సాక్షి, ఒంగోలు: జిల్లావ్యాప్తంగా అన్నిచోట్లా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారహోరు ముమ్మరమైంది. గ్రామగ్రామానా రాజకీయ పార్టీల నినాదాలే మార్మోగుతున్నాయి. అభ్యర్థుల ఇంటింటి ప్రచారం వినూత్నంగా సాగుతుండగా.. వివిధ పార్టీల నేతల రోడ్‌షోలు ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. రెండు విడతలుగా జరగనున్న ఎన్నికల ప్రక్రియలో మొదటి విడత ఈ నెల ఆరో తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మలివిడత ఎన్నికలను ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్నారు.
ఈ మేరకు మొదటి విడత ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రం ఐదుగంటలతో తెరపడనుంది. దీంతో అన్ని పార్టీల నేతల కసరత్తు తీవ్రతరమైంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గ్రామాల్లో ప్రచారం చేస్తుండగా అక్కడి నుంచి రాత్రి వరకు వివిధ చోట్ల సామాజికవర్గాల పెద్దలతో సమావేశమవుతున్నారు. ఓటరు నాడి పట్టుకునేందుకు సవాలక్ష మార్గాల్లో వెళ్తున్న నేతలకు గ్రామస్థాయిలో ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో అధికార, ప్రధాన ప్రతిపక్ష నేతలకు ఓటర్లు షాక్‌లిస్తున్నారు. అభ్యర్థులు, నేతలు ప్రచారానికి వెళ్లినప్పుడు ప్రధాన చర్చంతా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పేదల పథకాల గురించే నడవడం గమనార్హం.
మహానేత పథకాలకు తూట్లు పొడిచిన కాంగ్రెస్.. ఆది నుంచి పేదల్ని పట్టించుకోని తెలుగుదేశం పార్టీల్ని.. ఆయా పార్టీల తరఫున వచ్చిన నేతల్ని గ్రామాల్లో ఓటర్లు బహిరంగంగానే నిలదీస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన పార్టీతో పాటు దానికి అనుకూలించిన నేతలనూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఓటు అడిగే అర్హత ఆ రెండు పార్టీలకు లేదంటూ గ్రామ రచ్చబండల వద్ద జనం తేల్చి చెబుతున్నారు. ఇవే సందర్భాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు పట్టంకట్టి.. ఆ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఒకరికొకరు ప్రతిజ్ఞలు చేయించుకుంటున్నారు.
ఓటర్లకు గుర్తుకొస్తున్న వైఎస్‌ఆర్
ప్రస్తుతం జిల్లాలోని అన్నిచోట్లా విభిన్న రాజకీయ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. గతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా మండలాల్లో సామాజికవర్గాల వారీగా ఓట్లు వివిధ పార్టీలకు చీలుతూ వ చ్చాయి. నేతలు సైతం తమ వర్గాల్ని పెంచిపోషిస్తూ కాపాడుకునే వారు. అయితే ఈ సారి స్థానిక ఎన్నికల్లో మాత్రం వారు వీరూ కాకుండా.. అందరూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపడం రాజకీయ దిగ్గజాల్ని విస్మయానికి గురి చేస్తోంది. ఆ పార్టీ అభ్యర్థులపై వివిధ సామాజికవర్గాల ప్రజలు అపూర్వ ఆదరణ చూపుతున్నారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో సుభిక్షపాలన అందించిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హఠాన్మరణం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేయడాన్ని.. దశలవారీగా ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కడం.. రాష్ట్రాన్ని విభజించి ప్రజల ఆశయాలను చిన్నాభిన్నం కావడాన్ని ప్రతీ ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు.
