ఒంగోలు, న్యూస్‌లైన్: ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈనెల 6, 11 తేదీల్లో రెండు విడతలుగా జరగనున్న ఈ ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే జిల్లా యంత్రాంగం మొత్తం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. అవసరమైన సిబ్బంది నియామకం, బ్యాలెట్ పత్రాల ముద్రణ, ఓటర్ల జాబితా సవరణ వంటివి పూర్తిచేశారు.
రేపే తొలివిడత:
ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలిదశ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి బ్రేక్ పడింది. 6వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. తొలిదశ ఎన్నికలు చీరాల, పర్చూరు, అద్దంకి, మార్కాపురం, వై.పాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారు. రెండు దశల్లో కలిపి 21 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా అందులో 14 స్థానాలు తొలివిడత ఎన్నికలకు సంబంధించినవి కావడం గమనార్హం. వీటిలో వైస్సార్‌సీపీకి చెందిన ఆరుగురు సభ్యులు, స్వతంత్ర అభ్యర్థిగా ఏకగ్రీవమైన మరో వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడితో కలిపి వైఎస్సార్ సీపీ ఏకగ్రీవాల సంఖ్య 7కు చేరింది.
టీడీపీ రెండో స్థానంలో నిలిచింది. స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరున్నారు. మిగిలిన 385 ఎంపీటీసీ స్థానాలకుగాను 1056 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక జెడ్పీటీసీకి సంబంధించి 28 స్థానాల్లో ఎన్నికలు ఈనెల 6న జరుగుతున్నాయి. వాటిలో 28 స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు పోటీ చేస్తుండగా రాచర్ల మినహా మిగిలిన వాటిలో టీడీపీ పోటీ చేస్తోంది. వైఎస్సార్‌సీపీ తరఫున జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా భావిస్తున్న డాక్టర్ నూకసాని బాలాజీ పోటీ చేస్తున్న పుల్లలచెరువు జెడ్పీటీసీ స్థానం కూడా తొలి దశ ఎన్నికల్లోనే ఉంది. టీడీపీ తరఫున చైర్మన్ అభ్యర్థులుగా బరిలో ఉన్న ఈదర హరిబాబు, మన్నం రవీంద్రలు పోటీ చేస్తున్న స్థానాలు రెండో విడతలో ఉండడం గమనార్హం. ఈ ఎన్నికల్లో మొత్తం 19,63,911 మంది ఓటర్లుండగా తొలిదశలో 10,21,189 మంది అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
131 పోలింగ్ స్టేషన్లలో వెబ్ కెమెరాలు:
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి తొలిదశ పోలింగ్‌లో 131 పోలింగ్‌స్టేషన్లలో వెబ్‌కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. చీరాల, పర్చూరు, అద్దంకి, యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాల్లోని 28 మండలాల్లో 131 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించి వాటిలో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. యర్రగొండపాలెం 9, పుల్లలచెరువు 4, త్రిపురాంతకం 8, పెద్దారవీడు 2, సంతమాగులూరు 4, బల్లికురవ 4, మార్టూరు 13, యద్దనపూడి 3, పర్చూరు 4, ఇంకొల్లు 8, జే.పంగులూరు 9, అద్దంకి 11, కంభం 7, కొనకనమిట్ల 2, పొదిలి 1, కొరిశపాడు 10, చీరాల 11, వేటపాలెం 8, చినగంజాం 4, బేస్తవారిపేట 3, రాచర్ల 2, గిద్దలూరు మండలంలో 4 పోలింగ్ కేంద్రాల్లో ఈ వెబ్ కెమెరాలు అందుబాటులో ఉంటాయి.
బరిలో 170 మంది విద్యావంతులు:
ప్రాదేశిక ఎన్నికల బరిలో వివిధ పార్టీల తర ఫున ఈనెల 6, 11వ తేదీల్లో జరిగే రెండు దశల ఎన్నికల్లో కలిపి 170 మంది ఉన్నత విద్యావంతులు బరిలో ఉన్నారు. వీరిలో 129 మంది ఎంపీటీసీలకు పోటీపడుతుండగా 41 మంది జెడ్పీటీసీలకు పోటీపడుతున్నారు. జెడ్పీటీసీలకు సంబంధించి డిగ్రీ 22, బీఎల్/ఎల్‌ఎల్‌బీ 6, ఎంబీబీఎస్ 1, ఎంఎస్సీ 2, బీసీఏ 2, బీటెక్ 3, బీఈడీ 2, బీఫార్మసీ 1తోపాటు ఎంఫిల్, పీహెచ్‌డీ చేసిన వారు ఇద్దరు బరిలో ఉన్నారు. ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి బీఏ 60, ఎంఎస్సీ 18, బీటెక్ 13, పీహెచ్‌డీ 1, ఎంసీఏ 1, పాలిటెక్నిక్ 2, బీఈడీ 25, బీఎస్సీ నర్సింగ్ 1, బీఎల్ 3, ఎం.ఫార్మసీ 2, బీసీఏ 1, ఎంబీఏ చదివిన వారు ఇద్దరు ఉన్నారు. వీరు కాకుండా దాదాపు 300 మంది వరకు నిరక్షరాశ్యులు కూడా బరిలో ఉన్నారు.
మొదటి విడత స్థానిక ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలకు పోలీస్ యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఎన్నికల జరగనున్న మండలాల పరిధిలోని పోలీస్ సర్కిల్ కార్యాలయాలకు పోలీస్ బలగాలు చేరుకున్నాయి. ఎస్పీ పి.ప్రమోద్‌కుమార్ ఆధ్వర్యంలో అదనపు ఎస్పీ బి.రామానాయక్ పర్యవేక్షణలో ఎన్నికల బందోబస్తు కోసం మొత్తం 3,500 అధికారులు, సిబ్బందిని కేటాయించారు. మొదటి విడతగా ఎన్నికలు జరుగుతున్న ఏడు పోలీస్ సర్కిల్ కార్యాలయాల పరిధిలో బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు.
చీరాల సర్కిల్ పరిధిలో చీరాల డీఎస్పీ నరహర, ఇంకొల్లు సర్కిల్ పరిధిలో ఒంగోలు డీఎస్పీ పి.జాషువా, అద్దంకి పరిధిలో దర్శి డీఎస్పీ లక్ష్మినారాయణ, పొదిలి పరిధిలో ఏఆర్ ఏఎస్పీ జె. కృష్ణయ్య, మార్కాపురం పరిధిలో అక్కడి డీఎస్పీ రామాంజనేయులు, గిద్దలూరు పరిధిలో కందుకూరు డీఎస్పీ శంకర్, యర్రగొండపాలెంలో ఒంగోలు డీటీసీ డీఎస్పీ అశోక్‌కుమార్ బందోబస్తును పర్యవేక్షిస్తారు. మొత్తం 137 రూట్ మొబైల్ టీంలు గస్తీ తిరుగుతాయి. 28 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు, 7 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు ఎన్నికలు జరిగే ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటాయి. మొత్తం 38 మంది సీఐలు, 125 మంది ఎస్సైలు, 150 మంది మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది మొదటి విడత ఎన్నికల్లో బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్నారు.
ప్రాదేశిక సమరం
Published Sat, Apr 5 2014 2:46 AM | Last Updated on Sat, Sep 2 2017 5:35 AM
Advertisement
Advertisement