సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఈనెల 17 నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగిసింది. 1096 జెడ్పీటీసీ స్థానాలు, 16,589 ఎంపీటీసీ స్థానాలకు తొలి రెండురోజుల్లో నామినేషన్లు పెద్దగా దాఖలు కాలేదు. చివరి రెండు రోజుల్లో భారీగా దాఖలయ్యాయి. చివరి రోజైన గురువారం గడువు ముగిసిన తరువాత కూడా భారీగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చారు. సాయంత్రం ఐదు గంటలలోగా వచ్చిన అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించడానికి వీలుగా వారందరినీ ఒక గదిలోకి చేర్చారు. ఐదు గంటల తరువాత వచ్చినవారిని లోపలికి అనుమతించకుండా పోలీసులు కట్టడి చేశారు. ఎంపీటీసీ స్థానాలకు అన్ని రాజకీయ పార్టీల నుంచి దాదాపు లక్షపైగా నామినేషన్లు దాఖలవుతాయని అంచనా.
అదే విధంగా 1096 జెడ్పీటీసీ స్థానాలకు సుమారు పదివేల వరకు నామినేషన్లు దాఖలు కావచ్చని ఓ అధికారి వివరించారు. ప్రధాన పార్టీలు వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో.. స్థానిక సంస్థల ఎన్నికలపై పెద్దగా ఆసక్తి లేకుండా పోయింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లను శుక్రవారం పరిశీలించనున్నారు. ఏవైనా కారణాలతో నామినేషన్లను తిరస్కరిస్తే, వాటిపై అభ్యర్థులు శనివారం ఆర్డీవో స్థాయి అధికారులకు అప్పీలు చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇదివరకే కల్పించింది. సోమవారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. కాగా అదేరోజు సుప్రీంకోర్టులో రాష్ట్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన అఫిడవిట్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు రెండు దశల్లో ఎన్నికల నిర్వహణకు అంగీకరించే పక్షంలో ఏప్రిల్ ఆరున, ఎనిమిదవ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఏప్రిల్ 11న ఓట్ల లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. రెండు దశలకు సుప్రీంకోర్టు అంగీకరించని పక్షంలో ఏప్రిల్ ఆరున ఒకేరోజు పోలింగ్ నిర్వహించి, ఎనిమిదవ తేదీన ఓట్ల లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.