కేసీఆర్‌ది... అధికార దాహం
ఇంటర్వ్యూ: పొన్నాల లక్ష్మయ్య
‘సీసా లేదు, పైసా లేదు’ అని శంకరమ్మను కేసీఆర్ అవహేళన చేశాడు
వైఎస్ పథకాలు మరింత మెరుగ్గా తెలంగాణలోనూ కొనసాగుతాయి
చంద్రబాబును ఎవరూ నమ్మరు.. బీసీ సీఎం అనడం పెద్ద ఫార్స్
ఎలక్షన్ సెల్ : పొన్నాల లక్ష్మయ్య... తెలంగాణకు తొలి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. ఎన్నికల ప్రచారం జోరు మీదున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, పొన్నాల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ పెరుగుతోంది. తెలంగాణ తమ వల్లే సాకారమైందనే ప్రచారంతోనే ఎవరికి వారు ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పలు అంశాలపై ‘సాక్షి’ ప్రతినిధికి పొన్నాల ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే...
సోనియా వల్లే రాష్ట్రం సాకారమైందన్న భావన తెలంగాణ ప్రజల హృదయాల్లోకి చొచ్చుకుపోయింది. సోనియా-తెలంగాణ... ఈ రెండూ విడిపోని బంధం. మరో ప్రాంతంలో ఇబ్బందులున్నా తెలంగాణ ఇచ్చారని అందరూ కాంగ్రెస్‌ను హర్షిస్తున్నారు. పార్లమెంటులో బిల్లు ఆమోదానికి సోనియా చూపిన చొరవ, పట్టుదలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్తాం. సుస్థిర పాలన... సుపరిపాలన... సామాజిక భాగస్వామ్యం ప్రధానాంశాలుగా ముందుకెళ్తాం. తెలంగాణలో గెలుపు మాదే.
టీఆర్‌ఎస్‌కు ప్రజల మద్దతు లేదు
తమ వల్లే తెలంగాణ వచ్చిందని టీఆర్‌ఎస్ చెప్పుకోవడం విడ్డూరం. టీఆర్‌ఎస్ కంటే ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సాధనకు కృషి చేసింది. అయినా ఇద్దరు ఎంపీలున్న ఆ పార్టీ, పైగా పరస్పరం పొసగని ఇద్దరు ఎంపీలు... 543 మంది ఎంపీలున్న లోక్‌సభను ప్రభావితం చేయగలరని ఎవరనుకుంటారు? కాంగ్రెస్ లేకుంటే వీరివల్ల తెలంగాణ సాకారం అయ్యేదా? బిల్లు ఆమోదంలో టీఆర్‌ఎస్ పాత్ర ఏమాత్రం లేదని సోనియా కూడా స్పష్టం చేశారు. 2004 ఎన్నికల ప్రణాళికలోనే తెలంగాణ సాధన లక్ష్యాన్ని కాం గ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్‌తోనే తెలంగాణ సాధ్యమనే నాడు టీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుంది. 50 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ కేవలం 26 స్థానాల్లోనే గెలిచింది.
2009లో కాంగ్రెస్‌తో తెలంగాణ రాదని భావించిన ఆ పార్టీ మహా కూటమిగా ఏర్పడిన టీడీపీ, సీపీఐ, సీపీఐ పంచన చేరింది. అయినా 52 స్థానాల్లో పోటీ చేసి కేవలం 10 సీట్లే గెలిచింది. ఇది దేనికి ప్రతీక? ప్రజలు వారిని ఆదరించనే లేదు. తెలంగాణ సాకారమయ్యాక ఇటీవల జరిగిన స్థానిక సంస్థల, మునిసిపాలిటీల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు, ఇతర పార్టీలకు కనీసం అభ్యర్థులు దొరకలేదంటే వారి గ్రాఫ్ పెరిగినట్టా, తగ్గినట్టా? పైగా టీఆర్‌ఎస్ ఇప్పుడు ఇతర పార్టీల నుంచి వచ్చిన 20 మందికి, తెలంగాణను అడ్డుకున్న వాళ్లకు, తెలంగాణ ద్రోహులకు టికెట్లిచ్చింది. మొదటి నుంచీ పార్టీలో ఉన్న వాళ్లకు మొండిచేయి చూపింది. ముస్లిం నేతలైన ఇబ్రహీం, రెహ్మాన్, దళిత నేతలు విజయరామారావు బయటకు పోయేలా చేసింది. గిరిజన నాయకుడు రవీంద్రనాయక్‌ను గెంటేశారు. బీసీ నాయకుడు దాసోజు శ్రవణ్, యాదగిరి, సురేందర్‌లను అనేక విధాలుగా అవమానపరిచారు. టీఆర్‌ఎస్ పార్టీ మొత్తం కుటుంబ పెత్తనంగా మారింది. దళిత ముఖ్యమంత్రి అని చెప్పిన కేసీఆర్, ఆ పీఠం తనకే కావాలని కలలు కంటున్నాడు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరనే అంశాన్ని పార్టీ ఇప్పుడే చెప్పడం లేదు. నేను సీఎం రేసులో ఉన్నానా, లేదా అనేది ఇప్పుడు అప్రస్తుతం. ఉన్నత స్థానంలో ఉన్నవారు ఎవరైనా సీఎం సీటు పట్ల ఆశ లేకుండా ఎలా ఉంటారు?
టీడీపీ, బీజేపీ పొత్తును ఎవరూ విశ్వసించరు
టీడీపీ తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసింది. బీజేపీదేమో తెలంగాణ ఇవ్వలేని పరిస్థితి. పార్లమెంటులో చివరిదాకా తటపటాయించింది. ఆ రెండు పార్టీలు అపవిత్ర పాత్ర పోషించాయి. టీడీపీని ఎవరూ నమ్మరు. వారిద్దరి పొత్తులను ఎవరూ విశ్వసించరు. మోడీ గాలి కేవలం హైప్. ఒకప్పుడు బీజేపీ అంటకాగి, అది తప్పని భావించి లెంపలేసుకున్న చంద్రబాబు మళ్లీ ఇప్పుడు అదే పార్టీతో పొత్తుకు వెళ్లడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అధికారంలోకి రాలేనని తెలిసే చంద్రబాబు తెలంగాణలో బీసీ సీఎం అంటున్నారు. బీసీలపై బాబుకు నిజంగా ప్రేమే ఉంటే సీమాంధ్రలో బీసీని సీఎం చేస్తానని హామీ ఎందుకు ఇవ్వడం లేదు? అక్కడ బీసీల్లేరా? కనీసం బీసీని టీడీపీకి అధ్యక్షుడిగా ఎందుకు చేయలేకపోయారు?
పవన్ క ల్యాణ్... ఎవరాయన?
పవన్‌కల్యాణ్... ఎవరాయన? ఏ పార్టీ? విధానమేమిటి? అనుభవమేమిటి? బీజేపీ వంటి జాతీయ పార్టీకి పవన్ కల్యాణ్ వంటివారు లేకుంటే నడిచే పరిస్థితి లేకపోవడం ఆ పార్టీ దుస్థితికి నిదర్శనం. బీజేపీ అంత తక్కువ స్థాయిలో ఉందా అన్న అనుమానం వస్తోంది. బీజేపీ పవన్ వెంటబడటమే విచిత్రంగా ఉంది.
వైఎస్ పథకాలు కొనసాగుతాయ్...
నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన పథకాలు కాంగ్రెస్‌వే. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, పెన్షన్ వంటి పథకాలు తెలంగాణ ప్రభుత్వంలోనూ కొనసాగుతాయి. వాటిని మరింత మెరుగు పరిచి అమలు చేస్తాం. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా పార్టీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమే. అయితే అక్కడి ప్రజలకు ఎవరికి ఓటేయాలో తెలుసు.
జయశంకర్ ట్రస్టు పెడతాం
1969లోనూ, ఇప్పుడూ తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలను ఆదుకుంటాం. ప్రొఫెసర్ జయశంకర్ స్మారక ట్రస్టు ఏర్పాటు చేసి ఇల్లు, ఉద్యోగం, పరిహారం, పెన్షన్ ఇస్తాం. ట్రస్టుకు రూ.100 కోట్లు కేటాయిస్తాం. హైదరాబాద్‌లో ఐదెకరాల్లో అమరవీరుల స్మృతివనం ఏర్పాటు చేస్తాం.
ఓడిపోయే సీటును శంకరమ్మకా?
అమరవీరుల కుటుంబీకులెవరూ మమ్మల్ని టికెట్లు అడగలేదు కాబట్టే ఇవ్వలేదు. అయినా వారికి ఏ పార్టీలు టికెట్లిచ్చాయి? శంకరమ్మకు హుజూర్‌నగర్ టికెటిచ్చి టీఆర్‌ఎస్ అవమానించింది. బలమైన కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నందున ఎటూ గెలవలేమనే కేసీఆర్ అలా చేశారు. ఆమె సొంత నియోజకవర్గం అడిగితే ‘ఛీ... పో’ అన్నారు. ‘సీసా లేదు... పైసా లేదు’ అంటూ అవహేళన చేశారు. అమరవీరులపై నిజంగా ప్రేమే ఉంటే సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లల్లో ఏదో ఒకటి ఎందుకివ్వలేదు?