తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలు జిల్లాలో కాంగ్రెస్‌ను ఖంగు తినిపించాయి. ఆ పార్టీ ప్రముఖులు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్), మాజీ మంత్రులు మహ్మద్ షబ్బీర్ అలీ, పి.సుదర్శన్‌రెడ్డి, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి ఓటమి పాలయ్యారు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలు జిల్లాలో కాంగ్రెస్‌ను ఖంగు తినిపించాయి. ఆ పార్టీ ప్రముఖులు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్), మాజీ మంత్రులు మహ్మద్ షబ్బీర్ అలీ, పి.సుదర్శన్‌రెడ్డి, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం పార్టీ కుప్ప కూలింది. 2009 ఎన్నికలలో ఐదు స్థానాలు గెలుచుకున్న టీడీపీకి ఈసారి బోణీ కూడా కాలేదు. 2009, 2010 ఉప ఎన్నికలలో నిజామాబాద్ అర్బన్‌ను కైవసం చేసుకున్న బీజేపీ ఆ ఒక్క సీటును కూడా చేజార్చుకుంది. సార్వత్రిక ఎన్నిక ల ఫలితాలలో ‘కారు’ జోరు అప్రతిహతంగా కొనసాగింది.
నిరాశలో కాంగ్రెస్ శ్రేణులు
పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ 1999, 2004లో వరుసగా నిజామాబాద్ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2009, 2010 ఉప ఎన్నికల్లో ఆయన ఓటమి చెందిన ఆయన ఈసారి విజయమే లక్ష్యంగా నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ బరిలోకి దిగడంతో అక్కడ కూడ గట్టి పోటీ ఏర్పడి ంది. బాజిరెడ్డిపై 26,200 ఓట్ల తేడాతో ఓడిపోయారు. వరుసగా మూడోసారి ఓటమి చెందిన ఆయనకు 51,370 ఓట్లు రాగా, బాజిరెడ్డికి 77,570 ఓట్లు వచ్చాయి.
2009 లో కామారెడ్డిలో, 2010 ఉప ఎన్నికలలో ఎల్లారెడ్డిలో అపజయం పొందిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఈసారి మళ్లీ కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు. సమీప ప్రత్యర్థి, టీఆర్‌ఎస్ అభ్యర్థిపై 6,583 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. 1999 నుంచి వరుస విజయాలతో బోధన్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించిన మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డికి ఈసారి ఓటమి తప్పలేదు. 2009 ఎన్నికలలో గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మంత్రి పదవి వరించగా, ఈ సారి టీఆర్‌ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ చేతిలో 15,656 ఓట్లు వెనుకబడిపోయారు.
మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి1989 నుంచి 2004 వరకు బాల్కొండ నుంచి నాలుగుసార్లు వరుసగా గెలుపొంది రికార్డు నెల కొల్పారు. నియోజకవర్గాల పునర్విభజనతో ఆర్మూరు బాట పట్టి, 2009లో టీడీపీ అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మ చేతిలో 14 వేల పైచిలుకు ఓట్లతో ఓడిపోయారు. ఈ సా రి కూడ అర్మూరు బరిలో దిగిన సురేష్‌రెడ్డి మొదటిసారి రాజకీయాలలోకి దిగిన టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి చేతిలో 13,461 ఓట్ల తేడాతో ఘోర పరాజయ ం పొందడం చర్చనీయాంశంగా మారింది.
సైకిల్ పంక్చర్, వాడిన కమలం
సార్వత్రిక ఎన్నికలు ఇటు టీడీపీని అటు బీజేపీని కోలుకోకుండా చేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పొందింది. ఈ ఎన్నిక లకు నిజామాబాద్ రూరల్, ఆర్మూరు ఎమ్మెల్యేలు మండవ వెంకటేశ్వర్‌రావు, ఏలేటి అన్నపూర్ణమ్మ దూరంగా ఉండగా, కూటమిలో భాగంగా ఐదు స్థానాల్లో టీడీపీ, నా లుగు స్థానాలలో పోటీ చేసిన బీజేపీ ఒక్క స్థానాన్నీ దక్కించుకోలేకపోయాయి. 2009 ఎన్నికలలో నిజామాబాద్ రూరల్, ఆర్మూరు, కామారెడ్డి, జుక్కల్, బాన్సువా డ ను దక్కించుకున్న టీడీపీ, అంతకు ముందు జరిగిన ఎన్నికలలోనూ మూడు నుంచి ఆరు స్థానాలకు తక్కువ గెలిచిన పరిస్థితి లేదు.
2009లో ఐదుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి గెలిచినా, బాన్సువాడ, జుక్కల్, కామారెడ్డి ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హన్మంత్ సింధే, గంప గోవర్ధన్ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సార్వత్రిక ఎన్ని కలలో పోటీ చేసిన ఆ ముగ్గురు కూడ టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా గెలుపొందగా, టీడీపీకి జిల్లాలో ఒక్క స్థానం దక్కకపోవడం చర్చనీయాంశం అవుతోంది. కాగా 2009, 2010 ఉప ఎన్నికలలో నిజామాబాద్ అర్బన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా యెండల లక్ష్మీనారాయణ గెలుపొందారు. ఈ సార్వత్రిక ఎన్నికలలో ఆయన నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తను అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే అటు లోక్‌సభ, ఇటు అసెంబ్లీ స్థానంలోను ఆ పార్టీ ఓటమి చెందింది.