సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. కలెక్టరేట్‌లోని మినీ మీటింగ్ హాలులో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను కలెక్టర్ వివరించారు. జిల్లాలో ఈ నెల ఏడు జరిగే పోలింగ్‌కు ఏలూరు, నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గాలకు 29 మంది, 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో 163 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు. ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు అన్ని రకాల ఎన్నికల ప్రచారాలు నిలుపుదల చేయాలని రాజకీయ పార్టీలను కోరారు.
ఉభయగోదావరి జిల్లాలలో ఈ ఎన్నికల్లో డబ్బు, మద్యం పెద్ద ఎత్తున పంపిణీ జరిగే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందిందని, ఈ దిశగా పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖలు విస్తృతమైన తనిఖీలు చేపట్టి నిరోధించాలని ఆదేశాలు వచ్చాయన్నారు. జిల్లాలో నిఘా బృందాల ద్వారా పెద్దఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రమేయాన్ని పూర్తిగా నిరోధించడానికి ఓటర్లు సహ కరించాలని కోరారు. ఓటర్లను ప్రలోభపెట్టే డబ్బు, మద్యం, ఇతర బహుమతుల పంపిణీపై సమాచారం అందించాలని కోరారు. వీరి పేర్లను గోప్యంగా ఉంచడంతో పాటు సముచితమైన రివార్డు అందిస్తామని పేర్కొన్నారు.
29,10,414 మంది ఓటర్లు
జిల్లాలో 29,10,414 మంది ఓటర్లు ఉన్నారని, వారిలో పురుషులు 14,36,286, మహిళలు 14,73,968, ఇతరులు 160 మంది ఉన్నారని కలెక్టర్ వివరించారు. చింతలపూడి నియోజకవర్గంలో అత్యధికంగా 2,36,825 మంది ఓటర్లు ఉండగా, నరసాపురం నియోజకవర్గంలో అత్యల్పంగా 1,54,417 మంది ఓటర్లు ఉన్నారన్నారు. జిల్లాలో మొత్తం 3,055 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, వాటిలో గ్రామీణ ప్రాంతాల్లో 2,518, పట్టణ ప్రాంతాల్లో 537 ఉన్నాయన్నారు. మొత్తం 30,776 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తారని, పరోక్షంగా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన ఇతర సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహిస్తున్నార న్నారు. పోలింగ్ విధులకు ప్రిసైడింగ్ అధికారులుగా 3,573 మంది, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు 3,552, అదనపు పోలింగ్ సిబ్బంది 20,917, మైక్రో అబ్జర్వర్లు 312, వీడియోగ్రాఫర్లు 370, డ్రైవర్లు 949, ఎన్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు 34 మందిని నియమించామన్నారు. ఈ ఎన్నికల్లో 19,578 మందికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, 1603 మందికి సర్వీసు ఓట్లు ఉన్నాయని వివరించారు.
ఈవీఎంలలో ఇబ్బందులు తలెత్తితే తక్షణం పరిష్కారం
జిల్లాలో ఓటర్లకు 29,14,414 ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాల్సి ఉండగా ఇంతవరకూ 17,42,270 ఓటరు స్లిప్పులు పంపిణీ చేశామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 6,600 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లకు మొదటి చెకప్ పూర్తి చేసి నియోజకవర్గాలకు పంపామన్నారు. వీటికి సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తితే తక్షణం పరిష్కరించేందుకు నియోజకవర్గానికి ఒక ఇంజనీర్‌ను, ఇద్దరు హౌసింగ్ ఇంజినీర్లను నియమించామని, అదనంగా ఈవీఎంలను కేటాయించినట్లు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వికలాంగులకు ర్యాంప్ సౌకర్యం కల్పించామని చెప్పారు.
సమస్యలుంటే టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయండి
జిల్లాలో ఎన్నికల సంబంధమైన ఫిర్యాదులను తెలియజేయడానికి 1800-425-1365 నెంబరుతో టోల్ ఫ్రీ నెంబరును ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ఓటర్లలో చైతన్యాన్ని కలిగించేందుకు ప్రచార రథాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించామని, గత ఎన్నికల కంటే ఈసారి ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటర్లు స్లిప్పులు తీసుకోకపోతే పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్‌లో పొందవచ్చన్నారు. అదేవిధంగా ఓటరు గుర్తింపు కార్డులు లేనివారు పాన్‌కార్డు, డ్రైనింగ్ లెసైన్స్ తదితర ఫొటో గుర్తింపు కార్డును చూపి ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు. జిల్లాలో 2361 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన 276 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామన్నారు. మోడల్ కోడ్ ఉల్లంఘించిన 27,086 మందికి నోటీసులు జారీ చేశామని, 2,281 మద్యం కేసులను సీజ్ చేశామని, 1468 మందిని అరెస్టు చేశామని కలెక్టర్ చెప్పారు. జేసీ టి.బాబూరావునాయుడు, డీఆర్‌వో కె.ప్రభాకరరావు, ప్రణాళిక శాఖ జేడీ కె.సత్యనారాయణలు పాల్గొన్నారు.