తేదీపై తొలుత ఈసీ పిల్లిమొగ్గ
న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం పిల్లిమొగ్గ వేసింది. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ఓట్లను లెక్కించే మే 16 దాకా నిషేధం కొనసాగుతుందని తొలుత ప్రకటించింది. కానీ మే 12న తుది దశ పోలింగ్ పూర్తయ్యేదాకా మాత్రమే నిషేధం వర్తిస్తుందంటూ కాసేపటికే స్పష్టత ఇచ్చింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ హెచ్‌ఎస్ బ్రహ్మ వ్యాఖ్యలు ఈ విషయంలో గందరగోళానికి దారితీశాయి. మే 16న ఓట్ల లెక్కింపు పూర్తయ్యేదాకా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పెట్టడానికి వీల్లేదని శుక్రవారం ఇండియన్ విమెన్ ప్రెస్ కార్ప్స్‌తో ఇష్టాగోష్టి సందర్భంగా బ్రహ్మ ప్రకటించారు. ‘‘16 సాయంత్రం దాకా మేం మిమ్మల్ని నోరెత్తనివ్వబోం.
ఏ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలైనా ఓట్ల లెక్కింపు పూర్తయ్యాకే! అయినా అంత తొందరేముంది? మహా అయితే మరో 150 గంటలు (మే 12 నుంచి 16 మధ్య). అంతే కదా!’’ అని వ్యాఖ్యలు చేశారు. మే 16లోపు ఎందుకు ప్రసారం చేయొద్దని ప్రశ్నించగా, ‘‘పలుచోట్ల రీపోలింగ్ జరిగే ఆస్కారముంటుందిగా. ఉండదని గ్యారంటీ ఏమీ లేదు కదా!’’ అని బదులిచ్చారు. ‘‘నిబంధనలు సుస్పష్టం. వాటి ప్రకారం ఎగ్జిట్ పోల్స్ నిషిద్ధం. 2010లో కూడా వాటిని మేం నిషేధించాం. కాబట్టి మే 16 దాకా ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ప్రసారాలకూ వీల్లేదు’’ అని పునరుద్ఘాటించారు. కానీ నిషేధం ఎప్పటిదాకా వర్తిస్తుందన్న విషయమై బ్రహ్మ పొరబడ్డారంటూ ఈసీ వర్గాలు కాసేపటికే వివరణ ఇచ్చాయి. 12న తుది దశ పోలింగ్ ముగిశాక అరగంట వరకు మాత్రమే నిషేధం వర్తిస్తుందని ఈసీ డెరైక్టర్ ధీరేంద్ర ఓఝా తెలిపారు. తుది దశ పోలింగ్ ముగిశాక అరగంట దాకా ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం ఉంటుందంటూ స్పష్టత ఇచ్చారు.
ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం 12 వరకే
Published Sat, May 10 2014 1:09 AM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM
Advertisement
Advertisement