నేడు పేదలపక్షాన పోరాడుతున్న వైఎస్‌ఆర్ సీపీ అధినేత జగన్‌పై నమ్మకంతో ఆ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ప్రచారాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా అభ్యర్థుల నడకలో అడుగడుగునా ‘నమ్మకం’ కనిపిస్తోంది. నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్ని చుట్టేస్తున్న వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థుల ప్రచారం విజయం దిశగా కొనసాగుతోంది. ఒంగోలు, నాగులుప్పలపాడు, మద్దిపాడు, అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, ముండ్లమూరు, మార్కాపురం తదితర మండలాల్లో ఇన్నాళ్లూ టీడీపీకి కొమ్ముకాసిన ప్రధాన సామాజికవర్గం నేడు వైఎస్‌ఆర్ సీపీ గెలవాలని కోరుకోవడం.. ఆ మేరకు ఆ పార్టీ అభ్యర్థుల ప్రచారంలో విస్తృతంగా పాల్గొనడం కీలక పరిణామం. రాష్ట్ర విభజన విషయంలో చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతం అవలంభించడం.. అనాదిగా పార్టీలో పనిచేస్తున్న వారిని పక్కనబెట్టి కాంగ్రెస్ నుంచి వచ్చి పార్టీలోకి చేరిన వారికి పిలిచి సీట్లు కట్టబెట్టడం.. జగన్, షర్మిల, విజయమ్మ ఎన్నికల ప్రచారం, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌ఆర్ పాలన.. జగన్ సీబీఐ అక్రమ అరెస్టు పరిణామాల్ని నిశితంగా పరిశీలించిన ప్రజలు టీడీపీ, కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతామని బలంగా చెబుతున్నారు. ఈ జన లక్ష్యమే రాజకీయాల్లో సువర్ణ అధ్యయాన్ని లిఖిస్తోందని పాతతరం పెద్దలు అభిప్రాయపడుతున్నారు.
టీడీపీ, కాంగ్రెస్ నేతల అంతర్మథనం
జిల్లావ్యాప్తంగా అన్నిచోట్లా వైఎస్‌ఆర్ సీపీ వైపునే గాలి వీయడాన్ని అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఆది నుంచి తమకు ఆస్థాన ఓటుబ్యాంకుగా ఉన్న ప్రధాన సామాజికవర్గ ప్రాధాన్యత తాజాగా వైఎస్‌ఆర్ సీపీకి మొగ్గుచూపడంపై టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఆ పార్టీ జిల్లాపెద్దలు కరణం బలరాం, దామచర్ల జనార్దన్ తదితరులు మండలాల్లో తమ వ్యతిరేక వర్గాన్ని బుజ్జగించే ప్రయత్నాలు చేసినా పెద్దగా ప్రభావం కనిపించకపోవడంపై ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోవైపు మండలాల ఇన్‌చార్జులుగా ఉన్న సీనియర్ నేతలు.. ఆ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. స్థానిక నే తలు తమను గుర్తించడంలేదంటూనే ఒకరిద్దరు అన్యమనస్కంగా ప్రచార పర్యటనలకు వస్తున్నారు.
ఈ పరిస్థితులతో ఆ ఆపార్టీ అభ్యర్థులు పెద్ద డైలమాలో పడ్డారు. ప్రచారానికొస్తున్న నేతలు తన గెలుపు గురించి కాకుండా, వారి ఁఉనికి*ని విస్తరించుకోవడానికే కష్టపడుతున్నట్లు ఉందని వారు తమ అనుచరవర్గాలతో వ్యాఖ్యానిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థులు పూర్తి నిస్తేజంలో ఉన్నారు. నిన్నటిదాకా అధికార పార్టీ నేతలుగా చెలామణి అయినవారు.. నేడు పక్కపార్టీలను ఆశ్రయించడంతో కాంగ్రెస్ పార్టీశ్రేణులు గందరగోళానికి గురవుతున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కమిటీ బాధ్యతను భుజానికెత్తుకున్న చిరంజీవి వైఖరికారణంగా ఆ పార్టీని అంటిపెట్టుకున్న కాపు సామాజిక వర్గం.. నేడు వైఎస్‌ఆర్ సీపీకి అనుకూలంగా ఉంది. దీంతో అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ నేతలు తలలు పట్టుకుని కూర్చొనే పరిస్థితి వచ్చింది.
‘నమ్మకం’దే విజయం
Published Fri, Apr 4 2014 3:00 AM | Last Updated on Mon, Aug 27 2018 9:16 PM
Advertisement
Advertisement