వ్యూహాత్మకంగా చదివితే విజయం చిక్కినట్లే! | Strategic to reading on MEC intermediate | Sakshi
Sakshi News home page

వ్యూహాత్మకంగా చదివితే విజయం చిక్కినట్లే!

Published Thu, Sep 26 2013 1:35 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Strategic to reading on MEC intermediate

గణితం (Mathematics), అర్థ శాస్త్రం (Economics), వాణిజ్య శాస్త్రం (Commerce).. ఇవి నేటి తరం కుర్రకారుకు క్రేజీ సబ్జెక్టులు. సీఏ, సీఎస్ వంటి ఉన్నత స్థాయి ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశించి, సుస్థిర వృత్తి జీవితాన్ని సొంతం చేసుకునే క్రమంలో ఇప్పుడు చాలా మంది విద్యార్థులు ఇంటర్ ఎంఈసీ గ్రూపులో అడుగుపెడుతున్నారు. దీన్ని అత్యుత్తమ మార్కులతో దిగ్విజయంగా పూర్తిచేసి భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఈ నేపథ్యంలో జూనియర్ ఇంటర్ ఎంఈసీ ప్రిపరేషన్ ప్రణాళిక..
 
 మ్యాథమెటిక్స్
 గతంతో పోలిస్తే ఇప్పుడు జూనియర్ ఇంటర్ గణిత శాస్త్రం పాఠ్య ప్రణాళికలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. వీటిని నిశితంగా పరిశీలించి పరీక్షలకు సిద్ధం కావాలి.
 
 1 (ఎ):
 సిలబస్: యూనిట్ 1: ప్రమేయాలు (11 మార్కులు); యూనిట్ 2: గణితానుగమనం (7 మార్కులు); యూనిట్ 3: మాత్రికలు (22 మార్కులు); యూనిట్ 4: సదిశల సంకలనం (8 మార్కులు); యూనిట్ 5: సదిశల గుణనం (13 మార్కులు); యూనిట్ 6: త్రికోణమితీయ నిష్పత్తులు- పరివర్తనలు (15 మార్కులు); యూనిట్ 7: త్రికోణమితీయ సమీకరణాలు (4 మార్కులు); యూనిట్ 8: విలోమ త్రికోణమితీయ ప్రమేయాలు (4 మార్కులు); యూనిట్ 9: అతి పరావలయ ప్రమేయాలు (2 మార్కులు); యూనిట్ 10: త్రిభుజ ధర్మాలు (11 మార్కులు).
 పాఠ్యాంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలంటే మొదట ఆయా అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
 
 ప్రశ్నపత్రం:
 విద్యార్థులు మొత్తం 75 మార్కులకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. సెక్షన్-ఎ లో 10 అతిస్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. వీటన్నింటికీ సమాధానాలు రాయాలి. ఒక్కో దానికి రెండు మార్కులు. సెక్షన్-బి లో 7 స్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. వీటిలో ఐదింటికి సమాధానాలు రాయాలి. ఒక్కో దానికి నాలుగు మార్కులు.
 సెక్షన్-సి లో 7 దీర్ఘ సమాధాన ప్రశ్నలుంటాయి. వీటిలో ఐదింటికి సమాధానాలు రాయాలి. ఒక్కో దానికి 7 మార్కులు.
 ప్రశ్నపత్రం దాదాపు తెలుగు అకాడమీ పాఠ్య గ్రంథం చివర్లో ఇచ్చిన మాదిరి ప్రశ్నపత్రం తరహాలోనే ఉంటుంది.
 
 ప్రిపరేషన్ వ్యూహం:
 విద్యార్థులు వెయిటేజీని అనుసరించి ప్రిపరేషన్ కొనసాగించాలి. 1, 2, 3, 5, 6, 10 యూనిట్ల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి. 3వ యూనిట్ నుంచి రెండు దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి. మొత్తంమీద ఈ యూనిట్ నుంచి 22 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. కాబట్టి విద్యార్థులు దీనిపై ఎక్కువ దృష్టిసారించాలి.
 1వ యూనిట్ నుంచి ఒక సిద్ధాంతం తప్పకుండా వస్తుంది. అందువల్ల ఉన్న ఆరు సిద్ధాంతాలను శ్రద్ధగా నేర్చుకోవాలి. 3, 4, 5, 6, 7, 8, 10 యూనిట్ల నుంచి స్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తాయి.
 1,3, 4, 5, 6, 9 యూనిట్ల నుంచి అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తాయి. ఇందులో 1, 3, 4, 6 యూనిట్ల నుంచి రెండేసి ప్రశ్నలు వస్తాయి. అధిక మార్కులు సాధించేందుకు అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు ఉపయోగపడతాయి. అందువల్ల వీటిపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి.
 1 (బి):
 సిలబస్: యూనిట్ 1: బిందుపథం (4 మార్కులు); యూనిట్ 2: అక్ష పరివర్తనం (4 మార్కులు); యూనిట్ 3: సరళరేఖలు (15 మార్కులు); యూనిట్ 4: సరళరేఖాయుగ్మాలు (14 మార్కులు); యూనిట్ 5: త్రిపరిమాణ నిరూపకాలు (2 మార్కులు); యూనిట్ 6: దిక్ కొసైన్‌లు, దిక్ సం ఖ్యలు (7 మార్కులు); యూనిట్ 7: సమతలం (2 మార్కులు); యూనిట్ 8: అవధులు, అవిచ్ఛిన్నత (8 మార్కులు); యూనిట్ 9: అవకలనం (15 మార్కులు); యూనిట్ 10: అవకలజాల అనువర్తనాలు (26 మార్కులు).
 ప్రశ్నపత్రం: 1 (బి) ప్రశ్నపత్రం కూడా 1 (ఎ) ప్రశ్నపత్రం తరహాలోనే ఉంటుంది.
 
 ప్రిపరేషన్ వ్యూహం:
 అధిక వెయిటేజీ ఉన్న సరళరేఖలు, సరళరేఖా యుగ్మాలు, అవకలనం, అవకలజాల అనువర్తనాలను బాగా చదవాలి. 3, 4, 6, 9, 10 యూనిట్ల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి. వీటిలో 4, 10 యూనిట్ల నుంచి రెండేసి ప్రశ్నలు వస్తాయి.
 
 1, 2, 3, 8, 9, 10 యూనిట్ల నుంచి స్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తాయి. పదో యూనిట్ నుంచి రెండు స్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తాయి.
 3, 5, 7, 8, 9, 10 యూనిట్ల నుంచి అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తాయి. వీటిలో 3, 8, 9, 10 యూనిట్ల నుంచి రెండేసి ప్రశ్నలు వస్తాయి.
 సరళరేఖా యుగ్మాలు యూనిట్‌లో సమఘాత పరచటం పాఠ్యాంశం నుంచి ఓ దీర్ఘ సమాధాన ప్రశ్న తప్పకుండా వస్తుంది. కాబట్టి విద్యార్థులు దీన్ని బాగా సాధన చేయాలి.
 విద్యార్థులు ప్రతి యూనిట్ చివర్లో ఇచ్చిన సూత్రాలను సాధన చేయాలి. అప్పుడే సమస్యల్ని తేలిగ్గా సాధించేందుకు వీలవుతుంది.
 
 ఎకనామిక్స్
 100 మార్కులకు ఉండే అర్థశాస్త్రంలో అధిక మార్కులు సాధించాలంటే విద్యార్థులు ముందుగా ఆర్థిక భావనలను అర్థం చేసుకోవాలి. ఆర్థిక భావనలు, ఆర్థిక సూత్రాలకు సంబంధించిన నిర్వచనాలు, పట్టికలు, రేఖా పటాలు, ప్రమేయాలు తదితర అంశాలపై దృష్టిసారించాలి. ప్రతిరోజూ వీటిని విశ్లేషించుకుంటూ అధ్యయనం చేయాలి.
 
 పాఠ్యాంశాలు:
 యూనిట్ 1: ఉపోద్ఘాతం; యూనిట్ 2: వినియోగ సిద్ధాంతం; యూనిట్ 3: డిమాండ్ వ్యాకోచత్వం; యూనిట్ 4: ఉదాసీనతా వక్రరేఖలు; యూనిట్ 5: ఉత్పత్తి సిద్ధాంతం; యూనిట్ 6: విలువ సిద్ధాంతం; యూనిట్ 7: పంపిణీ సిద్ధాంతం; యూనిట్ 8: జాతీయాదాయం; యూనిట్ 9: స్థూల ఆర్థిక అంశాలు; యూనిట్ 10: ద్రవ్యం, బ్యాంకింగ్, ద్రవ్యోల్బణం.
 నమూనా ప్రశ్నపత్రం:
 ప్రశ్నపత్రంలో సెక్షన్-ఎలో ఐదు ప్రశ్నలు ఇస్తారు. వీటిలో మూడింటికి సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు పది మార్కులు. సెక్షన్-బిలోని 12 ప్రశ్నల్లో ఎనిమిది ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు ఐదు మార్కులుంటాయి. సెక్షన్-సిలోని 20 ప్రశ్నల్లో 15 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు.
 
 పాఠ్యాంశాలు-ప్రాధాన్యం:
 

 
 పరీక్షల్లో కేటాయించాల్సిన సమయం: పది మార్కుల ప్రశ్నకు 20 నిమిషాలు, 5 మార్కుల ప్రశ్నకు 10 నిమిషాలు, 2 మార్కుల ప్రశ్నకు 2 నిమిషాలు; పునఃపరిశీలనకు 10 నిమిషాలు కేటాయించాలి.
 సూచనలు: అర్థశాస్త్రంలో అధిక మార్కులు సాధించాలంటే, ముందుగా రెండు మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. తర్వాత ఐదు మార్కుల ప్రశ్నలకు, తర్వాత 10 మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
 
 కామర్స్
 
 పదో తరగతి పూర్తిచేసి ఇంటర్మీడియెట్ మొదటి ఏడాది ఎంఈసీలో చేరిన విద్యార్థులకు వాణిజ్య శాస్త్రం (కామర్స్) కొత్త సబ్జెక్టుగా ఎదురవుతుంది. అందువల్ల దీనిపై ఆసక్తి పెంచుకొని పాఠ్యాంశాలపై లోతైన అవగాహన పెం పొందించుకోవడం అవసరం. వాణిజ్య శాస్త్రానికి బీకాం, సీపీటీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్, ఎంబీఏ వంటి కోర్సులతో సంబంధం ఉంది. అందువల్ల ఇంటర్ ఎంఈసీని విజయవంతంగా పూర్తిచేసిన వారు తర్వాత వివిధ ఉన్నత కోర్సుల్లో చేరి చక్కని కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు.
  వాణిజ్య శాస్త్రం ప్రశ్నపత్రం రెండు విభాగాలుగా ఉంటుంది. పార్ట్-1 వాణిజ్య శాస్త్రానికి 50 మార్కులు; పార్ట్-2 వ్యాపారగణక శాస్త్రానికి 50 మార్కులు ఉంటాయి.
 
 పార్ట్- 1 పాఠ్య ప్రణాళిక:
 యూనిట్ 1: వ్యాపారం, భావనలు; యూనిట్ 2: వ్యాపార సంస్థల స్వరూప, స్వభావాలు; యూనిట్ 3: వ్యవస్థాపన-వ్యవస్థాపకుడు; యూనిట్ 4: వ్యాపార విత్తం-మూలాధారాలు; యూనిట్ 5: ప్రభుత్వ, ప్రైవేటు బహుళ జాతీయ సంస్థలు.
 
 పార్ట్- 2 పాఠ్య ప్రణాళిక:
 యూనిట్ 1: విషయ పరిచయం; యూనిట్ 2: సహాయక పుస్తకాలు; యూనిట్ 3: బ్యాంకు నిల్వల సమన్వయ పట్టీ; యూనిట్ 4: అంకణా తప్పుల సవరణ; యూనిట్ 5: ముగింపు లెక్కలు.
 
 
 
 
 పార్ట్- 1 ప్రశ్నపత్రం
 

 
 విద్యార్థులు 50 మార్కులకు సమాధానాలు రాయాలి. సెక్షన్-ఎలో మూడు దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఇస్తారు. వీటిలో రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి సమాధానానికి పది మార్కులు. 2, 3, 4 యూనిట్ల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి.
 సెక్షన్-బిలో ఆరు లఘు సమాధాన ప్రశ్నలు ఉంటాయి. వీటిలో నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి సమాధానానికి ఐదు మార్కులు. అన్ని యూనిట్ల నుంచి లఘు సమాధాన ప్రశ్నలు వస్తాయి.
 సెక్షన్-సిలో ఎనిమిది అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు ఉంటాయి. ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి సమాధానానికి 2 మార్కులు. అన్ని యూనిట్ల నుంచి అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తాయి.
 
 పార్ట్-2 ప్రశ్నపత్రం


 ఎంఈసీ విద్యార్థులకు గణితంపై అవగాహన ఉండటం వల్ల అకౌంట్స్‌లో ఎలాంటి పొరపాట్లు లేకుండా కచ్చితంగా సమాధానాలు రాయడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులు వాణిజ్య శాస్త్రాన్ని స్కోరింగ్ సబ్జెక్టుగా పరిగణించి ఎక్కువ శ్రద్ధచూపాలి.
 సెక్షన్-డి నుంచి సెక్షన్-జి వరకు అకౌంట్స్‌కు సంబంధించి ప్రశ్నలు వస్తాయి. అందువల్ల సమయ పాలన అలవరచుకోవడం చాలా అవసరం. వ్యాపార వ్యవహారాలు నమోదు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని, ప్రశ్నపత్రంలో ఇచ్చిన నగదు మొత్తాలను సరిచూసుకొని రాయాలి. లేకుంటే ఓ చిన్న పొరపాటు వల్ల చాలా సమయం వృథా అవుతుంది.
 సెక్షన్-డిలో 20 మార్కుల ప్రశ్నకు ముగింపు లెక్కలు చేసేటప్పుడు వ్యవహారాల నమోదుతో పాటు సర్దుబాట్లను కూడా పరిగణనలోకి తీసుకొని, ఖాతాల నిల్వలను సరిగా తేల్చాలి. ఆస్తులు, అప్పుల పట్టీతో ఆస్తులు, అప్పులను సరైన విధానంలో నమోదు చేయాలి.
 అకౌంట్స్‌లో ఎలాంటి కొట్టివేతలు లేకుండా సరైన పద్ధతిలో సమాధానాలు రాస్తే పూర్తి మార్కులు పొందేందుకు అవకాశముంటుంది. అవసరమైన చోట తప్పనిసరిగా స్కేలు, పెన్సిల్‌లను ఉపయోగించాలి.
 పార్ట్-1 విభాగంలో థియరీ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు స్పష్టంగా ఉండాలి. ముఖ్యమైన అంశాలను అండర్‌లైన్ చేయాలి. చివరగా ప్రతి సమాధానాన్ని పునఃపరిశీలించుకోవాలి.
 
 prepared by
 K. Janardhan Reddy (Economics)
 Kuruhuri Ramesh (Commerce)
 S.S.C.V.S. Ramarao (Mathematics)
 Royal Educational Institutions,
 Hyderabad.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement