ప్రణాళికా సంఘం స్థానంలో ‘నీతి ఆయోగ్’ | Niti Ayog a think tank based on RSS ideology | Sakshi
Sakshi News home page

ప్రణాళికా సంఘం స్థానంలో ‘నీతి ఆయోగ్’

Published Thu, Jan 8 2015 4:20 AM | Last Updated on Wed, Oct 17 2018 6:01 PM

ప్రణాళికా సంఘం స్థానంలో ‘నీతి ఆయోగ్’ - Sakshi

ప్రణాళికా సంఘం స్థానంలో ‘నీతి ఆయోగ్’

రాష్ట్రీయం
 చట్టంగా సీఆర్‌డీఏ బిల్లు: ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) బిల్లు 2014, డిసెంబర్ 30న చట్టంగా రూపొందింది. ఈ చట్టం ప్రకారం మొత్తం రాజధాని పరిధి 7,068 చదరపు కిలోమీటర్లు కాగా రాజధాని నగర పరిధి 122 చదరపు కిలోమీటర్లు. ప్రభుత్వం సీఆర్‌డీఏకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉంటారు.
 
 ఈ - వైద్య పీహెచ్‌సీ: ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా విజయవాడలోని పటమట అంబేద్కర్‌నగర్‌లో ఈ-వైద్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ జనవరి 4న ప్రారంభించారు. ఈ కేంద్రంలో టెలీ మెడిసిన్ ద్వారా వైద్య సేవలు అందిస్తారు.
 
 12వ స్థానంలో తెలంగాణ: తెలంగాణ రాష్ట్రం జనాభా పరంగా, భౌగోళిక పరంగా దేశంలో 12వ స్థానంలో ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర అర్థగణాంక శాఖ రూపొందించిన ‘తెలంగాణ ఎట్ ఎ గ్లాన్స్-2015’ పుస్తకంలో స్పష్టం చేసింది. ఈ పుస్తకాన్ని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ డిసెంబర్ 31న సచివాలయంలో ఆవిష్కరించారు. భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రం 1,14,840 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది.
 
 ‘సింగరేణి’ సీఎండీగా శ్రీధర్: సింగరేణి కాలరీస్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా ఐఏఎస్ అధికారి నడిమట్ల శ్రీధర్‌ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 30న ఉత్తర్వులు జారీచేసింది.
 
 ఆర్థికసంఘం చైర్మన్‌గా కాంతారావు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగో ఆర్థిక సంఘాన్ని జనవరి 5న ఏర్పాటు చేసింది. కమిషన్ చైర్మన్‌గా ఎంఎల్ కాంతారావు, సభ్య కార్యదర్శిగా రిటైర్డు పంచాయతీరాజ్ అడిషనల్ కమిషనర్ సి.వెంకటేశ్వరరావును నియమించింది.
 
 అమృతహస్తం.. ఇక ఆరోగ్యలక్ష్మి: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ఒక పూట పోషకాలతో కూడిన సంపూర్ణ భోజనం అందించే కార్యక్రమాన్ని నూతన సంవత్సర కానుకగా జనవరి 1 నుంచి అందిస్తున్నట్లు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ‘‘ఆరోగ్యలక్ష్మి’’గా నామకరణం చేశామని.. దీని ద్వారా గర్భిణులు, బాలింతలు ప్రభుత్వం ఇచ్చే పౌష్టికాహారాన్ని అందుకోవాలని అధికారిక ప్రకటనలో కోరారు.
 
 క్రీడలు
 సంగక్కర ఖాతాలో 12 వేల పరుగులు
 శ్రీలంక క్రికెటర్ కుమార్ సంగక్కర టెస్టు కెరీర్‌లో 12 వేల పరుగులు పూర్తిచేసుకున్న ఐదో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. వెల్లింగ్టన్‌లో జనవరి 3న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్ వేసిన బంతిని స్క్వేర్ దిశగా మళ్లించి రెండు పరుగులు తీయడం ద్వారా ఈ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. గతంలో ఈ రికార్డు సాధించిన వారిలో సచిన్ టెండూల్కర్ (15,921), రికీ పాంటింగ్ (13,378), జాక్వెస్ కలిస్ (13,289), రాహుల్ ద్రావిడ్ (13,288) ఉన్నారు.
 
 భారత్‌కు 14 పతకాలు
 ఆసియా యూత్, జూనియర్ మహిళల వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఆరు స్వర్ణాలు, నాలుగు రజతాలు, నాలుగు కాంస్యాలతో కలిపి 14 పతకాలు సాధించింది. భారత్ నుంచి మొత్తం 20 మంది బరిలోకి దిగగా... 14 మంది పతకాలు నెగ్గారు. మిగతా ఆరుగురు టాప్-6లో నిలిచారు.
 
 జాతీయం
  కొలీజియం స్థానంలో ఎన్‌జేఏసీ
 జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) ఏర్పాటుకు సంబంధించి 121వ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2014, డిసెంబర్ 31న ఆమోదం తెలిపారు. దీంతో 1993లో ఏర్పడిన న్యాయమూర్తుల్ని న్యాయమూర్తులే నియమించుకునే కొలీజియం వ్యవస్థ స్థానంలో ఎన్‌జేఏసీ ఏర్పాటవుతుంది. రాజ్యాంగ ప్రతిపత్తి గల ఈ కమిషన్‌కు భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారు. ఆయనతో పాటు మరో ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర న్యాయశాఖ మంత్రి, ఇద్దరు ప్రముఖ వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలూ కమిషన్ ద్వారా జరుగుతాయి.
 
 ఐఆర్‌డీఏ పేరు మార్పు
 బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏ) పేరును భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏ ఆఫ్ ఇండియా)గా పేరు మార్చారు. దీనికి సంబంధించి సంస్థ 2014, డిసెంబర్ 30న అధికారికంగా ప్రకటించింది.
 
 మహిళల భద్రత కోసం ‘హిమ్మత్’
 మహిళల భద్రతకు ఉద్దేశించిన మొబైల్ అప్లికేషన్ ‘హిమ్మత్’ను కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జనవరి 1న ఢిల్లీలో ఆవిష్కరించారు. దేశంలో మొట్టమొదటిసారిగా మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ హిమ్మత్‌ను రూపొందించారు. అత్యవసర పరిస్థితిలో వీలైనంత త్వరగా పోలీసులను అప్రమత్తులను చేయడానికి ఇది అనువుగా ఉంటుంది.
 
 ప్రణాళికా సంఘం స్థానంలో ‘నీతి ఆయోగ్’
 ఆరున్నర దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన ప్రణాళికా సంఘం స్థానంలో ‘నీతి ఆయోగ్’ను కేంద్రం తీసుకొచ్చింది. ‘నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా(ఎన్‌ఐటీఐ)’ పేరుతో ఏర్పాటైన ఈ కొత్త వ్యవస్థ ఇకపై కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల విధానాలను రూపొందించే మేధో సంస్థగా సేవలందించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ దీనికి చైర్‌పర్సన్‌గా వ్యవ హరిస్తారు. ఈ మేరకు జనవరి1న కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. నీతి ఆయోగ్ తొలి ఉపాధ్యక్షుడిగా ఆర్థికవేత్త అరవింద్ పనగరియా(62) నియమితులయ్యారు. మరో ఆరుగురు సభ్యులను, ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులను కూడా ప్రభుత్వం జనవరి 5న నియమించింది.
 
 ఉగ్రవాదుల పడవను అడ్డుకున్న భారత తీర రక్షక దళాలు
 అరేబియా సముద్ర జలాల మీదుగా భారత్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నించిన పాక్ ఉగ్రవాదులను భారత తీర రక్షక దళాలు అడ్డుకున్నాయి. ముంబై 26/11 తరహా దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించినట్లు భావిస్తున్నారు. 2014, డిసెంబర్ 31న గుజరాత్‌లోని పోర్‌బందర్ తీరానికి 365 కి.మీ. దూరంలో భారత తీర రక్షక దళాలు పడవను గుర్తించాయి. తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో ఉగ్రవాదులు పడవను పేల్చేశారు.
 
 పుణెలో బ్యాంకుల ‘జ్ఞాన సంగమ్’
 ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్న ‘జ్ఞాన సంగమ్’ సమావేశం జన వరి 3న ముగిసింది. కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. బ్యాంకులు సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభు త్వ రంగ బ్యాంకులను పటిష్టం చేసేందుకు సాహసోపేత సంస్కరణలు ప్రవేశపెట్టడానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు.
 
 ముంబైలో 102వ సైన్స్ కాంగ్రెస్
 ముంబైలోని ముంబై యూనివర్సిటీలో 102వ సైన్స్ కాంగ్రెస్ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 3న ప్రారంభించారు. ‘సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ హ్యుమన్ డెవలప్‌మెంట్ (మానవ అభివృద్ధి కోసం సైన్స్, టెక్నాలజీ)’పై సదస్సు అయిదు రోజుల పాటు జరిగింది. ఈ సదస్సులో 12 వేల మంది దేశ, విదేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, నోబెల్ పురస్కార గ్రహీతలు పాల్గొన్నారు. వివిధ అంశాలపై విస్తృత చర్చలు, పరిశోధన పత్రాలను సమర్పించారు.
 
 మళ్లీ రూపాయి నోటు ముద్రణ
 కేంద్ర ప్రభుత్వం రూపాయి నోటు ముద్రణను జనవరి 1 నుంచి తిరిగి ప్రారంభించింది. ఇది మరో రెండు నెలల్లో చెలామణిలోకి రానుంది. ఆర్థిక కార్యదర్శి సంతకంతో రూపాయి నోట్లను ముద్రిస్తారు. ప్రభుత్వం 1994 నవంబరులో రూపాయి నోటు ముద్రణను నిలిపేసింది.
 
 ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ పథకం ప్రారంభం
 గృహ సామర్థ్య విద్యుత్ కార్యక్రమం(డీఈఎల్‌పీ) కింద కరెంటును ఆదాచేసే ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ పథకాన్ని ప్రధాని నరే ంద్ర మోదీ జనవరి 5న ఢిల్లీలో ప్రారంభించారు. సౌత్‌బ్లాక్‌లో ఓ సాధారణ బల్బును తొలగించి ఎల్‌ఈడీ బల్బును అమర్చారు. ఎల్‌ఈడీ బల్బు ‘ప్రకాశ్ పథ్’(వెలుగు బాట) అని వ్యాఖ్యానించారు.
 
 వార్తల్లో వ్యక్తులు
 శాఖాహార ప్రముఖులుగా మోదీ, రేఖ
 జంతు హక్కుల సంస్థ పెటా-ఇండియా.. ప్రధాని నరేంద్ర మోదీ, సినీ నటి రేఖలను హాటెస్ట్ వెజిటేరియన్ సెలబ్రిటీలుగా ఎంపిక చేసింది. వేలాది మంది ఓటింగ్ ద్వారా వీరిని ఎంపిక చేసినట్లు డిసెంబర్ 30న ప్రకటించింది. ఎప్పుడూ లేని విధంగా 2014లో మోదీ, రేఖల వల్ల శాఖాహారానికి మంచి ప్రచారం లభించినట్లు తెలిపింది.
 
 రైల్వే బోర్డు చైర్మన్‌గా ఏకే మిట్టల్
 రేల్వే బోర్డు కొత్త చైర్మన్‌గా ఏకే మిట్టల్ 2014, డిసెంబర్ 31న నియమితులయ్యారు. అరుణేంద్ర కుమార్ స్థానంలో ఆయన నియామకం జరిగింది. మిట్టల్ రైల్వే బోర్డులో మెంబర్ స్టాఫ్‌గా విధులు నిర్వహించారు.
 
 ఇస్రో తాత్కాలిక చైర్మన్‌గా శైలేశ్ నాయక్

 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ రాధాకృష్ణన్ పదవీకాలం 2014, డిసెంబర్ 31తో ముగిసింది. ఆయన స్థానంలో తాత్కాలిక చైర్మన్‌గా శైలేశ్ నాయక్‌ను నియమించారు. ఈయన బెంగళూరులోని ఎర్త్ అండ్ సైన్స్ విభాగం కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
 
 ఐఎన్‌ఎస్ అధ్యక్షునిగా కిరణ్ బీ వదోదరియా
 ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ(ఐఎన్‌ఎస్) నూతన అధ్యక్షునిగా గుజరాతీ పత్రిక సంభావ్ మెట్రోకు చెందిన కిరణ్ బీ వదోదరియా ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరిగిన ఐఎన్‌ఎస్ 75వ వార్షిక సర్వసభ్య సమావేశంలో 2014-15 సంవత్సరానికి ఆయన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ద స్టేట్స్‌మన్ పత్రికకు చెందిన రవీంద్రకుమార్ స్థానంలో ఆయన ఎన్నికయ్యారు. గృహలక్ష్మి పత్రికకు చెందిన పీవీ చంద్రన్ డిప్యూటీ ప్రెసిడెంట్‌గా.. రాష్ట్రదూత్‌కు చెందిన సోమేశ్ శర్మ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు.
 
