్లో చేరేందుకు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా మూడేళ్ల వ్యవధిలో ఉండే ఎయిర్ క్రాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా డిగ్రీతోపాటు సంబంధిత రంగంలో మూడేళ్ల పని అనుభవం.
 
 దరఖాస్తు ఇలా:
 ఔత్సాహిక అభ్యర్థులు నిర్దేశిత నమూనాలోని దరఖాస్తు ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. పూర్తిచేసిన దరఖాస్తుకు స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్‌ను, నిర్ణీత మొత్తం ఫీజు డీడీ (రూ.వేయి)ను ‘రిజిస్ట్రార్, నల్సార్-సీఎఎస్‌ఎల్ అకౌంట్’ పేరుతో హైదరాబాద్‌లో చెల్లేలా రిజిస్ట్రార్, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, జస్టిస్ సిటీ, శామీర్‌పేట్, రంగారెడ్డి జిల్లా చిరునామాకు పంపాలి.
 
 ఎంపిక విధానం:
 ఇది మూడు దశల్లో ఉంటుంది. అవి.. ముందుగా దరఖాస్తుదారులు పంపిన స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్‌లలో వారి రాత నైపుణ్యాలను పరిశీలించి దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. తర్వాత అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహించి వాటిలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది జాబితా రూపొందిస్తారు.
 దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 30, 2015
 www.nalsar.ac.in, www.casl.nalsar.ac.in
 
 ఆధునిక అవసరాలకు సరితూగేలా..
 ఏవియేషన్ అండ్ స్పేస్ ‘లా’స్ కోర్సుల ప్రధాన ఉద్దేశం ఆధునిక అవసరాలు తీర్చిదిద్దేలా నిపుణులను తీర్చిదిద్దడం. ప్రస్తుతం దేశంలో ఏవియేషన్ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. దాంతోపాటు ఎయిర్‌పోర్ట్‌లు కూడా విస్తరిస్తున్నాయి. పీపీపీ విధానంలో వీటి సంఖ్య మరింత పెరుగుతోంది. 12వ పంచవర్ష ప్రణాళిక రూపొందించిన అంచనాల్లో 2017 నాటికి దేశంలో 500 ఫంక్షనల్ ఎయిర్‌పోర్ట్స్ అవసరం ఉంది. వీటికి సంబంధించి సాంకేతిక నైపుణ్యాలు అందించే కోర్సులు, మానవ వనరులు అందుబాటులో ఉంటున్నారు కానీ.. నిర్వహణ పరంగా తలెత్తే న్యాయ పరమైన విధులను నిర్వర్తించే ప్రొఫెషనల్స్ అందుబాటులో లేరు. దీన్ని దృష్టిలో పెట్టుకుని దేశంలో తొలిసారిగా నల్సార్‌లో ఈ కోర్సులను ప్రారంభించాం.
 
 ఇందుకోసం ప్రత్యేకంగా సెంటర్ ఫర్ ఏవియేషన్ అండ్ స్పేస్ లా ను కూడా ఏర్పాటు చేశాం. ఆన్‌సైట్-ఆన్‌లైన్ విధానంలోని కోర్సులైనప్పటికీ విద్యార్థులు తమ కోర్సు వ్యవధిలో తప్పనిసరిగా నిర్దిష్ట రోజులు క్లాస్‌రూం టీచింగ్‌కు హాజరు కావల్సిందే. అంతేకాకుండా ఈ కోర్సులు కరిక్యులం ఆయా డొమైన్ ఏరియాల్లోని నైపుణ్యాలను కూడా అందించే విధంగా ఉంటుంది. కోర్సులు పూర్తిచేసిన వారికి ప్లేస్‌మెంట్స్‌కు కొదవ లేదు. ఎయిర్‌లైన్స్ మేనేజర్స్, బిజినెస్ డెవలపర్స్, ఆపరేషనల్ మేనేజర్స్ వంటి పలు హోదాలు లభిస్తాయి. మా ఇన్‌స్టిట్యూట్‌లో మొదటి బ్యాచ్ ఆగస్ట్‌లో బయటికు రానుంది.
 
 ఈ బ్యాచ్‌లోని మొత్తం 50 మందిలో 35 మందికి ఇప్పటికే పలు విమానయాన సంస్థల్లో అవకాశాలు లభించాయి. ఈ కోర్సులకు యునెటైడ్ నేషన్స్ గుర్తింపు ఉండటం ప్రత్యేకించి చెప్పాల్సిన విషయం. దీనివల్ల అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇప్పటికే ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారికి ఇవి కెరీర్ పరంగా మరిన్ని ఉన్నత హోదాలు అందుకోవడానికి మార్గం సుగమం చేస్తాయి. ఇదే విధంగా టెలికాం రంగం, స్పేస్ విభాగాల్లో సంబంధిత చట్టాలు, నిర్వహణ నైపుణ్యాలు అందించే విధంగా టెలికమ్యూనికేషన్ ‘లా’స్, జీఐఎస్ అండ్ రిమోట్ సెన్సింగ్ ‘లా’స్ కోర్సుల కరిక్యులం ఉంటుంది.
 
 - ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి,
 హెడ్ సెంటర్ ఫర్ ఎయిర్ అండ్ స్పేస్ లా,
 నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, హైదరాబాద్.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement