పవన్ కళ్యాణ్ 'జనసేన'తో పొత్తుకు బిజెపి యత్నం
సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీతో పొత్తుకు బిజెపి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బిజెపికి పెద్దగా బలంలేదన్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన విషయంలో తెలంగాణకు మద్దతు పలికినప్పటికీ ఆ పార్టీ పెద్దగా లాభపడే అవకాశాలు లేవు. ప్రస్తుత పరిస్థితులలో సీమాంధ్రలో అసలు పోటీ చేసే పరిస్థితేలేదు. వాస్తవాలు గ్రహించిన ఆ పార్టీ ముఖ్య నేతలు పొత్తులపై ఆశలు పెట్టుకున్నారు. ఆ రకంగా రాష్ట్రంలో పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ జనసేనతో దోస్తికి తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే టిడిపితో పొత్తు దాదాపు ఖరారైపోయినట్లే. అధికారికంగానే వెల్లడించవలసి ఉంది.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీపీడీ మధ్య సర్దుబాట్లపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. బిజెపితో పొత్తు కోసం టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరాటపడుతున్న విషయం అందరికి తెలిసిందే. బిజెపికి అది కలిసివచ్చింది. బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ రెండు రోజులుగా హైదరాబాద్లో మకాం వేసి ఈ పనిలోనే ఉన్నారు. తెలంగాణలోని స్థానిక నేతలు టిడిపితో పొత్తకు సుముఖత వ్యక్తం చేయడంలేదు. అయితే టిడిపితో పొత్తు అనివార్యమని, సర్దుకుపోవాలని ఆ పార్టీ నేతలకు జయదేకర్ సూచించారు. తెలంగాణలో బీజేపీకి ప్రాధాన్యత ఇవ్వడానికి, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ రెండు పార్టీల మధ్య ఒక అంగీకారం కుదిరింది. ప్రస్తుతానికి తెలంగాణలో బీజేపీ 64 అసెంబ్లీ, 9 లోక్‌సభ స్థానాలు, ఆంధ్రప్రదేశ్‌లో 6 లోక్‌సభ, 25 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయాలన్న ఆలోచనతో ఉంది. అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో పొత్తు కుదిరితే ఈ స్థానాలలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 19న ఢిల్లీలో జరిగే బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో పొత్తుల వ్యవహారాన్ని ఖరారు చేస్తారు.
పవన్తో పొత్తుపెట్టుకుంటే యువత ఓట్లు ఆకర్షించవచ్చని బిజెపి నేతులు భావిస్తున్నారు. పవన్ రాజకీయాలలోకి వస్తున్నారని తెలియగానే విమర్శించిన ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఇప్పుడు మాట మార్చారు. పవన్ కల్యాణ్ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తానంటే ఆహ్వానిస్తామని అన్నారు. 'కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో' నినాదంతో పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీని ప్రారంభించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీతో తప్ప ఏ ఇతర పార్టీతోనైనా కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఈ రకంగా ఆయన కొంతవరకు బిజెపికి దగ్గరవుతున్నట్లుగా భావించవచ్చు. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడిని పవన్‌కల్యాణ్ త్వరలో అహ్మదాబాద్లో గానీ, న్యూఢిల్లీలో గానీ కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. వారి కలయికలో పొత్తు అంశానికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. బిజెపి కూడా టిడిపి, జనసేన పొత్తుతో రాష్ట్రంలో రాజకీయంగా అబ్దిపొందాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.