బీజేపీలోకి బొత్స!
జిల్లా వ్యాప్తంగా పుకార్లు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై రోజుకో రూమర్ వస్తోంది. ఈసారి పోటీ చేసేదెక్కడ అన్నదానిపై నిన్నటి వరకు రకరకాల ప్రచారం జరగ్గా నేడు ఆయన ఏకంగా పార్టీయే మారిపోతున్నారన్న ప్రచారం చోటు చేసుకుంది. కాంగ్రెస్‌కు బద్ధ శత్రువైన బీజేపీలో చేరుతారని, సీట్ల కోసం బేరసారాలు సాగిస్తున్నారని మంగళవారం జిల్లా వ్యాప్తంగా చర్చ జరిగింది. ఇవన్నీ రూమర్సేనని కొంతమంది తేలికగా తీసుకోగా, లోపాయికారీగా ఏదో జరుగుతోందని మరికొంతమంది చెబుతున్నారు. ప్రజాదరణ, అనుచరగణాన్ని కోల్పోయిన బొత్స సత్యనారాయణ పరిస్థితి ప్రస్తుతం అయోమయంగా ఉంది.
తనతో పాటు పదిహేనేళ్లుగా నడిచిన నాయకులు, కార్యకర్తలు కనీసం పట్టించుకోవడం లేదు. రోజుకొకరు జారిపోతున్నారు. చెప్పాలంటే కాంగ్రెస్ రాజకీయాల్లో ఒంటరైపోతున్నారు. తన కుటుంబానికి చెందిన ప్రజాప్రతినిధులు, మరో ఐదేళ్లు ఎమ్మెల్సీ పదవి ఉన్న కోలగట్ల వీరభద్రస్వామి తప్ప మరెవరూ ఆయనతో ఉన్నట్టు కనిపించడం లేదు. దీంతో ఆయన దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ భవిష్యత్‌పై రకరకాల ఊహాగానాలొస్తున్నాయి. శృంగవరపుకోటలో పోటీ చేస్తారని ఒకసారి, చీపురుపల్లిలో అని మరోసారి, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి అని ఇంకోసారి ప్రచారం జరిగింది. కాదు...కాదు ఈసారి విజయనగరం ఎంపీగా పోటీ చేస్తారని మరో వాదన వినిపించింది. కానీ ఏ రోజూ ఆయన నోరు విప్పలేదు. తన రాజకీయ భవిష్యత్‌పై ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఈ తరుణంలో బీజేపీలో చేరుతున్నారని బొత్సపై కొత్త ప్రచారం మొదలైంది. ఇప్పటికే ఆ పార్టీ అధినాయకులతో మంతనాలు చేస్తున్నారని, తనతో పాటు తన కుటుంబంలోని పలువురికి టిక్కెట్లు కోసం చర్చిస్తున్నారని, త్వరలోనే పార్టీ జంప్ చేయడం ఖాయమని జిల్లా వ్యాప్తంగా పుకార్లు షికార్లు చేశాయి. పలువురు పత్రికా కార్యాలయాలకు ఫోన్‌లు చేసి వాస్తవమేనా అని అడుగుతున్నారు. దీన్నిబట్టి బొత్సపై ఏమేర ప్రచారం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఎంతమేర వాస్తవం ఉందో ఆయనే చెప్పాలి.