సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: క్షణం.. క్షణం ఉత్కంఠ.. ఉద్విగ్నత.. ఈ పరిస్థితికి మరికొన్ని గడియల్లో తెరపడనుంది. ఈవీఎంలో భద్రంగా నిక్షిప్తమైన అభ్యర్థుల జాతకం బయటపడనుంది. నువ్వా-నేనా అన్నట్లు హోరాహోరీగా సాగిన సార్వత్రిక సమరం ఫలితాల వెల్లడికి జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలకు సంబంధించి ఏడు చోట్ల కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఓట్ల లెక్కింపులో 1200 మంది సిబ్బంది పాలుపంచుకోనున్నారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించినట్లు కలెక్టర్ బి.శ్రీధర్ ‘సాక్షి’కి తెలిపారు.
ఉదయం పది గంటలకల్లా జనం నాడి ఎటువైపు ఉందో వెల్లడయ్యే అవకాశాలున్నాయి. పోటాపోటీగా జరిగిన ఈ సార్వత్రిక ఎన్నికల్లో హేమాహేమీలతోపాటు జిల్లాలో ఇద్దరు మాజీ హోం మంత్రుల తనయుల భవితవ్యం కూడా తేలనుంది. అసెంబ్లీ బరిలో 285 మంది, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాల్లో 45మంది అభ్యర్థుల జాతకం తేలనుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. అలాగే మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి సంబంధించిన ఫలితం అర్ధరాత్రి దాటాకే వచ్చే అవకాశం ఉంది. కాగా ఫలితాల సరళిని తెలుసుకునేందుకు కౌంటింగ్ కేంద్రాల వెలుపల ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేయడమే కాకుండా రౌండ్ల వారీగా అభ్యర్థులకు వచ్చిన ఓట్లను ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
బరిలో ఉద్దండులు..
ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల్లో రాజకీయాల్లో కాకలుతీరిన నాయకుల భవితవ్యం తేలనుంది. రాష్ట్ర విభజన అనంతరం జరుగుతున్న ఈ ఎన్నికలను అన్ని పార్టీలూ కీలకంగా భావించాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌లు పోటాపోటీగా ప్రచారపర్వాన్ని కొనసాగించాయి. చేవెళ్ల లోక్‌సభ సీటు కు నలుగురు వారసులు బరిలో ఉండ డం, మల్కాజిగిరి ఎంపీ స్థానంలో ప్రముఖులేగాకుండా, అధిక సంఖ్యలో ఆశావహులు రంగంలో నిలవడంతో వీటికి ప్రత్యేకత సంతరించుకుంది.
కౌంటింగ్ కేంద్రాలు ఇక్కడే...
కౌంటింగ్ కేంద్రం నియోజకవర్గాలు
డీఆర్‌కే ఇంజినీరింగ్ కాలేజీ, మేడ్చల్, మల్కాజిగిరి,
బౌరాంపేట్, కుత్బుల్లాపూర్ కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి
సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం ఉప్పల్, ఎల్బీనగర్
శ్రీ ఇందు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఇబ్రహీంపట్నం
అండ్ టెక్నాలజీ, శేరిగూడ
వీఎం హోం, సరూర్‌నగర్ మహేశ్వరం
జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియం, గచ్చిబౌలి రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి
ప్రభుత్వ జూనియర్ కళాశాల, చేవెళ్ల చేవెళ్ల
మహావీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ వికారాబాద్, తాండూర్