హనుమంతు... కుప్పిగంతు!
అభిప్రాయాలు మార్చుకుంటేనే ఆధునిక రాజకీయాల్లో రాణిస్తారనేది లోకరీతి. అందుకే కాబోలు మన నేతాశ్రీలు ఇట్టిట్టే ఓపీనియన్స్ చేంజ్ చేసుకుంటున్నారు. అక్కడితో ఆగకుండా పార్టీలు కూడా మారిపోతున్నారు. పూటకో పార్టీ మారుస్తూ ఊసరవెళ్లే ఉలిక్కి పడేలా చేస్తున్నారు. ఎన్నికల సీజన్ కావడంతో పార్టీ ఫిరాయింపులు తారాస్థాయికి చేరాయి. టిక్కెట్లు రాని నాయకులు అటు నుంచి అటే గోడ దూకేస్తున్నారు. ఎన్ని పార్టీ మారైనా టిక్కెట్ దక్కించుకోవాలన్న ఏకైక ఎజెండాతో ఎగిరిపోతున్నారు. ఇందుకు టీడీపీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఉదంతమే తాజా ఉదాహరణ.
మల్కాజ్‌గిరి అసెంబ్లీ సీటు ఆశించి భంగపడ్డ మైనంపల్లి కుప్పిగంతులు వేసి చివరకు గులాబీ దళంతో జట్టుకట్టారు. కమలం పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడంతో మల్కాజ్గిరి.. బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. మైనంపల్లి ఆశలపై టీడీపీ నీళ్లు చల్లింది. దీంతో ఆగ్రహించిన హనుమంతు చందన్నకు బై చెప్పి ఆగమేఘాలపై హస్తినకు పయమయ్యారు. టిక్కెట్ కోసం హస్తం పార్టీలో చేరిపోయారు. నమ్మినోళ్లను నట్టేట ముంచే పార్టీగా ఘనకీర్తి గడించిన కాంగ్రెస్ అలవాటును కొనసాగించింది. చివరి నిమిషంలో మైనంపల్లికి టిక్కెట్ ఇవ్వకుండా షాక్ ఇచ్చింది. వెంటనే షాక్ నుంచి తేరుకున్న హనుమంతు హైదరాబాద్ చేరుకుని 'కారు' ఎక్కేశారు. ఉద్యమ పార్టీలోకి ఉరికి టిక్కెట్ వేటలో పడ్డారు. నామినేషన్లకు దాఖలకు చివరి రోజైనా ఆయనకు టిక్కెట్ దక్కుతుందో, లేదో చూడాలి.
కొసమెరుపు: మల్కాజ్గిరి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని, మరో పార్టీలో చేరబోనని టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత ప్రకటించిన మైనంపల్లి హన్మంతరావు తర్వాత వెంట వెంటనే రెండు పార్టీలు మారారు.