టీపీసీసీకి కొత్త సారథి?
రేసులో భట్టి, శ్రీధర్‌బాబు, డీకే, షబ్బీర్, వివేక్, పొన్నం
ఢిల్లీకి రావాలని జానారెడ్డికి అధిష్టానం పిలుపు
రేపు హస్తినకు జానా.. ఢిల్లీ చేరిన పొన్నాల
పార్టీ బలోపేతంపైనా చర్చించే అవకాశం
తనకు మరికొంత గడువు ఇవ్వాలని
హైకమాండ్‌కు వినతి
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి నుంచి పొన్నాల లక్ష్మయ్యను తప్పించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన స్థానంలో ఎవరిని నియమించాలనే అంశంపై హైకమాండ్ పెద్దలు కసరత్తు ముమ్మ రం చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డిని ఢిల్లీ రావాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ఆదేశించినట్లు సమాచారం. సీఎల్పీ, టీపీసీసీ మధ్య సమన్వయం లేకపోవడం, టీపీసీసీ చీఫ్‌ను మార్చాలంటూ పార్టీలో పలువురు నేతలు హైకమాండ్‌పై ఒత్తిడి తెస్తుండటం, పొన్నాలను తప్పించాలం టూ మరికొందరు నేతలు బాహాటంగానే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పొన్నాలను తప్పించి, అసంతృప్తికి తెరదించాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించారు. తెలంగాణ నేతలందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టేలా ఉత్సాహం నింపాలని యోచిస్తున్నారు. పార్టీ వర్గాల సమాచా రం మేరకు.. దిగ్విజయ్‌సింగ్ ఆదివారం జానారెడ్డికి ఫోన్ చేసి టీపీసీసీ చీఫ్ మార్పు, పార్టీ బ లోపేతం, టీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరు వంటి అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ రావాలని సూచించారు. వచ్చే వారంలో వస్తానని జానారెడ్డి చెప్పినప్పటికీ.. ఈ వారమే రావాలని దిగ్విజయ్ స్పష్టం చేశారు. దీంతో బుధవారం జానారెడ్డి ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
రేసులో ఎందరో..
పొన్నాలను తప్పిస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుం డడంతో టీపీసీసీ పదవిపై పలువురు నేతలు ఆశలు పెట్టుకున్నారు. కొందరు నేతలు ఏకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతోపాటు హైకమాండ్ పెద్దలను కలసి తమకు అవకా శం ఇవ్వాలని కోరారు. మరికొందరు తమకు అనుకూలంగా ఉన్న పెద్దల ద్వారా లాబీయింగ్ చేసే పనిలో పడ్డారు. శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క పేరు అధిష్టానం పెద్దల ముందు పరిశీలనకు వచ్చినప్పటికీ భట్టి వ్యతిరేకులు ఆయనపై పలు ఫిర్యాదులు చేయడంతో.. తాత్కాలి కంగా ఆ పేరును పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. శాసనమండలిలో ఉపనేత షబ్బీర్‌అలీ పేరు కూడా తెరపైకి వచ్చినా.. శాసనమండలి ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్ పదవీకాలం వచ్చే ఏడాది మార్చిలో ముగుస్తున్నందున ఆ పదవిని షబ్బీర్ ఆశిస్తున్నట్లు తెలిసింది.
ఇక మాజీ మంత్రి డీకే అరుణ కొద్దిరోజులుగా టీపీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు. మాజీ ఎంపీలు వివేక్, పొన్నం ప్రభాకర్ కూడా లాబీయింగ్ చేస్తున్నారు. ఇక రాబోయే ఐదేళ్లు పార్టీకి అవసరమైన ఆర్థిక వనరులు సమకూరుస్తానని వివేక్ ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే మాజీ మంత్రి శ్రీధర్‌బాబు పేరును జానారెడ్డి తెరపైకి తెచ్చినట్లు సమాచారం. సీఎల్పీ, పీసీసీ సమన్వయం తో ముందుకు వెళ్లాలంటే శ్రీధర్‌బాబుకు టీపీసీసీ చీఫ్ పగ్గా లు అప్పగించడం మేలని కొందరు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్య హుటాహుటిన హస్తిన బయలుదేరి వెళ్లారు. తనకు మరికొంత గడువిస్తే పార్టీని గాడిలో పెడతానని హైకమాండ్ పెద్దలకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.