రాజకీయంగా చిరంజీవికే మద్దతు
మెగా అభిమానుల రాష్ట్రస్థాయి సమావేశంలో తీర్మానం
కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రచారం
పవన్ తమ గుండెల్లో ఉంటారని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్‌కల్యాణ్ రాజకీయంగా వేరుపడిన నేపథ్యంలో అన్నయ్యకే మద్దతు ప్రకటించాలని మెగా కుటుంబం సినీ అభిమానుల సంఘం నిర్ణయించింది. చిరంజీవి, ఆయన కుటుంబ హీరోల అభిమానుల సంఘంగా ఏర్పడిన ‘చిరంజీవి యువత’ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురువారం హైదరాబాద్ ఫిలింనగర్ క్లబ్‌లో జరిగింది. రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో జిల్లాలవారీగా ఉన్న అభిమాన సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చిరంజీవి ఏ రాజకీయ పార్టీలో ఉంటే, తామూ ఆ పార్టీలో కొనసాగుతామని తీర్మానం చేశారు. అభిమానుల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న 15 వేల మందిని గుర్తించి, వారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం చేయాలని నిర్ణయించారు. వీరికి చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు సంతకంతో కూడిన గుర్తింపు కార్డులు ఇవ్వాలని తీర్మానించారు. చిరుకు మద్దతు పలకడం ఆయన తమ్ముడు పవన్‌క ల్యాణ్‌ను వ్యతిరేకించినట్టు కాదని చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు స్వామినాయుడు అన్నారు. పవన్ తమ గుండెల్లో ఎప్పటికీ ఉంటారని.. ఒక హీరోను అభిమానించడమంటే మరో హీరోను వ్యతిరేకిస్తున్నట్టు కాదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మెగా అభిమానులందరూ ఒక సంఘటిత శక్తిగా రూపొందడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించినట్టు తెలిపారు. పవన్‌కల్యాణ్ జనసేన పార్టీ స్థాపన తరువాత అభిమానుల పేరుతో కొందరు రకరకాల ప్రకటనలు చేస్తున్నందున, చిరంజీవి యువత నుంచి కూడా 25 మందిని అధికార ప్రతినిధులుగా నియమించారు. చిరంజీవి పెద్ద సోదరుడు నాగబాబు వారిని ఎంపిక చేసినట్టు సమాచారం. కాగా, ఈ సమావేశానికి 250 మందికి మాత్రమే అధికారికంగా రాంచరణ్ ఫోటోతో ఉన్న పాస్‌లను పంపిణీ చేశారు. పాస్‌లు లేనివారిని సిబ్బంది అడ్డుకోవడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది.
బ్లడ్ బ్యాంక్‌లో కేక్ కట్ చేసిన చరణ్..
రాంచరణ్ తేజ తన పుట్టిన రోజున జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌లో బాబాయ్ నాగబాబు, అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అభిమానులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని రాంచరణ్ అన్నారు. నిర్మాత బండ్ల గణేష్, ఫిలించాంబర్ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.