బాబు కాలం భయానకం | in chandra babu naidu ruling farmers got many problems | Sakshi
Sakshi News home page

బాబు కాలం భయానకం

Published Thu, May 1 2014 11:27 PM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM

బాబు కాలం భయానకం - Sakshi

బాబు కాలం భయానకం

కరుణించని ప్రకృతి ఓ వైపు అతలాకుతలం చేయగా.. మరో వైపు ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం రైతులపై ఉక్కుపాదం మోపింది. అన్నదాతలు బాబు తొమ్మిదేళ్ల పాలనలో అష్టకష్టాలు పడ్డారు.

 కరుణించని ప్రకృతి ఓ వైపు అతలాకుతలం చేయగా.. మరో వైపు ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం రైతులపై ఉక్కుపాదం మోపింది. అన్నదాతలు బాబు తొమ్మిదేళ్ల పాలనలో అష్టకష్టాలు పడ్డారు. ఈ విపత్కర పరిస్థితుల్లో రైతులు దిక్కులేని అనాథలుగా మారారు. ఆపత్కాలంలో అండగా నిలవాల్సిన ప్రభుత్వం అత్యంత కర్కశంగా వ్యవహరించింది. రైతులకు నడిపొద్దున ఆకాశంలో చుక్కలు చూపిన ఆ భయానక రోజులను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు.  మళ్లీ ఆయన పాలనంటే ఎక్కడ ఉచిత విద్యుత్ ఎత్తేస్తాడోనని.. కరెంటోళ్లు స్టార్టర్లు ఎత్తుకెళ్తారేమోనని.. విద్యుత్ కనెక్షన్లు కట్ చేస్తారేమోనని జడుసుకుంటున్నారు. బుద్ధి ఉంటే మరోసారి ఓటేస్తామా అంటూ రైతులు తమ ఇక్కట్లను కళ్లకు కట్టినట్లు ఏకరువు పెడుతున్నారు.
 
 బాబంటే భయమేస్తాది
తొమ్మిదేళ్లలో యానాడు పంటలు సరిగ పండల్యా. సేన్లు సేసుకోలేక పొట్ట సేతపట్టుకుని బెంగళూరు, గుంటూరుకు వెళ్లేటోల్లం. పంట అంతంతే వస్తుండె. తక్కువ ధరకు అమ్ముకుని నస్టపోతుంటిమి. బిల్లులు కట్టకపోతే కరెంటోళ్లు ఎంటబడుతుండ్రి. రేత్రిళ్లు వచ్చి కరెంటు పేకేసిపోతుంటే ఏమీ అనలేక ఏడుస్తుంటిమి. పంటలు ఎండిపోతెంటె ఎవరికి సెప్పుకోవాల్నో తెలకపోతుండె. వైఎస్ వచ్చినాక మా బతుకులు బాగుపడినాయి.
 - ఈరన్న, బసరకోడు, ఆదోని మండలం
 
 పంటలు ఆటికాడికే
పదెకరాల పొలం.. ఒక బోరు ఉంది. నెలకు రూ.250 లెక్కన సంవత్సరానికి రూ.3 వేల బిల్లు వచ్చేది. పంటలు ఆటికాటికే పండుతుండె. కరువుతో కరెంటు బిల్లులు కట్టలేమని నెత్తినోరు మెత్తుకున్నా యా సామీ పట్టించుకుంటుండ్ల్యా. రైతులంటే చంద్రబాబుకు గిట్టదు. వైఎస్ వచ్చినాక ఉచిత విద్యుత్ ఇచ్చి నాలాంటి రైతులకు అండగా నిలిచినారు. ఆయన మేలు మరిచిపోలేం. కరెంటు కూడా బాగా ఇస్తుండ్రి.
 - పెద్దన్న, శిరివెళ్ల
 
 పోలీసులు వస్తుండ్రి
కరెంటోళ్లు విద్యుత్ బకాయిల వసూళ్లకు పోలీసులను వెంటబెట్టుకుని వస్తుండ్రి. స్టార్టర్లు ఎత్తుకుపోతే ఏమీ చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటుంటిమి. ఎకరా రూ.14 వేల మాదిరి ఆరు ఎకరాలు కౌలుకు తీసుకోయింటి. వరి పంట వేస్తే కరెంటు ఎప్పుడొస్తుందో తెలక రాత్రంతా ఎదురుచూడాల్సి వస్తుండె. బిల్లులు ఏమో వేలల్లో వస్తుంటే ఎట్టా కట్టాలో తెలక అల్లాడిపోతుంటిమి. బాబు పేరు వింటే ఇప్పటికీ భయమేస్తాది.
 - బాలవర్ధిరాజు, గుళ్లదూర్తి, కోవెలకుంట్ల మండలం
 
పాలనంతా కేసుల భయమే
చంద్రబాబు పాలనలో విద్యుత్ బిల్లులు చెల్లించలేని తమలాంటి రైతులంతా కేసుల బయంతో చచ్చిపోయేటోళ్లం. నాకున్న ఐదెకరాల్లో పత్తి, వరి, పొద్దుతిరుగుడు పంటలను సాగు చేస్తుంటి. నెల తిరిగేసరికి కరెంటు బిల్లు వేలల్లో వస్తుండె. ఆర్థిక స్థోమత లేక బిల్లు చెల్లించకపోతే అధికారులు వెంటబడుతుండ్రి. కరెంటు కట్ చేస్తూ.. స్టార్టర్లు ఎత్తుకపోతున్యారు. వ్యవసాయం చేయాలంటేనే భయమేస్తుండె.
 - చాగంటి శ్రీనివాసరెడ్డి, చెన్నంపల్లె, అవుకు(మం
 
