కమలదళం | last day nomintations BJP party announced | Sakshi
Sakshi News home page

కమలదళం

Published Thu, Apr 10 2014 4:07 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

last day nomintations BJP party announced

కరీంనగర్ అర్బన్, న్యూస్‌లైన్ : నామినేషన్ల గడువు చివరి రోజున బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. మంగళవారం రాత్రి వరకు కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా సీహెచ్.విద్యాసాగర్‌రావు, కోరుట్ల, ధర్మపురి అసెంబ్లీ అభ్యర్థులుగా సురభి భూంరావు, కన్నం అంజయ్యను ఖరారు చేయగా.. మిగిలిన నాలుగు స్థానాలపై ఉత్కంఠ ఏర్పడింది. చివరకు కరీంనగర్ నుంచి బండి సంజయ్‌కుమార్, సిరిసిల్ల ఆకుల విజయ, రామగుండం గుజ్జుల రామకృష్ణారెడ్డి, హుస్నాబాద్ దేవిశెట్టి శ్రీనివాసరావు, వేములవాడకు ఆది శ్రీనివాస్‌ను ఆ పార్టీ ఖరారు చేసింది. ఈమేరకు అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వగా బుధవారం నామినేషన్ వేశారు.
 
 నలుగురు కొత్తవారే...
 బీజేపీ అభ్యర్థుల్లో నలుగురు పార్టీకి కొత్తవారే. కరీంనగర్ టికెట్ దక్కించుకున్న బండి సంజయ్ ఏబీవీపీలో, పార్టీలో చురు గ్గా పనిచేశారు. కౌన్సిలర్‌గా, కార్పొరేటర్ గా గతంలో ఎన్నికయ్యారు. ప్రస్తుతం పార్టీ నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
 
 కోరుట్లకు చెందిన సురభి భూంరావు గతంలో టీఆర్‌ఎస్‌లో ఉన్నారు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్నేళ్లు స్తబ్ధుగా ఉన్న ఆయన కొంతకాలం క్రితం బీజేపీలో చేరారు.
 సిరిసిల్ల టికెట్ దక్కించుకున్న ఆకుల విజయ అంతకుముందు దేవేందర్‌గౌడ్ స్థాపించిన నవ తెలంగాణ పార్టీలో పనిచేశారు. భర్త కొట్టాల మోహన్‌రెడ్డితో కలిసి కొద్ది నెలల క్రితమే బీజేపీలో చేరారు.
 
 ధర్మపురి అభ్యర్థి కన్నం అంజయ్య వడ్కాపూర్ ఎంపీటీసీగా, దళిత మోర్చా అధ్యక్షుడిగా... ప్రస్తుతం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
 
 హుస్నాబాద్ అభ్యర్థి దేవిశెట్టి శ్రీనివాసరావు గతంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. రెండు నెలల క్రితమే బీజేపీలో చేరిన ఆయన అనూహ్యంగా చివరిక్షణంలో పార్టీ బీఫారం అందుకున్నారు.
 
 వేములవాడలో పార్టీకి సీనియర్ నాయకు లు, బలమైన క్యాడర్ ఉండగా... నియోజకవర్గంలో బాగా పట్టున్న ఆది శ్రీనివాస్‌ను పార్టీలో చేర్చుకుని టికెట్ అప్పగించారు.
 పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి సొంత నియోజకవర్గమైన పెద్దపల్లి పొత్తుల్లో భాగంగా టీడీపీకి వెళ్లడంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో రామగుండం సీటుకు మారారు.
 
 ఏడుగురు అభ్యర్థుల్లో గుజ్జులతోపాటు బండి సంజయ్, కన్న అంజయ్య మాత్రమే పార్టీలో మొదటినుంచి పనిచేస్తున్నారు. మిగతా నలుగురు కొత్తగా పార్టీలో చేరినవారే. వీరికి టికెట్ కేటాయించడంతో ఇన్నాళ్లూ పార్టీని నమ్ముకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వలేదని పలువురు నాయకులు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు.
 
 బీఫారం దోబూచులాట
 కరీంనగర్ నుంచి టికెట్ ఆశించిన ఎడవెల్లి విజయేందర్‌రెడ్డికి మొదటగా హుస్నాబాద్ స్థానం కేటాయించినట్లు ప్రకటించారు. ఆయన హుస్నాబాద్‌కు వెళ్లి నామినేషన్ వేసే సమయంలోనే.. దేవిశెట్టి శ్రీనివాస్‌రావు తనకు బీఫారం వచ్చిందని చెప్పడంతో విజయేందర్‌రెడ్డి అవాక్కయ్యారు. టికెట్ తనకే అని చెప్పిన పార్టీ చివరి నిమిషంలో శ్రీనివాసరావుకు ఇవ్వడంతో ఖిన్నుడైన విజయేందర్‌రెడ్డి భారమైన హృదయంతో నామినేషన్ వేయకుండానే వెనుదిరిగారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement