జిల్లాలో సాధారణ ఎన్నికల పోలింగ్ శాతం మారింది. బుధవారం జరిగిన ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా 72.21 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు గురువారం ప్రకటించారు. మొదట జిల్లాలో 75.20 శాతం పోలింగ్ జరిగినట్టు వెల్లడించగా, తుది లెక్కల అనంతరం 3 శాతం తగ్గింది. జిల్లావ్యాప్తంగా 28,25,939 మంది ఓటర్లు ఉండగా, 20,40,562 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 7,85,377 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ గత ఎన్నికలతో పోలిస్తే, ఈసారి ఐదు శాతం పోలింగ్ పెరగడం విశేషం. 2009 సాధారణ ఎన్నికల్లో జిల్లాలో 67.05 శాతం పోలింగ్ నమోదైంది.
సాక్షి, కరీంనగర్ : జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లు, కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల, సిరిసిల్ల మున్సిపాలిటీలు, హుజూరాబాద్, హుస్నాబాద్, వేములవాడ, పెద్దపల్లి, జమ్మికుంట నగర పంచాయతీలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోనే ఓటర్లు ఎక్కువగా ఉంటారు.
విద్యావంతులు, మేధావుల సంఖ్య కూడా ఎక్కువే. అయినా సాధారణ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లోనే తక్కువగా పోలింగ్ న మోదు కావడం గమనార్హం. కరీంనగర్‌లో 57.88 శాతం, రామగుండంలో 61.79 శాతం పోలింగ్ జరగడం ఉదాహరణగా చెప్పవచ్చు. గ్రామీణ ప్రాంత ఓటర్లలో మాత్రం చైతన్యం వెల్లివిరిసింది. ఓటర్లు ప్రతి పోలింగ్ కేంద్రం ముందు బారులు తీరారు. ఓటుపై జిల్లా యంత్రాంగం, స్వచ్ఛందసంస్థలు ఎంత ప్రచారం చేసినా నగరాలు, పట్టణాల్లో ఫలితమివ్వలేదు. మంథని వంటి మారుమూల ప్రాంతంలో జిల్లాలోనే అత్యధికంగా పోలింగ్ నమోదు కావడం గ్రామీణ ఓటరు చైతన్యానికి నిదర్శనం.
మహిళలు, యువ ఓటర్ల జోరు..
జిల్లాలో మహిళా ఓటర్లు తమదైన ముద్ర వేసుకున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మహిళా ఓట్లు పురుషుల కంటే ఎక్కువగా పోలయ్యాయి. రెండు విడతలుగా జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 7,74,359 మంది పురుషులు ఓటేస్తే.. 8,44,923 ఓట్లతో మహిళలు ముందంజలో ఉన్నారు. సాధారణ ఎన్నికల్లోనూ మహిళలు తమ చైతన్యం చాటారు. కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు, హుస్నాబాద్ సెగ్మెంట్లలో మహిళలు పురుషులకు మించి ఓట్లేశారు. జిల్లాలో 14,18,011 పురుష ఓటర్లుండగా, 9,97,737 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 14,07,785 మంది మహిళా ఓటర్లకు.. 10,42,821 మంది ఓటు వేశారు. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోనూ మహిళా ఓట్లే అభ్యర్థుల విజయావకాశాలను నిర్ణయించనున్నాయి.
కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు, హుజూరాబాద్, హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 11,22,258 ఓట్లు పోలైతే.. అందులో 5,50,760 ఓట్లు పురుషులవి కాగా, మహిళలవి 5,71,498 ఓట్లు పోలయ్యాయి. యువ ఓటర్లు, తొలిసారిగా ఓటుహక్కు పొందిన వారు ఓటు వేసేందుకు ఉత్సాహం కనబరిచారు. గత రెండు నెలల వ్యవధిలో జిల్లాలో 82,715 మంది కొత్తగా ఓటుహక్కు పొందారు. వీరిలో 90 శాతం మంది తొలి ఓటును వినియోగించుకోవడం విశేషం.
ఓటేయని బద్ధకస్తులు 7,85,377
Published Fri, May 2 2014 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 AM
Advertisement
Advertisement