సబ్జెక్ట్ ఏదైనా ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం | Subject to any practical | Sakshi
Sakshi News home page

సబ్జెక్ట్ ఏదైనా ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం

Published Thu, Jul 10 2014 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 10:03 AM

సబ్జెక్ట్ ఏదైనా ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం

సబ్జెక్ట్ ఏదైనా ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం

 ‘చిన్ననాటి నుంచి బెస్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో ఇంజనీరింగ్ చదవాలనే ఆశయం.. దానికోసం ఎనిమిదో తరగతి నుంచే కృషి... వీటికి కుటుంబ సభ్యుల తోడ్పాటు.. ప్రోత్సాహం తోడవడం.. తాజా విజయానికి ప్రధాన కారణాలు’ అంటున్నాడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆల్ ఇండియా స్థాయిలో రెండో ర్యాంకు సాధించిన చింతకింది సాయిచేతన్. ఐఐటీ-ముంబైలో సీఎస్‌ఈ పూర్తి చేసి తర్వాత సివిల్ సర్వీసెస్‌లో విజయంతో ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యం అంటున్న చింతకింది సాయిచేతన్ సక్సెస్ స్పీక్స్..
 
 స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ముత్పూర్ గ్రామం. అమ్మానాన్న ఉద్యోగాల రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. నాన్న సురేందర్ రెడ్డి అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. అమ్మ నిర్మల లాలాపేటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఈ విజయంలో అమ్మ, నాన్నల తోడ్పాటు ఎంతగానో ఉంది.
 
 చిన్ననాటి నుంచే ఇంజనీరింగ్‌పై దృష్టి:
 ఇంజనీరింగ్ చదవాలి.. అది కూడా అత్యున్నత ఇన్‌స్టిట్యూట్‌లో చదవాలి అనే కోరిక చిన్ననాటి నుంచే ఉంది. అందుకు మార్గం ఐఐటీలే అని తెలిసింది. బాబాయి జితేందర్ రెడ్డి ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో ఎంటెక్ పూర్తి చేశారు. బంధువుల్లోనూ చాలామంది ఐఐటీల్లో చదివారు. ఆదే స్ఫూర్తితో ఐఐటీల్లోనే ఇంజనీరింగ్ సీటు సాధించాలనే పట్టుదల పెరిగింది. అందుకే ఎనిమిదో తరగతి నుంచే ఐఐటీకి ఫౌండేషన్ కోర్సులో చేరాను.
 
 ప్రిపరేషన్.. ప్రణాళికబద్ధంగా:
 ఐఐటీకి పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ మాత్రం ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో మొదలుపెట్టాను. క్లాస్‌రూం సెషన్స్, స్టడీ అవర్స్, సెల్ఫ్ స్టడీ అన్నీ కలిపి రోజుకు 11-12 గంటలు చదివేలా ప్రణాళిక రూపొందిం చుకున్నా. జేఈఈ పరీక్షలో అన్ని సబ్జెక్ట్‌లకు సమ ప్రాధాన్యం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా చదివాను. అన్ని సబ్జెక్ట్‌లకు సమ ప్రాధాన్యం ఇస్తూ ప్రిపరేషన్ సాగించాను. వాస్తవానికి ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటే కొంత క్లిష్టంగా ఉండేది. అయితే దీనికోసం ప్రత్యేకించి సమయం కేటాయించకుండా మిగతా సబ్జెక్ట్‌ల మాదిరిగానే చదివాను. అందుబాటులోని సమయంలోనే పరిపూర్ణ అవగాహన సాధించేందుకు కృషి చేశాను.
 
 బేరీజు వేసుకుంటూ:
 జేఈఈలో ప్రశ్నలన్నీ ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ నుంచే ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. ఇంటర్మీడియెట్ బోర్డ్ సిలబస్‌ను.. ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతుల సిలబస్‌ను బేరీజు వేసుకుంటూ చదివాను. బోర్డ్ సిలబస్‌లో లేని, ఎన్‌సీఈఆర్‌టీలో మాత్రమే ఉన్న అంశాలకు ప్రత్యేక సమయం కేటాయించాను. ఏ విషయాన్నయినా ఒక్కసారి చదివితే మెదడులో నిక్షిప్తమవుతుంది. అది బాగా అడ్వాంటేజ్‌గా మారింది. మా బ్యాచ్ నుంచి ఐపీఈ సిలబస్ మారింది. దాదాపు ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ మాదిరిగానే ఉంది. కాబట్టి ప్రత్యేకించి చదవాల్సిన అంశాలు చాలా తక్కువగా ఉండడం కూడా కలిసొచ్చిందనే చెప్పాలి.
 
 ప్రాక్టీస్ + అప్లికేషన్ ఓరియెంటేషన్:
 చదవడం ఎంత ముఖ్యమో... చదివిన అంశాలను ప్రాక్టీస్ చేయడమూ అంతే ముఖ్యం. అందుకే ప్రతి రోజు చదివిన అంశాలను కచ్చితంగా ప్రాక్టీస్ చేయడం హాబీగా చేసుకున్నాను. అంతేకాకుండా మ్యాథమెటిక్స్ నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీ వరకు ప్రతి అంశాన్ని అప్లికేషన్ ఓరియెంటేషన్‌లో చదవడం లాభించింది. వీటితోపాటు ప్రతి రోజు చదివిన అంశాలకు సంబంధించి సొంత నోట్స్ రాసుకోవడం రివిజన్ సమయంలో బాగా ఉపయోగపడింది. తద్వారా ఈ విజయం సాధ్యమైంది.
 
 ఐఐటీ టు ఐఏఎస్:
 ప్రస్తుతం వచ్చిన ర్యాంక్‌తో ఐఐటీ-ముంబైలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో చేరతాను. నాలుగేళ్ల ఈ కోర్సు పూర్తయ్యాక సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరై ఐఏఎస్ సాధించాలని.. తద్వారా ప్రజలకు సేవ చేయడమే భవిష్యత్తు లక్ష్యంగా నిర్ణయించుకున్నాను.
 
 ఒత్తిడి లేకుండా.. లక్ష్యంపైనే దృష్టి:
 జేఈఈ లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిడికి గురి కాకూడదు. ఏదైనా ఒక నిర్దిష్టమైన అంశాన్ని చదువుతూ ఒత్తిడికి గురైతే.. వెంటనే దాన్ని వదిలేసి సులువుగా, ఇష్టంగా ఉన్న అంశం చదవడం మేలు. అంతేకాకుండా ఒత్తిడికి లోనైతే లక్ష్యంపై నుంచి దృష్టి మళ్లే ప్రమాదం ఉంది. సబ్జెక్ట్ ఏదైనా ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వడం ఏమాత్రం విస్మరించకూడదు. మానసిక సంసిద్ధత, ఆత్మవిశ్వాసం ఆయుధాలుగా అడుగులు వేస్తే విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు.
 
 అకడెమిక్ ప్రొఫైల్:
     2012లో పదోతరగతి ఉత్తీర్ణత (9.8 జీపీఏ)
     2014లో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత (983 మార్కులు)
     ఎంసెట్-2014లో 10వ ర్యాంకు
     బిట్‌శాట్-2014 స్కోర్ 398
     జేఈఈ-మెయిన్ మార్కులు - 340
     జేఈఈ-అడ్వాన్స్‌డ్ మార్కులు- 320
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement