
బాబు గజమోసగాడు: రాఘవులు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మోసగాళ్లకే మోసగాడని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు.
కర్నూలు, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మోసగాళ్లకే మోసగాడని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన కర్నూలులో పలుచోట్ల మాట్లాడుతూ సీమాంధ్రను సింగపూర్ చేస్తానంటున్న చంద్రబాబు తొమ్మిదేళ్ల తన పాలనలో ఏమి చేసినట్లని ప్రశ్నించారు. అప్పట్లో బాబుతో పాటు 200 మంది ఎమ్మెల్యేలు సింగపూర్‌కు వెళ్లి షికారు చేసొచ్చారే కానీ సాధించిందేమీ లేదన్నారు. ఆయన చేతికి అధికారం వస్తే సింగపూర్ కాదు.. క్షవరం చేస్తారన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఓటమి ఖాయమని తేలిపోవడంతో బీసీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆ వర్గీయులను సీఎం చేస్తానని ప్రకటించారన్నారు. ఆయనకు స్వార్థం లేకపోతే అదే ప్రకటన సీమాంధ్రలోనూ చేయాలని డిమాండ్ చేశారు. మతతత్వ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారన్నారు. కాలకూట విషం కక్కే బాబు, మోడీల జోడీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. రాష్ట్రాన్ని విడగొట్టడంలో కాంగ్రెస్ పార్టీ మొదటి ద్రోహి కాగా.. లేఖ ఇచ్చిన చంద్రబాబు రెండో ద్రోహి.. అందుకు మద్దతిచ్చిన బీజేపీ మూడో ద్రోహిగా అభివర్ణించారు.