పచ్చ కండువా కప్పుకునేందుకు డీఎల్ విముఖత
కడప : మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు అయిష్టత ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. రాజకీయాల నుంచి విరమించుకోవాలనుకుంటున్న తరుణంలో డీఎల్‌ను తెలుగుదేశం పార్టీ నేతలు సంప్రదించారు. కడప పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయాలని అందుకు అవసరమైన ఖర్చు తామే భరిస్తామని హామీ ఇచ్చారు. గుడ్డికంటే మెల్ల మేలని ఆ ప్రతిపాదనకు డీఎల్ అంగీకరించినట్లు సమాచారం. అయితే అనూహ్యంగా కడప పార్లమెంటు అభ్యర్థిగా మాజీ మంత్రి ఆర్ రాజగోపాల్‌రెడ్డి తనయుడు శ్రీనివాసులరెడ్డి తెరపైకి వచ్చారు. ఈ వ్యవహారంలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చొరవ ఉన్నట్లు సమాచారం.
దీంతో ఒక్కమారుగా డీఎల్ నిరుత్సాహపడ్డారు. టీడీపీ నుంచి పోటీ చేయని పక్షంలో పచ్చ కండువా ఎందుకు కప్పుకోవాలనే దిశగా డీఎల్ చర్యలు ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగా ఆదివారం రాత్రి ఖాజీపేట నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. మాజీ మంత్రి డీఎల్ బాటలో పీసీసీ మెంబర్ రాంప్రసాద్‌రెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులుగా తన అనుచరులను నిలిపినా పార్టీలో చేరేందుకు మాత్రం సుముఖంగా లేరు. ఆమేరకే ప్రజాగర్జనలో టీడీపీ తీర్థం పుచ్చుకునే కార్యక్రమానికి గైర్హాజరు కానున్నట్లు సమాచారం.
అసంతృప్తిలో కందుల ..
కడప పార్లమెంటు టికెట్ ఆశిస్తున్న కందుల రాజమోహన్‌రెడ్డి సైతం టీడీపీ అనుసరిస్తున్న వైఖరితో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచా రం. పలు పర్యాయాలు వద్దన్నా తమతో పోటీ చేయించి, ఇప్పడు టికెట్ అడిగినా ఇవ్వరా..అన్న ఆక్రోషంలో కందుల శివానందరెడ్డి ఉన్నట్లు సమాచారం.
ఇకపై తాను తెలుగుదేశం పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉంటానని, నీవు మాత్రమే రాజకీయాలలో కొనసాగవచ్చని సోదరుడు రాజమోహ న్‌రెడ్డికి స్పష్టం చేసినట్లు సమాచారం. ఎంపీ రమేష్ ఏకపక్ష వైఖరితో కందుల సోదరులు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమేరకు కొత్తగా చేరినట్లు కాకుండా ప్రజాగర్జనకు మాత్ర మే హాజరైందుకు రాజమోహన్‌రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకు కూడా శివానందరెడ్డి దూరంగా ఉండనున్నట్లు సమాచారం.