* జెడ్పీటీసీ స్థానాలు: 46
* పోటీ చేసిన అభ్యర్థులు: 236
* ఎంపీటీసీ స్థానాల సంఖ్య: 685
* పోటీ చేసిన అభ్యర్థుల సంఖ్య: 2,583
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ఉత్కంఠకూ తెరపడనుంది. వీటి ఫలితాల కోసం ఇటు అభ్యర్థులు.. అటు ప్రజలు సుమారు నెల రోజులకు పైగా నిరీక్షిస్తున్నారు. జిల్లాలోని 46 జెడ్పీటీసీ, 685 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రెండు విడతలుగా జరిగిన విషయం విదితమే. గత నెల 6న 24 మండలాలు, 11న 22 మండలాలకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. కాగా ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.
జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో మండలాల వారీగా ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. సంగారెడ్డిలో 15 మండలాలు, మెదక్‌లో 18 మండలాలు, సిద్దిపేటలో 13 మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మితా సబర్వాల్ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సోమవారం సమీక్షించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా ఓట్ల లెక్కింపు చేపట్టాలని ఎన్నికల అధికారులను ఆదేశించారు. మరోవైపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు.
మండలానికి పది కౌంటర్లు..
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ మండలాల వారీగా జరగనుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్లను లెక్కిస్తారు. ప్రతి మండలానికి పది చొప్పున కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కో కౌంటర్ వద్ద కౌంటింగ్ సూపర్‌వైజర్, ముగ్గురు కౌంటింగ్ సిబ్బంది ఉంటారు. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ బ్యాలెట్ పత్రాలను 25 చొప్పున బండిళ్లు కడతారు. ఇలా కట్టిన బండిళ్లను ఒకచోట డ్రమ్ములోచేర్చి ఆ తర్వాత వెయ్యి చొప్పున కౌంటింగ్ సిబ్బందికి అందజేస్తారు. ఐదు టేబుల్స్‌లో జెడ్పీటీసీ, ఐదు టేబుల్స్‌లో ఎంపీటీసీ ఓట్లను లెక్కిస్తారు. ఇదిలా ఉంటే బ్యాలెట్ పత్రాల ఓట్ల లెక్కింపునకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీంతో ఫలితాలు వెల్లడి జాప్యమయ్యే అవకాశం ఉంది. మొదటగా ఆర్‌సీపురం ఫలితాలు చివరగా జహీరాబాద్, పటాన్‌చెరు మండలాల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జెడ్పీ చైర్మన్ పదవి ఏ పార్టీకి దక్కుతుందోనని పార్టీలతోపాటు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ ఎస్ పార్టీలు తామంటే తాము మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గత ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పైచేయిగా ఉంది. అయితే తెలంగాణ సాధించామన్న ధీమాతో ఉన్న టీఆర్‌ఎస్ గ్రామీణ ఓటర్లు తమ పార్టీకి పట్టం కడతారని ఆశిస్తోంది. ఏ పార్టీకి మెజార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు వస్తాయో వేచి చూడాల్సి ఉంది.
కౌంటింగ్ కేంద్రాల వివరాలు
సంగారెడ్డి ఎంపీపీ కార్యాలయం: సంగారెడ్డి మండలం
తారా డిగ్రీ కళాశాల: సదాశివపేట, కొండాపూర్, ఆర్‌సీపురం, మునిపల్లి, రాయికోడ్, ఝరాసంగం
మహిళా ప్రాంగణం(సంగారెడ్డి): పటాన్‌చెరు, న్యాల్‌కల్, కోహీర్, మనూర్
పాత డీఆర్‌డీఏ కార్యాలయం(సంగా రెడ్డి): నారాయణఖేడ్, కంగ్టి, కల్హేర్
రాయల్ డిగ్రీ కాలేజ్(మెదక్): పాపన్నపేట, పెద్దశంకరంపేట, చేగుంట, అల్లాదుర్గం, రేగోడ్, మెదక్, కొల్చా రం, నర్సాపూర్, పుల్కల్, వెల్థుర్తి, జిన్నారం, శివ్వంపేట, హత్నూర
{పభుత్వ డిగ్రీ కాలేజ్(మెదక్): టేక్మాల్, రామాయంపేట, చిన్నశంకరంపేట, అందోలు, కౌడిపల్లిఇందూరు బీఈడీ, ఇంజినీరింగ్ కళాశాల భవనం(సిద్దిపేట): మిరుదొడ్డి, జగదేవ్‌పూర్, నంగనూరు, దుబ్బాక, కొండపాక, చిన్నకోడూరు, సిద్దిపేట, ములుగు, దౌల్తాబాద్, వర్గల్, గజ్వేల్, తొగుట, తూప్రాన్.
‘స్థానిక’ తీర్పు నేడే
Published Mon, May 12 2014 11:52 PM | Last Updated on Sat, Sep 2 2017 7:16 AM
Advertisement
Advertisement