ఈవీఎంల్లో భద్రం!
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ఘట్టం ముగిసింది. ఎన్నికల నోటిఫికేషన్ నుంచి పోలింగ్ వరకూ నాయకులు, అభ్యర్థులు ప్రజలకు ఎన్నో హామీలిచ్చారు. అది చేస్తాం.. ఇది చేస్తామంటూ వాగ్దానాలు సంధించారు. దీనిపై ఓటర్లు తీర్పు కూడా ఇచ్చేశారు. ఓటరు మారాజు తీర్పు ప్రస్తుతం ఈవీఎంలలో భద్రంగా ఉంది. ఈ తీర్పుపై అటు అభ్యర్థులు, ఇటు నాయకుల మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తాయంటే.. లేదు లేదు ఈ అభ్యర్థికి అంత సీను లేదంటూ వాగ్వాదాలు, వాదనలు, చర్చలూ మొదలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా తొమ్మిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 86 మంది అభ్యర్థులు పోటీలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరిలో ఎవరు గెలుస్తారన్న దానిపై ఇప్పుడు జోరుగా చర్చలు సాగుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు, విశ్లేషకులే కాకుండా ఉద్యోగ, వ్యాపార వర్గాల వారు కూడా ఈ విశ్లేషణలకు ఫిదా అయిపోతున్నారు. మా వాడు గెలుస్తాడంటున్నారంటూ ఆనందంలో మునిగితేలుతున్నారు. బరిలో ఎంతమంది ఉన్నప్పటికీ... కేవలం మూడు పార్టీల మధ్యే ప్రధాన పోటీ జరిగింది. ఇందులోనూ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ ఎన్నికల్లో దయనీయమైంది. వైఎస్‌ఆర్ సీపీ, టీడీపీల మధ్యే ప్రధాన పోటీ అని విశ్లేషకులు చెబుతున్నారు. కురుపాం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, గజపతినగరం, విజయనగరం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, ఎస్.కోట నియోజకవర్గాల్లో తామే గెలుస్తామంటే.. తామే గెలుస్తామంటూ ఆయూ నేతలు చెబుతున్నారు. ఓటింగ్ శాతం ఎక్కువగా జరిగిన ప్రాంతాలను ప్రాతిపదికగా తీసుకుని అభ్యర్థులు గెలుపోటములను అంచనా వేస్తున్నారు.
తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో కలసి వచ్చినచోట గెలుపును అంచనా వేస్తున్నారు. కురుపాం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, విజయనగరం నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లోనూ గెలుపు తమదేనంటూ గట్టి నమ్మకంతో చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. మరోవైపు ఫలితాలపై బెట్టింగులు జోరందుకున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి కూడా బెట్టింగ్ రాయుళ్లు వచ్చి వివిధ ప్రాంతాల్లో బెట్టింగులకు దిగుతున్నారు. విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, కురుపాం, సాలూరు నియోజకవర్గాలపై బెట్టింగ్ రాయుళ్లు ఎక్కువగా పందాలకు దిగుతున్నట్లు సమాచారం.
గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, ఎస్.కోట నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు మంచి మెజార్టీతో గెలుపొందుతారని పందాలకు దిగుతున్నారు. జిల్లాలోని అధిక నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయూవకాశాలపైనే అధిక శాతం పందెం కాస్తున్నారు. మొదటి నుంచీ పార్టీకి కష్టపడి పని చేసిన వారిని గుర్తించి వారి ద్వారా నియోజకవర్గంలోని ఓటింగ్ సరళిని తెలుసుకుంటున్నారు. ఇక్కడి నాయకుల కన్నా పై ప్రాంతాల్లో ఉన్న వారే ఎక్కువగా అభ్యర్థుల బలాబలాలను, వారికి పడే ఓట్లను బేరీజు వేస్తున్నారు.