ఆసక్తితో చదివితే ఆశయ సాధన తేలికే! | preparation plan for intermediate CEC group | Sakshi
Sakshi News home page

ఆసక్తితో చదివితే ఆశయ సాధన తేలికే!

Published Thu, Sep 19 2013 1:52 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

ఆసక్తితో చదివితే ఆశయ సాధన తేలికే! - Sakshi

ఆసక్తితో చదివితే ఆశయ సాధన తేలికే!

ఓ దేశ అభివృద్ధికి శాస్త్ర (science), సాంకేతిక (Technology) అంశాలు అత్యున్నత సోపానాలు.. అదే విధంగా రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం, వాణిజ్య శాస్త్ర అంశాలు మెరుగైన సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తాయి. సీఏ, సీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశించి, సుస్థిర కెరీర్‌ను సాధించేందుకు ఇంటర్ సీఈసీ తొలిమెట్టు. దీన్ని అత్యుత్తమ మార్కులతో విజయవంతంగా పూర్తిచేసి బంగరు భవితకు బాటలు వేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో జూనియర్ ఇంటర్ సీఈసీ ప్రిపరేషన్ ప్రణాళిక..
 
 సివిక్స్
 జూనియర్ ఇంటర్ సివిక్స్ పాఠ్య ప్రణాళికలో రాజనీతి శాస్త్ర పరిచయం, రాజ్యం, రాజకీయ భావనలు, ప్రధాన రాజకీయ సిద్ధాంతాలు, హక్కులు-విధులు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం-ప్రభుత్వం, ప్రభుత్వ అంగాలు, ప్రజాభిప్రాయం అంశాలు ఉంటాయి.
 
 ప్రశ్నపత్రం-అవగాహన:
 ఐపీఈ సివిక్స్ ప్రశ్నపత్రం 150 మార్కులకు ఉంటుంది. విద్యార్థులు 100 మార్కులకు సమాధానాలు రాయాలి. ఐదు వ్యాసరూప ప్రశ్నలు ఇస్తారు. వీటిలో మూడింటికి సమాధానాలు రాయాలి. ఐదు మార్కుల ప్రశ్నలు 12 ఇస్తారు. వీటిలో ఎనిమిది ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. రెండు మార్కుల ప్రశ్నలు 20 ఇస్తారు. వీటిలో 15 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
 
 వ్యాసరూప ప్రశ్నలకు ముఖ్యమైనవి:
 1.రాజనీతి శాస్త్ర పరిచయంలోని రాజనీతి శాస్త్ర పరిధి- ప్రాముఖ్యత.
 2.రాజకీయ భావనలలోని సార్వభౌమాధికారం-లక్షణాలు-రకాలు; శాసనాధారాలు, రకాలు.
 3.ప్రధాన రాజకీయ సిద్ధాంతాలలో మార్క్సిజం ప్రాథమిక సూత్రాలు- విమర్శ గాంధేయ వాద సిద్ధాంత ప్రాథమిక సూత్రాలు.
 4.రాజ్యాంగం-ప్రభుత్వంలో ఏక కేంద్ర ప్రభుత్వ, సమాఖ్య, పార్లమెంటరీ, అధ్యక్ష తరహా ప్రభుత్వాల లక్షణాలు, ప్రయోజనాలు, లోపాలు.
 5.ప్రభుత్వ అంగాల భాగం నుంచి శాసనసభ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ విధులు.
 
 ఐదు మార్కుల ప్రశ్నలకు:
 1.రాజనీతి శాస్త్ర పరిచయం నుంచి రాజనీతి శాస్త్రం, ఇతర సాంఘిక శాస్త్రాలతో సంబంధం. చరిత్ర, అర్థశాస్త్రం, సామాజిక శాస్త్రం, నీతి శాస్త్రం.
 2.రాజ్యం నుంచి రాజ్యం లక్షణాల్లో ఏవైనా రెండు లక్షణాలు; జాతీయత; రాజ్యం-సమాజం; రాజ్యం-ప్రభుత్వం; రాజ్యం-సంస్థల మధ్య భేదాలు.
 3.రాజకీయ భావనలు నుంచి ఆస్టిన్ ఏకత్వ సార్వభౌమాధికార సిద్ధాంతం; స్వేచ్ఛ రకాలు-పరిరక్షణలు; సమానత్వం-రకాలు; స్వేచ్ఛ, సమానత్వాల మధ్య సంబంధం; న్యాయం-రకాలు.
 4.ప్రధాన రాజకీయ సిద్ధాంతాల నుంచి లౌకిక రాజ్యం, సంక్షేమ రాజ్య లక్షణాలు.
 5.హక్కులు-విధులు నుంచి పౌర హక్కులు-రాజకీయ హక్కులు, రాజకీయ విధులు, హక్కులు-విధుల మధ్య సంబంధం.
 6.ప్రజాస్వామ్యం నుంచి ప్రజాస్వామ్య ప్రయోజనాలు-లోపాలు; ప్రజాస్వామ్య విజయానికి కావాల్సిన పరిస్థితులు, ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతులు.
 7.రాజ్యాంగం-ప్రభుత్వం నుంచి లిఖిత- అలిఖిత, దృఢ- అదృఢ రాజ్యాంగాల ప్రయోజనాలు, లోపాలు.
 8.ప్రభుత్వ అంగాల నుంచి ఏకసభ- ద్విసభా విధానాలు; కార్యనిర్వాహక వర్గం రకాలు; న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తి, న్యాయ సమీక్ష.
 9.ప్రజాభిప్రాయం నుంచి ప్రజాభిప్రాయ సాధనాలు.
 
 రెండు మార్కుల ప్రశ్నలకు:
 ప్రతి పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాసరూప సమాధానాల్లోని కొన్ని అంశాలపై రెండు మార్కుల ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. విద్యార్థులు తప్పనిసరిగా నిర్వచనాలను చదివి, గుర్తుపెట్టుకోవాలి.
 
 సూచనలు:
 రెండు మార్కుల ప్రశ్నలు 15 మాత్రమే రాయాల్సి ఉన్నా, అధికంగా మరో రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
 పరీక్ష రాసే విషయంలో సమయ పాలన కీలకం. వ్యాసరూప ప్రశ్నకు 20-30 నిమిషాలు; ఐదు మార్కుల ప్రశ్నకు 10-20 నిమిషాలు; 2 మార్కుల ప్రశ్నకు 5 నిమిషాలు కేటాయించాలి. దీనికి అనుగుణంగా విద్యార్థులు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి.
 చివర్లో 15 నిమిషాలను పునఃపరిశీలనకు కేటాయించాలి. ఏవైనా అంశాలు మర్చిపోతే వాటిని రాయాలి. సాధ్యమైనంత వరకు 100 మార్కులకు సమాధానాలు రాయాలి. అవసరమైన చోట ఉదాహరణలు రాయాలి.
 
 కామర్స్
 పదో తరగతి పూర్తిచేసి ఇంటర్మీడియెట్ మొదటి ఏడాది సీఈసీలో చేరిన విద్యార్థులకు వాణిజ్య శాస్త్రం (కామర్స్) ఓ కొత్త సబ్జెక్టుగా ఎదురవుతుంది. అందువల్ల దీనిపై ఆసక్తి పెంచుకొని పాఠ్యాంశాలపై లోతైన అవగాహన పెం పొందించుకోవడం అవసరం. వాణిజ్య శాస్త్రానికి బీకాం, సీపీటీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్, ఎంబీఏ వంటి కోర్సులతో సంబంధం ఉంది. అందువల్ల ఇంటర్ సీఈసీని విజయవంతంగా పూర్తిచేసిన వారు తర్వాత వివిధ ఉన్నత కోర్సుల్లో చేరి చక్కని కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు.
 వాణిజ్య శాస్త్రం ప్రశ్నపత్రం రెండు విభాగాలుగా ఉంటుంది. పార్ట్-1 వాణిజ్య శాస్త్రానికి 50 మార్కులు; పార్ట్-2 వ్యాపారగణక శాస్త్రానికి 50 మార్కులు ఉంటాయి.
 
 పార్ట్- 1 పాఠ్య ప్రణాళిక:
 యూనిట్ 1: వ్యాపారం, భావనలు; యూనిట్ 2: వ్యాపార సంస్థల స్వరూప, స్వభావాలు; యూనిట్ 3: వ్యవస్థాపన-వ్యవస్థాపకుడు; యూనిట్ 4: వ్యాపార విత్తం-మూలాధారాలు; యూనిట్ 5: ప్రభుత్వ, ప్రైవేటు బహుళ జాతీయ సంస్థలు.
 
