'నాకు 420 నంబర్ వద్దే వద్దు'
'జాబితాలో నా పేరు ఆ నంబరులో ఉండకూడదు. నేనొప్పుకోను గాక ఒప్పుకోను' అని మొండికేసి మొరాయిస్తున్నారు అజయ్ రాయ్. ఇంతకీ అజయ్ రాయ్ ఎవరు? ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి. ఇంతకీ ఆయన భయపడుతున్న నంబరు ఎమిటి? ఆ నంబరు 420.
వారణాసిలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా రంగంలోకి రాయ్ దిగుతాడన్నది దాదాపు ఖాయమైపోయింది. కాంగ్రెస్ ఇప్పటి వరకూ 419 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అజయ్ రాయ్ పేరు 420 గా జాబితాలో ఉంది. నా పేరు నంబర్ 420 అయితే ప్రత్యర్థులు నాకు తాటాకులు కట్టేస్తారని ఆయన భయపడుతున్నారు. అయితే సమస్యేమిటంటే ఇంకే అభ్యర్థి కూడా తన పేరు జాబితాలో 420 గా ఉండకూడదని పట్టుబట్టుతున్నారు.
420 అంటే చీటర్, దొంగ, మోసగాడు అని అర్థం. ఉత్తరప్రదేశ్ లో ఎవర్నైనా ఫోర్ ట్వంటీ అని అంటే అది చాలా అవమానం. ఇక రాయ్ విషయానికొస్తే ఆయన పెద్ద మాఫియాడాన్. ఆయన ఎక్కడికి వెళ్లినా సొంత సైన్యం ఒకటి వెంటే ఉంటుంది. ఆయన ఎన్నో వివాదాల్లో ఉన్నారు. పైగా ప్రస్తుత ఎమ్మెల్యే కూడా. దాంతో ఈ ఫోర్ ట్వంటీ ఆయనకి మరీ బాగా అతుకుతుందని ఆయన కంగారు పడుతున్నారు. రాయ్ గారికి వద్దంటే మాకూ వద్దని మిగతా వారు వాదిస్తున్నారు. దాంతో కాంగ్రెస్ జాబితా జారీని పక్కనబెట్టి ముందు నాయకులకు సర్ది చెప్పడంలో పడింది.