ఓడించినా.. గెలిపించారు
Published Thu, Apr 3 2014 4:09 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
నరసాపురం అర్బన్, న్యూస్‌లైన్ : ఓటమి విజయానికి నాంది.. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అని పెద్దలు అంటుంటారు. నరసాపురం ఎన్నికల సమరానికి సంబంధించి దశాబ్దాలుగా ఈ మాటలు నిజమవుతున్నాయి. నరసాపురం రాజకీయాలను పరిశీలిస్తే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందిన నాయకులు తర్వాత ఎన్నికల్లో విజయం సాధించడం ఆనవాయితీగా మారింది. ఓసారి ఓటమి చెందినా తరువాత ఆ నాయకులను అక్కున చేర్చుకోవడం నరసాపురం ఓటర్ల ప్రత్యేకత. సినీనటుడు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు 1991లో నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేశారు. అప్పటి సిట్టింగ్ ఎంపీ భూపతిరాజు విజయకుమార్‌రాజు (టీడీపీ) చేతిలో ఓటమి చెందారు. తిరిగి 1999లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన కృష్ణంరాజు కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై 1.5 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎన్డీఏ ప్రభుత్వంలో సహాయమంత్రిగా పలు శాఖలు నిర్వహించారు.
1996 ఎన్నికల్లో ఎంపీ స్థానానికి కనుమూరి బాపిరాజు కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచారు. టీడీపీ అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడుపై ఓటమి పాలయ్యారు. అయితే 1998లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కొత్తపల్లిని ఓడించిన ఓటర్లు బాపిరాజును ఎంపీగా ఎన్నుకున్నారు.
1962 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన పరకాల శేషావతారం కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి రుద్రరాజు సత్యనారాయణరాజు (ఆర్‌ఎస్) చేతిలో ఓటమిచెందారు. 1967 ఎన్నికల్లో తిరిగి పరకాల 3,781 ఓట్ల మెజార్టీతో ఆర్‌ఎస్‌పై గెలుపొందారు. 1972, 1978 ఎన్నికల్లో గెలుపొందిన పరకాల పలు కీలక శాఖల బాధ్యతలు నిర్వహించారు.
నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడుపై 2004 ఎన్నికల్లో ముదునూరి ప్రసాదరాజు (కాంగ్రెస్) పోటీచేసి స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓటమి చెందారు. తర్వాత 2009 ఎన్నికల్లో కొత్తపల్లిని ఓడించి ముదునూరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
Advertisement
Advertisement