 పార్ట్- 2 పాఠ్య ప్రణాళిక:
 యూనిట్ 1: విషయ పరిచయం; యూనిట్ 2: సహాయక పుస్తకాలు; యూనిట్ 3: బ్యాంకు నిల్వల సమన్వయ పట్టీ; యూనిట్ 4: అంకణా తప్పుల సవరణ; యూనిట్ 5: ముగింపు లెక్కలు.


 పార్ట్- 1 ప్రశ్నపత్రం
 విభాగం    మార్కులు    సమయం
 సెక్షన్-ఏ    10 x 2 = 20    35 నిమిషాలు
సెక్షన్-బీ    4 x 5 = 20    35 నిమిషాలు
సెక్షన్-సీ    5 x 2 = 10    20 నిమిషాలు
 
 విద్యార్థులు 50 మార్కులకు సమాధానాలు రాయాలి. సెక్షన్-ఏలో మూడు దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఇస్తారు. వీటిలో రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి సమాధానానికి పది మార్కులు. 2, 3, 4 యూనిట్ల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి.
 
 సెక్షన్-బీలో ఆరు లఘు సమాధాన ప్రశ్నలు ఉంటాయి. వీటిలో నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి సమాధానానికి ఐదు మార్కులు. అన్ని యూనిట్ల నుంచి లఘు సమాధాన ప్రశ్నలు వస్తాయి.
 
 సెక్షన్-సీలో ఎనిమిది అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు ఉంటాయి. విద్యార్థులు ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి సమాధానానికి 2 మార్కులు. అన్ని యూనిట్ల నుంచి అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తాయి.
 
 పార్ట్-2 ప్రశ్నపత్రం
     విభాగం     మార్కులు     సమయం
     సెక్షన్-డీ    1 x 20 = 20    30 నిమిషాలు
     సెక్షన్-ఈ    1 x 10 = 10    20 నిమిషాలు
     సెక్షన్-ఎఫ్    2 x 5 = 10    20 నిమిషాలు
     సెక్షన్-జీ     5 x 2 = 10    20 నిమిషాలు
 
 సెక్షన్-డీ నుంచి సెక్షన్-జీ వరకు అకౌంట్స్‌కు సంబంధించి ప్రశ్నలు వస్తాయి. అందువల్ల సమయ పాలన అలవరచుకోవడం చాలా అవసరం. వ్యాపార వ్యవహారాలు నమోదు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని, ప్రశ్నపత్రంలో ఇచ్చిన నగదు మొత్తాలను సరిచూసుకొని రాయాలి. లేకుంటే ఓ చిన్న పొరపాటు వల్ల చాలా సమయం వృథా అవుతుంది.
 సెక్షన్-డీలో 20 మార్కుల ప్రశ్నకు ముగింపు లెక్కలు చేసేటప్పుడు వ్యవహారాల నమోదుతో పాటు సర్దుబాట్లను కూడా పరిగణనలోకి తీసుకొని, ఖాతాల నిల్వలను సరిగా తేల్చాలి. ఆస్తులు, అప్పుల పట్టీతో ఆస్తు లు, అప్పులను సరైన విధానంలో నమోదు చేయాలి.
 అకౌంట్స్‌లో ఎలాంటి కొట్టివేతలు లేకుండా సరైన పద్ధతిలో సమాధానాలు రాస్తే పూర్తి మార్కులు పొందేందుకు అవకాశముంటుంది. అవసరమైన చోట తప్పనిసరిగా స్కేలు, పెన్సిల్‌లను ఉపయోగించాలి.
 పార్ట్-1 విభాగంలో థియరీ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు స్పష్టంగా ఉండాలి. ముఖ్యమైన అంశాలను అండర్‌లైన్ చేయాలి. చివరగా ప్రతి సమాధానాన్ని పునఃపరిశీలించుకోవాలి.
 
      
 అర్థశాస్త్రం (ఎకనామిక్స్)
 అర్థశాస్త్రంలో అధిక మార్కులు సాధించాలంటే విద్యార్థులు ముందుగా ఆర్థిక భావనలను అర్థం చేసుకోవాలి. ఆర్థిక భావనలు, ఆర్థిక సూత్రాలకు సంబంధించిన నిర్వచనాలు, పట్టికలు, రేఖా పటాలు, ప్రమేయాలు, ప్రాముఖ్యత తదితర అంశాలపై దృష్టిసారించాలి. ప్రతిరోజూ వీటిని విశ్లేషించుకుంటూ చదవాలి.
 
 పాఠ్యాంశాలు:
 యూనిట్ 1: ఉపోద్ఘాతం; యూనిట్ 2: వినియోగ సిద్ధాంతం; యూనిట్ 3: డిమాండ్ వ్యాకోచత్వం; యూనిట్ 4: ఉదాసీనతా వక్రరేఖలు; యూనిట్ 5: ఉత్పత్తి సిద్ధాంతం; యూనిట్ 6: విలువ సిద్ధాంతం; యూనిట్ 7: పంపిణీ సిద్ధాంతం; యూనిట్ 8: జాతీయాదాయం; యూనిట్ 9: స్థూల ఆర్థిక అంశాలు; యూనిట్ 10: ద్రవ్యం, బ్యాంకింగ్, ద్రవ్యోల్బణం.
 
 ప్రశ్నపత్రంపై అవగాహన:
 అర్థశాస్త్రం ప్రశ్నపత్రంలో సెక్షన్-ఏలో ఐదు ప్రశ్నలు ఇస్తారు. వీటిలో మూడింటికి సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు పది మార్కులు. సెక్షన్-బీలోని 12 ప్రశ్నల్లో ఎనిమిది ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు ఐదు మార్కులుంటాయి. సెక్షన్-సీలోని 20 ప్రశ్నల్లో 15 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు.
 పాఠ్యాంశాలు-ప్రాధాన్యం:
 యూనిట్- 1: ఓ ఐదు మార్కుల ప్రశ్న, మూడు రెండు మార్కుల ప్రశ్నలు వస్తాయి.
 యూనిట్- 2: ఓ 10 మార్కుల ప్రశ్న, రెండు ఐదు మార్కుల ప్రశ్నలు, రెండు మార్కుల ప్రశ్నలు కనీసం రెండు వస్తాయి.
 యూనిట్- 3: ఐదు మార్కులు(1); రెండు మార్కుల ప్రశ్నలు రెండు నుంచి మూడు వరకు వస్తాయి.
 యూనిట్- 4: 5 మార్కుల ప్రశ్న (1); రెండు మార్కుల ప్రశ్నలు (2).
 యూనిట్- 5: 10 మార్కుల ప్రశ్న (1); 5 మార్కుల ప్రశ్నలు (2); రెండు మార్కుల ప్రశ్నలు (3).
 యూనిట్- 6: 10 మార్కుల ప్రశ్న (1); 5 మార్కుల ప్రశ్నలు (2); రెండు మార్కుల ప్రశ్నలు (3).
 యూనిట్- 7: 5 మార్కుల ప్రశ్న (1); రెండు మార్కుల ప్రశ్నలు (3).
 యూనిట్- 8: 10 మార్కుల ప్రశ్న (1); 5 మార్కుల ప్రశ్న (1); రెండు మార్కుల ప్రశ్నలు ఒకటి లేదా రెండు వస్తాయి.
 యూనిట్- 9: 10 మార్కుల ప్రశ్న (1); 5 మార్కుల ప్రశ్నలు (2); రెండు మార్కుల ప్రశ్నలు రెండు వరకు వస్తాయి.
 యూనిట్- 10: 5 మార్కుల ప్రశ్నలు (2); 2 మార్కుల ప్రశ్నలు (3).
 
 సూచనలు:
 అర్థశాస్త్రంలో అధిక మార్కులు సాధించాలంటే, ముందుగా రెండు మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. తర్వాత ఐదు మార్కుల ప్రశ్నలకు, తర్వాత 10 మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
 ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు సమయ పాలన పాటించడం కీలకం. పది మార్కుల ప్రశ్నకు 20 నిమిషాలు, ఐదు మార్కుల ప్రశ్నకు 10 నిమిషాలు కేటాయించాలి. చివర్లో రాసిన సమాధానాలను ఒకసారి సరిచూసుకోవాలి.
 
 prepared by
 K. Janardhan Reddy (Economics)
 Kuruhuri Ramesh (Commerce)
 G.W. Stevenson (Civics)
 Royal Educational Institutes, Hyderabad.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement