భగ్గుమన్న అసంతృప్తి
భగ్గుమన్న అసంతృప్తి
Published Sun, Apr 13 2014 2:15 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
సాక్షి ప్రతినిధి, విజయనగరం : టిక్కెట్ల కేటాయింపుపై తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు. అశోక్ గజపతిరాజును లోక్‌సభకు పోటీచేయించడాన్ని తట్టుకోలేకపోతున్న కార్యకర్తలు, పుండుమీద కారం చల్లినట్టుగా.... మీసాల గీతకు అసెంబ్లీ టిక్కెట్ కేటాయిస్తూ శుక్రవారం రాత్రి ఆ పార్టీ అధ్యక్షుడు ప్రకటించడంతో భగ్గుమంటున్నారు. అధిష్టానం తమ మొర వినిపించుకోవడం లేదని గగ్గోలు పెడుతున్నారు. చంద్రబాబు తనకు న చ్చినట్టుగా చేస్తే తోచిన విధంగా తాము ఎన్నికల్లో పనిచేస్తామని సంకేతాలు పంపిస్తున్నారు. అభ్యర్థుల ఖరారుపై విజయనగరం, ఎస్.కోట నియోజకవర్గాలకు చెందినపలువురు నేతలు బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేయగా, బీజేపీకి కేటాయించడాన్ని తప్పుపడుతూ గజపతినగరం నియోజకవర్గం నేతలు ఏకంగా అల్టిమేటం జారీ చేశారు. ఆదివారం సాయంత్రంలోగా తేల్చకపోతే తామొక నిర్ణయం తీసుకోవల్సి ఉంటోందని హెచ్చరిస్తున్నారు. విజయనగరం అసెంబ్లీ అభ్యర్థిగా మీసాల గీత, శృంగవరపుకోట అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి, బొబ్బిలి అభ్యర్థిగా తెంటు లక్ష్ముంనాయుడిని ప్రకటించారు. అభ్యర్థుల ప్రకటన వెలువడిన వెంటనే కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. క్యాడర్, నాయకులంటే లెక్క లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు.
కార్పొరేట్ మాయాజాలమా?
తీవ్రంగా వ్యతిరేకించినా మీసాల గీతను విజయనగరం అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించడంతో నియోజకవర్గ కేడర్ మండి పడుతోంది. సీనియర్లని కాదని కొత్తగా వచ్చిన వ్యక్తికి టిక్కెట్ ఇవ్వొద్దని గత కొన్ని రోజులుగా ఆ పార్టీ నేతలు బాహాటంగానే తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ల కాలంలో కాంగ్రెస్ నేతలు తమను నానా ఇబ్బందులకు గురిచేశారని, వాటిని మరిచిపోయి ఇప్పుడు ఎలా కలిసి పనిచేయగలమని, అందువల్ల గీతకు టిక్కెట్ కేటాయించవద్దని అధిష్టానాన్ని వేడుకున్నారు. పార్టీ జెండా మోసిన వారినే అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
అశోక్ గజపతిరాజు కూడా వారి వాదనకు పరోక్షంగా మద్దతు పలికారు. కానీ, అధిష్టానం లెక్కచేయలేదు. వారి గోడును ఏమాత్రం పట్టించుకోలేదు. ఆమెకే టికెట్ ఖరారు చేసింది. దీంతో కేడర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. టిక్కెట్ కేటాయింపు వెనుక పార్టీలోని కార్పొరేట్ పెద్దల కుట్ర దాగి ఉందని మండిపడుతోంది. లోపాయికారీ ఒప్పందం జరగడం వల్లే కార్యకర్తల మనోభావాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించేశారని వాపోతున్నారు. పార్టీలో కార్పొరేట్ హవా పెరిగిపోయిందని, ఇక పార్టీని ఎవరూ కాపాడలేరని చర్చించుకుంటున్నారు. తమ అభిప్రాయానికి విలువ ఇవ్వని పార్టీ విషయంలో తాము కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తామని అంతర్గత చర్చల్లో చెబుతున్నారు.
కోళ్ల టిక్కెట్‌పైనా రుసరుస
ఎస్‌కోట అసెంబ్లీ టిక్కెట్‌ను కోళ్ల లలితకుమారికి ఇవ్వడంపై రంధి మార్కండేయులు అసంతృప్తిగా ఉన్నారు. ఈయన అక్కడి టిక్కెట్ ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో అసమ్మతి అధికంగా ఉన్న లలితకుమారికి టిక్కెట్ ఎలా ఇస్తారని, గతంలో తనకిచ్చిన హామీని ఎలా విస్మరిస్తారని ఆయన వాపోతున్నారు. అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి టిక్కెట్ ఇవ్వడం దేనికీ సంకేతమని ఆధిష్టానాన్ని నిలదీసేలా ఆయన ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది నేతలు కూడా లోలోపల మండి పడుతున్నారు.
గజపతినగరం నేతల అల్టిమేటం
అధిష్టానంపై తీరుపై గజపతినగరం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస కేడర్ లేని బీజేపీకి గజపతినగరం నియోజకవర్గాన్ని కేటాయించడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. పదేళ్లుగా కేడర్ కాపాడుకుని వచ్చామని, ఈసారి పార్టీ పోటీ చేయకపోతే మరో ఐదేళ్లు పాటు కేడర్‌ను ఎలా కాపాడాలని అక్కడి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం తమ గోడు వినిపించుకోకపోతే కఠిన నిర్ణయం తీసుకోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు. కొంతమంది నాయకులు అడుగు ముందుకేసి ఆదివారం సాయంత్రం లోగా తేల్చకపోతే ఇండిపెండెంట్‌గా బరిలో దిగడం ఖాయమని అధిష్టానానికి హెచ్చరికలు పంపించారు. ఈమేరకు నియోజకవర్గ నాయకులు తరచూ సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుంటున్నారు. బీజేపీకి ఇచ్చే అవకాశం లేదని, పార్వతీపురం నియోజకవర్గాన్ని కేటాయించే అవకాశం ఉందని ఒకవైపు అశోక్ గజపతిరాజు నచ్చచెబుతున్నా నమ్మకం లేక వారంతా రోడ్డెక్కే పరిస్థితి కనబడుతోంది.
Advertisement