ఉచిత విద్యుత్‌ను ఎత్తేస్తాడు

తన పాలనలో రైతులను ఏపుకు తిన్న చంద్రబాబు అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్‌ను ఎత్తేస్తాడు. నాకు ఏడెకరాల పొలం ఉంది. మరో ఐదెకరాలు గుత్తకు తీసుకున్నా. రెండు మోటార్లు ఉన్నాయి. నెలకు రూ.300 విద్యుత్ బిల్లు వచ్చేది. కరెంటోళ్లు బిల్లుల కోసం చంపుకుతింటుండ్రి. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక రూ.2వేల విద్యుత్ బకాయి రద్దయింది. బాబు ఇప్పుడు ఏమి చెప్పినా రైతులు నమ్మే పరిస్థితి లేదు.
 - జి.సలాం, శిరివెళ్ల
 
 పారిపోయేటోళ్లం

నాకున్న నాలుగున్నర ఎకరాల్లో అరటి, వరి సాగు చేసేందుకు విద్యుత్ బిల్లు రూ.8 వేల వరకు వచ్చేది. వర్షాలు కురవక.. కరెంటు సక్రమంగా సరఫరా కాక పంటలు చేతికందకపోవడంతో చంద్రబాబు పాలనలో ఐదారేళ్లు రూ.50వేల వరకు బిల్లు బకాయి పడింది. వారానికోసారి కరెంటోళ్లు వచ్చి నానా రభస చేసేటోళ్లు. పంట వచ్చే వరకు గడువివ్వమన్నా వినలేదు. జీపు శబ్ధం వినపడితే చాలు పారిపోవాల్సి వచ్చేది.
 - టంగుటూరు రామచంద్రుడు, ఆలమూరు
 
 కరెంటు కోసం ఎదురు సూస్తుంటిమి
 చంద్రబాబు పాలనలో కరెంటు కోసం ఎదురుచూడాల్సి వస్తుండె. ఎప్పుడొస్తాదో.. ఎప్పుడు పోతాదో తెలక శానా కష్టపడుతుంటిమి. కరెంటు బిల్లులు కూడా అట్టనే వస్తుండె. మాలెక్కటి రైతులకు వేలల్లో బిల్లులొస్తే ఎట్టా కట్టాల. ఆయనేమో అర్థం సేసుకోరు. కరెంటోళ్లు మీద పడుతుండ్రి. ఆళ్లు వస్తారని తెలిస్తే పారిపోతుంటిమి. కరెంటు లేక నీళ్లు పెట్టకపోతే పంట ఎండిపోతుండె. వైఎస్ వచ్చినాక కరెంటు ఇబ్బందులు లేవు.
 - లక్ష్మీనారాయణరావు, ఎడవలి
 
 పంటలు ఎండిపోతుండె
 నాకు మూడెకరాల తడి భూమి ఉంది. ఏటా రెండు కార్లు పండిస్తా. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు బిల్లు శానా వచ్చేది. నెలకు రూ.1000ల వరకు వస్తుండె. తినేకే కష్టమైతుంటే అంత డబ్బులు ఎట్టా కడతామని ఎవ్వరూ ఆలోచించకపోయిరి. పంటలు చేతికొస్తాయనంగ కనెచ్చన్లు కట్ సేసిపోతుండ్రి. నీళ్లు పారించుకోలేక నరకం కనిపిస్తుండె. అప్పుల పాలయితుంటిమి. వైఎస్ వచ్చిన ఉచిత విద్యుత్ ఇచ్చినారు. ఇప్పుడు బాగుంది.
 - పెద్దన్న, వెల్దుర్తి
 
 ఆయిల్ ఇంజన్లు పెట్టుకోయింటిమి
 నాలుగు ఎకరాల పొలం ఉంటే బోరు వేయించుకోయింటి. చంద్రబాబు యానాడు కరెంటు సక్కగా ఇయ్యల్యా. ఒక్క కారు పండించుకోవడం కూడా గగనమే. కరెంటు బిల్లులు చెల్లించుకోలేకపోతే నాలుగైదుసార్లు సారోళ్లు బోరు స్టాటర్లు పీక్కుపోయిండ్రి. దిక్కులేక ఆయిల్ ఇంజన్‌తో వక్కిలేరు నీటిని పారించుకుంటుంటి. వైఎస్ ముఖ్యమంత్రి అయినాక ఉచిత విద్యుత్ ఇచ్చినాడు. ఇప్పుడు రెండు కార్లు పంటించుకుంటున్నా.
 - ముల్లా అల్తాఫ్, కోటకందకూరు
 
 పంటలు ఎండిపోయేవి
 చంద్రబాబు పాలనలో  కరెంటు కోతలు ఎక్కువుండేవి. ఇంటోళ్లంతా కరెంటు కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. రాత్రి పూట కాపలా కాసినా అట్లొచ్చి ఇట్ట పోయే కరెంటుతో నరకం కనిపించేది. ఎకరా కౌలు రూ.5వేలు. పంట ఎండిపోతుంటే ఎడ్చేదొక్కటే తక్కువ. కరెంటోళ్లు బిల్లుల కోసం రాత్రి పగలు తేడా లేకుండా వచ్చిపోతుండ్రి. రాజన్న పాలనలో రెండు కార్లు మాగాణి పండిస్తున్నా. ఆర్థికంగా కూడా నిలదొక్కుకున్నా.
 - శ్రీను, మిట్టపల్లె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement