ఒక్క చాన్స్ ప్లీజ్
మంత్రి పదవి కోసం కేసీఆర్‌పై ఒత్తిడి
తెలంగాణకూ ఇద్దరు డిప్యూటీ సీఎంలు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కోసం టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావుపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి విజ్ఞాపనలు, ఒత్తిళ్ల తాకిడి నానాటికీ పెరుగుతోంది. 63 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 50 మంది దాకా బెర్తు కోసం ఆశపడుతున్నారు. పలువురు ఎమ్మెల్సీలతో పాటు ఏ సభలోనూ లేని కొందరు సీనియర్లు కూడా తమకు పదవి ఖాయమని ఆశలు పెట్టుకున్నారు. ఎందుకైనా మంచిదని రోజూ కేసీఆర్‌తో పాటు ఆయనపై ప్రభావం చూపగలిగే హరీశ్‌రావు, కేటీఆర్ తదితరులను కూడా కలుస్తున్నారు. పార్టీకి చేసిన సేవ, సాధిం చిన మెజారిటీ తదితరాలను ఏకరువు పెడుతున్నారు. అయితే మంత్రివర్గ కూర్పుపై ఫలితాలకు ముందే కేసీఆర్ నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. జిల్లాలు, సామాజికవర్గం, శాఖలతో సహా కేబినెట్‌పై స్పష్టతకోసం ఫామ్ హౌస్‌లోనే సన్నిహితులతో చర్చలు జరిపారు.
వరంగల్‌లో తీవ్ర పోటీ: ఆశావహుల జాబితా వరంగల్‌లో భారీగా ఉంది. ఈ జిల్లా విషయంలో కేసీఆర్ కూడా కొంత ఒత్తిడికి గురవుతున్నట్టు సమాచారం. పార్టీ ఆవిర్భావం నుండి పని చేస్తుండటం, సీనియారిటీ, విధేయతపరంగా చూస్తే జిల్లాలో అర్హులు ఎక్కువేనని ఆయన భావిస్తున్నారు. ఆవిర్భావం నుంచీ పని చేస్తున్న ఎస్.మధుసూదనాచారి భూపాలపల్లి నుండి గెలిచారు. మంత్రిగా, ఎంపీగా పని చేసిన ఎ.చందూలాల్ ములుగు నుంచి గెలిచారు. రాజీనామా చేసిన ప్రతీసారి గెలుస్తూ, పార్టీకి విధేయునిగా ఉండే దాస్యం వినయ్‌భాస్కర్ వరంగల్ పశ్చిమ నుండి గెలిచారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా దానికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరిన డాక్టర్ టి.రాజయ్య స్టేషన్ ఘన్‌పూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌లో చేరి వరంగల్ తూర్పు నుండి గెలిచిన కొండా సురేఖ కూడా ఆశావహుల జాబి తాలో ఉన్నారు. కేసీఆర్ సన్నిహితుడు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి జనగామ నుంచి గెలి చారు. ఇలా జిల్లాలో కనీసం ఆరుగురు ముఖ్యులు పోటీపడుతున్నారు. కానీ ఇద్దరికి మించి ఇచ్చే పరిస్థితి లేదు. నిజామాబాద్ జిల్లాలోనూ ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. జిల్లాలోని 9 మంది ఎమ్మెల్యేలూ టీఆర్‌ఎస్ వారే. రాజకీయాల్లో కేసీఆర్ సమకాలికుడు పోచారం శ్రీనివాస్‌రెడ్డికి బెర్తు ఖాయమే. ఏనుగు రవీందర్ రెడ్డి, గంపా గోవర్ధన్, బాజిరెడ్డి గోవర్ధన్ వంటి సీనియర్లూ పోటీలో ఉన్నారు. కరీంనగర్ నుంచి ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, కేటీఆర్‌లకు చోటు దక్కనుంది. మిగతా ఎమ్మెల్యేలూ ఆశ పడుతున్నా కేసీఆర్‌ను అడగలేని పరిస్థితి! తెలంగాణ పునర్నిర్మాణంలో కీలకం కానున్న పారిశ్రామికాభివృద్ధి, ఐటీ విస్తరణ తదితరాల్లో కేటీఆర్ సేవలను వినియోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. పారిశ్రామిక వేత్తలు, ఐటీ ముఖ్యుల నుంచి కేసీఆర్‌కు ఇలాంటి సూచనలు అందినట్టు తెలిసింది.
తెలంగాణకూ ఇద్దరు డిప్యూటీలు?: ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉండే అవకాశముంది. ముస్లిం మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామంటూ ఇప్పటికే కేసీఆర్ హామీ ఇవ్వడం తెలిసిందే. తెలంగాణకు దళితుడే తొలి ముఖ్యమంత్రి అన్న హామీని నిలుపుకోలేదన్న విమర్శలను తగ్గించుకోవడానికి ఆ వర్గానికి రెండో ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని యోచి స్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. సీనియర్ ఎస్సీ ఎమ్మెల్యేలు ఈశ్వర్, రాజయ్యల్లో ఒకరికి అవకాశమివ్వాలని కేసీఆర్ సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.