 ప్రముఖ పాత్రికేయుడు వర్గీస్ కన్నుమూత
 ప్రముఖ జర్నలిస్టు, మెగసెసే అవార్డు గ్రహీత బీజీ వర్గీస్ (87) 2014, డిసెంబర్ 30న గుర్గావ్‌లో అస్వస్థతతో మరణించారు. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’, ‘హిందూస్థాన్ టైమ్స్’ ఆంగ్ల పత్రికల ఎడిటర్‌గా ఆయన పనిచేశారు.
 
 డీజీసీఏ సారథిగా సత్యవతి బాధ్యతలు
 డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కొత్త చీఫ్‌గా ఎం.సత్యవతి జనవరి 5న బాధ్యతలు స్వీకరించారు. డీజీసీఏ అధిపతిగా ఒక మహిళ నియమితులు కావడం ఇదే ప్రథమం. ప్రభాత్ కుమార్ స్థానంలో వచ్చిన 1982 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆమె మూడేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. ఈ పదవికి ముందు ఆమె పౌర విమానయాన శాఖకు అదనపు కార్యదర్శిగా, ఆర్థిక సలహాదారుగా వ్యవహరించారు.
 
 రిపబ్లిక్ డేకు ముఖ్య అతిథిగా ఒబామా
 భారత్ రిపబ్లిక్ దినోత్సవానికి ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన ఖరారైంది. ఈ మేరకు ఆయన పర్యటనను వైట్‌హౌజ్ జనవరి 5న ఖరారు చేసింది. భారత గణతంత్ర దినోత్సవానికి హాజరుకానున్న తొలి అమెరికా అధ్యక్షుడు ఒబామాయే కావడం గమనార్హం. రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం మోదీ-ఒబామా చర్చలు జరపనున్నారు.
 
 అంతర్జాతీయం
 వీగిన పాలస్తీనా తీర్మానం
 పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించే తీర్మానానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఆమోదం లభించలేదు. 2017 కల్లా పాలస్తీనా భూభాగం నుంచి ఇజ్రాయెల్ దళాలను ఉపసంహరించాలన్న ఈ తీర్మానం వీగిపోయింది. 2014, డిసెంబర్ 31న మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి 8 దేశాలు మద్దతు పలికాయి. మరో తొమ్మిది దేశాలు వ్యతిరేకించాయి. మండలి వీటో అధికారం ఉన్న ఐదు శాశ్వత సభ్య దేశాలు వ్యతిరేకించకపోతే.. తీర్మానం ఆమోదం పొందడానికి 9 దేశాల మద్దతు అవసరం. కానీ అమెరికా, ఆస్ట్రేలియాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి.
 
 ఉత్తర కొరియాపై అమెరికా తాజా ఆంక్షలు
 ఉత్తర కొరియాపై అమెరికా మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించింది. సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థపై సైబర్ దాడులకు ఉత్తర కొరియా ప్రభుత్వ మద్దతు ఉందని అమెరికా తెలిపింది. ఉద్దేశపూర్వకంగా ఇలాం టి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నందున ఉత్తర కొరియాకు చెందిన మూడు సంస్థలు, పదిమంది వ్యక్తులపై ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా పేర్కొంది.
 
 మీథేన్ వాయువుతో కరెంటు
 బొగ్గు గనుల నుంచి భారీగా విడుదలయ్యే మీథేన్ వాయువును విద్యుత్‌గా మార్చేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద యూనిట్‌ను చైనా నిర్మించింది. ప్రపంచంలోనే ఇలాంటి భారీ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. షాంగ్జి ప్రావిన్స్‌లో లుయాన్ గ్రూప్ దీన్ని ఏర్పాటుచేసింది. గనుల నుంచి విడుదలయ్యే 99 శాతం మీథేన్‌తో 30 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామని కంపెనీ తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement