
జగన్‌తోనే అభివృద్ధి సాధ్యం
రాజంపేట, న్యూస్‌లైన్: ‘ప్రస్తుత ఎన్నికల్లో మాకు పోటీగా ధనికులు, కేంద్ర మాజీ మంత్రులు బరిలో ఉన్నారు.. అయితే మాకు రెండు కవచాలు ఉన్నాయని.. అవి జగన్ ఓదార్పు యాత్ర.. షర్మిల పాదయాత్ర అని’ వైఎస్సార్‌సీపీ రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. సోమవారం రాజంపేటలోని వైఎస్సార్ సర్కిల్ (పాత బస్టాండు)లో జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలతో పాటు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డిలు పాల్గొన్నారు. మిథున్‌రెడ్డి మాట్లాడుతూ రాజన్నపాలనను ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటున్నారన్నారు. పేద ప్రజలను ఆలోచింపచేసేలా వైఎస్సార్ పాలన ఉందన్నారు. ప్రచారానికి ఎక్కడికి వెళ్లినా ఆరోగ్యశ్రీ గొప్పతనం గురించి లబ్ధిదారులు చెపుతున్నారన్నారు. వృద్ధులు, వికలాంగులు అందుతున్న పింఛన్‌ను జగన్ సీఎం అయితే పెంచుతారన్న ఆశతో ఉన్నారన్నారు. డ్వాక్రా రుణాలుమాఫీ చేస్తామన్నారు. ఆకేపాటి మాట్లాడుతూ ప్రజల కష్టాలు తెలుసుకుని రాష్ట్రాన్ని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రగతిపథంలో నడిపించారన్నారు. ై
వెఎస్సార్‌ను పొగిడిన నేతలే ఆ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసి కష్టాలపాలు చేశారన్నారు. ఎన్నికల సమయంలో న్యాయం కోసం వైఎస్సార్‌సీపీ ఓటు అనే ఆయుధంతో న్యాయం చేయాలని కోరుతుందన్నారు. కిరణ్, చంద్రబాబుపాలనలో ప్రజలు అనేక కష్టాలు చవిచూశారన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. చంద్రబాబు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. జగన్ మాటలను ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారన్నారు. ఉచిత విద్యుత్ విషయంలో తీగలపై దుస్తులు ఆరేసుకుంటారని చంద్రబాబు అన్న మాటలను గుర్తు చేశారు. పార్లమెంటు స్థానానికి కేంద్ర మాజీ మంత్రులు పోటీ చేస్తున్నారని, వారు ధనబలంతో ముందుకొస్తున్నారన్నారు. ఉప ఎన్నికల్లో 39వేల ఓట్ల మెజార్టీతో గెలిపించినందుకు రుణపడి ఉంటానని అన్నారు. రాజంపేట ఆర్‌ఓబీని మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంజూరు చేశారని, దాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించి తాను చేసినట్లుగా చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి సోదరులు ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డి, ఆకేపాటి మురళీరెడ్డి, మాజీ ఎంపీపీ కడవకూటి సాయిబాబా, వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వినర్ పోలా శ్రీనివాసులురెడ్డి, ప్రముఖ న్యాయవాది కొండూరు శరత్‌కుమార్‌రాజు, రాజం పేట మార్కెట్ కమిటీ మాజీ చెర్మైన్‌లు చొప్పా యల్లారెడ్డి, పోలి సుబ్బారెడ్డి, గ్రంధాలయ సంస్థ మాజీ చెర్మైన్ రామప్రసాద్‌రెడ్డి, మైనార్టీ నేతలు మసూద్‌అలీఖాన్, జాహిద్‌అలీ పాల్గొన్నారు.