పరిషత్’ను పట్టించుకోరేం?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : గతంలో ప్రధాన పార్టీలు పరిషత్ ఎన్నికలను ప్రతి ష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఒకేసారి మున్సిపల్, పరిషత్, ఎంపీ, ఎమ్మె ల్యే ఎన్నికల షెడ్యూళ్లు విడుదలయ్యాయి. నెలన్నర వ్యవధిలోనే అన్నింటి పోలింగ్ పూర్తి కానుంది. మొదట మున్సిపల్, వెంటనే పరిషత్, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో రాజకీయ పరిణామాలు, సమీకరణాలపై దృష్టి సారించిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, సీనియర్ నాయకులు ‘స్థానిక’ ఎన్నికలను అంత గా పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ఘట్టం కూడా పూర్తయ్యింది. గురువారంతో పరిషత్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం పూర్తవుతుంది. అయినప్పటికీ ప్రధాన పార్టీల ముఖ్య నేతలు ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా జెడ్‌పీ పీఠంపై ఎవరిని నిలబెట్టాలన్న విషయమై ప్రాథమికంగా ఏ పార్టీ నిర్ణయానికి రాలేకపోయింది. ఈ విషయమే జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
ఎంపీటీసీ ఎన్నికలపై అనాసక్తి
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని 583 ఎంపీటీసి స్థానాలు, 36 జడ్‌పీటీసీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎంపీటీసీ ఎన్నికలను ప్రధాన రాజకీయ పా ర్టీల ప్రధాన నేతలు పట్టించుకోవడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి ఆశీస్సులకోసం అభ్యర్థులు ఆరాటపడుతున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో జెండాలు మోసామని, ఇప్పుడు మాకు అవకాశం వస్తే బడా నేతలు ముఖం చాటేయడం ఎంతవరకు సమంజసమని ద్వితీయ శ్రేణి నాయకులు ప్రశ్నిస్తున్నారు. నిజామా బాద్ కార్పొరేషన్‌తోపాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ బల్దియాల ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులదీ ఇదే పరిస్థితి.
ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. కానీ ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎం పీల అనుచరులు తప్ప బడా నేతలు ఎవరూ తమవైపు చూడడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు వచ్చేనెల 30వ తేదీన జరగనున్నాయి. అదే నెల 2వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల నియోజకవర్గాల ఇన్‌చార్జిలు ఆ ఎన్నికలపైనే దృష్టి సారించారు. దీంతో వారు మున్సిపల్, ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలను అంతగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆ భాగ్యం ఎవరికో..
స్థానిక సంస్థల రిజర్వేషన్లలో భాగంగా జిల్లా పరిషత్ పీఠం బీసీలకు కేటాయించారు. జిల్లా పరిషత్‌లో 1995 నుంచి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఆ ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవి బీసీలకు రిజర్వ్ అయ్యింది. 2001, 2006లలో వరుసగా జనరల్‌కు కేటాయించారు. ఈసారి మళ్లీ బీసీ జనరల్‌కు దక్కింది.
ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయని భావించా రు. అయితే అందుకు భిన్నంగా పరి స్థితులున్నాయి. గురువారంతో నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగియనుండగా.. ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి వరకు తమ అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో జడ్‌పీ పీఠాన్ని అధిష్టించే ఆ బీసీ నేత ఎవరనే చర్చ జరుగుతోంది.