తెలంగాణ జిల్లాల్లో ఎన్నికల నగారా మోగుతోంది. నేటి ఉదయం 11 గంటలకు 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు.
సీఈఓ భన్వర్‌లాల్ వెల్లడి
తెలంగాణ జిల్లాల్లో 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ స్థానాలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జిల్లాల్లో ఎన్నికల నగారా మోగుతోంది. నేటి ఉదయం 11 గంటలకు 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. సీమాంధ్ర జిల్లాల్లో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. ఆయన మంగళవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ వివరాలు..
తెలంగాణ జిల్లాల్లోని 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ స్థానాలకు బుధవారం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 9వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.
నామినేషన్ల దాఖలు సందర్భంగా అభ్యర్థుల ఆస్తులు, కేసుల వివరాలకు సంబంధించిన అఫిడవిట్‌లోని ప్రతి కాలమ్‌ను పూరించాలి. ఏదైనా కాలమ్ వర్తించకపోతే అదే విషయాన్ని రాయాలి. ఏ కాలమ్ వదిలినా నామినేషన్ చెల్లదు. అఫిడవిట్‌లో అభ్యర్థి దేశంలోని ఆస్తులతో పాటు ఇతర దేశాల్లోని ఆస్తులు, పెట్టుబడులను వివరించాలి. అలాగే అభ్యర్థి భార్యతో పాటు తనపై ఆధారపడిన పిల్లలు, ఇతరుల ఆస్తుల వివరాలను వెల్లడించాలి.
గుర్తింపు పొందిన పార్టీల తరుఫున పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్‌ను ఒకరు ప్రతిపాదిస్తే సరిపోతుంది. రిజిష్టర్, రిజిష్టర్ కాని పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను పది మంది చొప్పున ప్రతిపాదించాలి. నామినేషన్‌తో పాటు ఓటర్‌గా నమోదైన పత్రాన్ని సమర్పించాలి. స్వయంగా అభ్యర్థిగాని వారి తరుఫున మరొకరు గాని నామినేషన్ దాఖలు చేయవచ్చు.
నామినేషన్ దాఖలు సందర్భంగా రిటర్నింగ్ కార్యాలయానికి వంద మీటర్ల లోపునుంచి మూడు వాహనాలనే అనుమతిస్తారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అభ్యర్థితో పాటు ఐదుగురిని మాత్రమే అనుమతిస్తారు.
నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు లోక్‌సభకైతే రూ. 25వేలు, అసెంబ్లీకైతే రూ.10వేలు చొప్పున డిపాజిట్ చేయాలి. అదే ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారైతే లోక్‌సభకు రూ.12,500, అసెంబ్లీకైతే రూ. 5,000 డిపాజిట్ చేయాలి.
తెలంగాణ జిల్లాల్లో ప్రభుత్వ సెలవు రోజులైన 5వ తేదీ బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి, 8వ తేదీ శ్రీరామనవమి రోజుల్లో కూడా నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ రెండు రోజులను నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ చట్టం కింద సెలవు ప్రకటించనందున ఆ రోజుల్లో కూడా నామినేషన్లు స్వీకరిస్తారు.
జంటనగరాల్లో ఓటర్లందరికీ ఈ నెల 7వ తేదీ నుంచి ఓటర్ స్లిప్ పంపిణీ ప్రారంభించి ఈ నెల 20వ తేదీకల్లా పూర్తిచేస్తారు. మిగతా తెలంగాణ జిల్లాల్లో ఈ నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఓటర్ స్లిప్‌లు పంపిణీ చేస్తారు.
ఈవీఎంల వినియోగంపై తెలంగాణ జిల్లాల్లో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రతి గ్రామంలో సదస్సులు నిర్వహిస్తారు.
తెలంగాణ జిల్లాల్లోని మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలైన సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, చెన్నూరు, మంథని, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే జరుగుతుంది. మిగతా నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.