తెలంగాణలో ఈ నెల 22న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ పర్యటించనున్న నేపథ్యంలో గుజరాత్ నుంచి 16 మంది సభ్యుల పోలీసు బృందం హైదరాబాద్‌కు వచ్చింది.
ముందస్తుగా మైదానాల పరిశీలన
హైదరాబాద్: తెలంగాణలో ఈ నెల 22న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ పర్యటించనున్న నేపథ్యంలో గుజరాత్ నుంచి 16 మంది సభ్యుల పోలీసు బృందం హైదరాబాద్‌కు వచ్చింది. మోడీ జెడ్ ప్లస్ కేటగిరీ పరిధిలో ఉన్నందున పర్యటనలో ఆయన వెనక ప్రత్యేక భద్రతా సిబ్బంది, స్థానిక పోలీసులు కూడా ఉంటారు. అయినా 22న నగరంలో మోడీ సభకు వేదిక అయిన ఎల్‌బీ స్టేడియంను, ఆయా ప్రాంతాలను గుజరాత్ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మోడీ వచ్చేందుకు ఏర్పాటు చేసే ద్వారం, సభా వేదికలు, భద్రత కోసం వదలాల్సిన స్థలం, చుట్టూ ఉన్న భవనాలు, తదితరాలను వారు పరిశీలించారు.
బీజేపీ నేతలతో మాట్లాడి పలు వివరాలు తీసుకున్నారు. నియోజకవర్గ అభ్యర్థులు కూడా సభలో పాల్గొంటారని బీజేపీ నేతలు చెప్పటంతో వారి సంఖ్యపై ఆరా తీశారు. ఆ అభ్యర్థులను మోడీ ఉండే ప్రధాన వేదికపైకి అనుమతించొద్దని, వారి కోసం ప్రత్యేకంగా ఉప వేదిక ఏర్పాటు చేయాలని సూచించారు. నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్‌లలో నిర్వహించే సభా వేదికలను కూడా వీరు పరిశీలిస్తున్నారు.
రాజ్‌నాథ్ పర్యటన రద్దు: తెలంగాణలో ఈ నెల 26న బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ పర్యటించాల్సి ఉండగా ఆ పర్యటన రద్దయింది. వీలైతే 28న ఆయన పర్యటించే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే, 25న పర్యటించాల్సిన సుష్మా స్వరాజ్ 26న రానున్నారు. వరంగల్, మెదక్, భువనగిరి లోక్‌సభ స్థానాల పరిధితోపాటు కల్వకుర్తిలో ఆమె ప్రచారం చేయనున్నారు. హైదరాబాద్‌లో ప్రచారానికి 24న రావాల్సిన గోవా సీఎం పారికర్ 25న రానున్నారు. 23న రావాల్సిన నితిన్ గడ్కరీ పర్యటన కూడా వాయిదా పడింది.