ప్రచారానికి పేకప్ | muncipal elections compaign | Sakshi
Sakshi News home page

ప్రచారానికి పేకప్

Published Fri, Mar 28 2014 4:34 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

muncipal elections compaign

 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ఆదివారం జరిగే మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వానికి శుక్రవారం సాయంత్రం తెరపడనుంది.  ఐదు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీ ల్లోని 206 వార్డులకు 1182 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ నెల 30 ఆదివారం పోలింగ్ జరగనున్న నేపథ్యం లో పార్టీలు, అభ్యర్థులు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నా యి. మున్సిపల్ వార్డుల్లో బహుముఖ పోటీ ఉండటంతో అభ్యర్థులకు ప్రతీ ఓటు కీలకంగా మారింది. దీంతో చివరి క్షణం వ రకు ఓటరును ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు, అభ్యర్థులు తంటాలు పడుతున్నారు.

 

ఈ నెల 18న అభ్యర్థుల తుది జాబి తా వార్డుల వారీగా ఖరారు కావడంతో ఎన్నికల గుర్తులను ఓటర్ల మనసులో నాటేందుకు వినూత్న పద్దతులు అవలంభిస్తున్నారు. అభ్యర్థుల వ్యయంపై ఎన్నికల సంఘం నిఘా తీవ్రం చేయడంతో వీలైనంత తక్కువ హడావుడితో ప్రచారం నడిపిం చారు. గతంలో మాదిరిగా కార్లు, జీపులు వంటివి  కాకుండా ఆటోలను ఎన్నికల గుర్తులతో అలంకరించి ప్రచారం చేశారు. ఫ్లెక్సీలు, కటౌట్ల సందడి లేకుండా కేవలం కరపత్రాలు, డోర్ పోస్టర్లకే ప్రచార సామగ్రి పరిమితమైంది. గద్వాల మినహా మి గతా మున్సిపాలిటీల్లో పార్టీలు బహిరంగ సభల జోలికి వెళ్లలే దు. పార్టీల ముఖ్య నేతలు ప్రచార పర్వానికి దూరంగా ఉండటంతో అభ్యర్థులు ఇంటింటి ప్రచారానికే మొగ్గు చూపారు. రోడ్‌షోలు కూడా లేకపోవడంతో వార్డుల్లో చివరి రెండు రోజులు మాత్రమే ప్రచార హడావుడి కనిపించింది.


 పార్టీలకు కీలకం
 సాధారణ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండటంతో ఫలితాలపై అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది.  కాంగ్రెస్, టీ ఆర్‌ఎస్ చాలా చోట్ల ముఖాముఖి తలపడుతుండగా, బీజేపీ, టీడీపీ, వైఎస్సార్‌సీపీ తమకు పట్టు ఉన్న చోట బరిలో ఉండటంతో గెలుపోటములు అభ్యర్థులకు కత్తిమీద సాములా మారింది. మున్సిపల్ చైర్మన్ పదవులు రిజర్వయినా పార్టీలు మాత్రం ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాయి.

చైర్మన్ అభ్యర్థులను ప్రకటిస్తే సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉందని అన్ని పార్టీలు గుంభనంగా వ్యవహరిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ గిరీ ఆశిస్తున్న అభ్యర్థులున్న చోట వారిని ఓడించేందుకు సొంత పార్టీ నేతలే ఎత్తుగడలు వేస్తున్నారు. స్వతంత్రులు  పెద్ద సంఖ్యలో ఉండటం అన్ని పార్టీలను కలవర పరుస్తోంది. టికెట్ దక్కని ఔత్సాహికులు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో ఉండటంతో అధికారిక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం సాయంత్రం ప్రచార పర్వం ముగియనుండటంతో ప్రలోభాల పర్వానికి తెరలేచే సూచనలు కనిపిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement