పిచ్చి కూతలు కూస్తే ఊరుకోం: పవన్ కల్యాణ్
* ప్రాంతీయతను రెచ్చగొడితే సహించం
* కేసీఆర్‌కు పవన్ కల్యాణ్ హెచ్చరిక
* మోడీ ప్రధాని కావాలన్నది ప్రతి భారతీయుడి ఆకాంక్ష
* తెలంగాణ అంటే తనకు ప్రేమ, ఇష్టమని పేర్కొన్న పవన్
సాక్షి, హైదరాబాద్, నిజామాబాద్: దేశ సమగ్రతకు భంగం కలిగించే ఏ పార్టీనైనా.. ప్రాంతీయతను రెచ్చగొడితే ఏ నాయకుణ్నయినా సహించేది లేదంటూ జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ‘టీఆర్‌ఎస్ నాయకుడు కేసీఆర్ మాట్లాడే తీరు బాగోలేదు. సీమాంధ్ర నాయకులకు ఇక్కడ పోటీ చేసే హక్కు లేదంటున్నారు. అది మీరెలా చెబుతారు? గతంలో పీవీ నరసింహారావు నంద్యాలలో, ఇందిరాగాంధీ మెదక్‌లో పోటీ చేసిన విషయం మర్చిపోయారా? ఈ దేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. దాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు. మీరు పిచ్చి పిచ్చి కూతలు కూస్తే.. ఇక్కడ చూస్తూ ఊరుకునే వారెవరూ లేరు’ అని పవన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. కుటుంబం పేరిట నేను, కూతురు, కోడలు, మేనల్లుడు అంటూ సీట్లు పంచుకోవడం సరికాదన్నారు. నగరంలోని ఎల్బీ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన ‘ఎన్డీయే శంఖారావం’ సభలో ఆయన ఆవేశంగా ప్రసంగించారు. ‘సోనియా, రాహుల్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ విడగొట్టింది. రాష్ట్రం రెండుగా విడిపోవచ్చు.. కానీ తెలుగు జాతి ఒక్కటే. స్వీట్లు పంచుకుని రెండుగా విడిపోవాల్సిన ఇరు ప్రాంతాలు ద్వేషంతో విడిపోయాయి.
ఇదిదేశ సమగ్రతకు భంగం కలిగించింది’ అని పవన్ పేర్కొన్నారు. ప్రధాని పీఠం కోసం పోటీ పడుతున్న రాహుల్‌కూ ఆయన చురకలంటించారు. ‘క్రికెట్ ఆడాలంటే తొలుత జోనల్, రంజీ, 20-20 మ్యాచ్‌ల్లో ఆడాలి. ఆ తర్వాత దేశానికి ప్రాతినిధ్యం వహించే 12 మంది సభ్యులుండే జట్టులో అవకాశం వస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్ కావాలంటే సంబంధిత పరీక్షలన్నీ పాస్ కావాలి. ఇందిరా కుటుంబంలో పుడితే.. పేరు చివర గాంధీ వస్తుంది గాని, ఆమెకున్న అనుభవం రాదు కదా? అది గుర్తుంచుకోవాలి’ అని హితవు పలికారు.
‘ప్రధానిగా దేశాన్ని పరిపాలించాలంటే బలమైన నాయకుడు కావాలి, బలహీనమైన కుటుంబంలోని వారు కాదు’ అని పరోక్షంగా రాహుల్‌ను విమర్శించారు. బీజేపీ అగ్రనేత నరేంద్ర మోడీ ప్రధాని కావాలని ప్రతి భారతీయుడు ఆకాంక్షిస్తున్నాడన్నారు. యూపీఏ హయాంలో పెట్రోల్, గ్యాస్, డీజిల్, విద్యుత్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయన్నారు.‘పెరిగిన ధరలను చూసి మా అమ్మ ఎంతో బాధపడుతోంది. నిజానికి సినీ హీరోగా నేను, కేంద్ర మంత్రిగా అన్నయ్య ఓ స్థితిలో ఉన్న మా ఇంట్లోనే ఈ పరిస్థితి ఉంటే. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటో ఊహించవచ్చు. ప్రతిదీ మన నియంత్రణలో ఉండాలంటే.. ఎన్డీఏ ప్రభుత్వం రావాలి’ అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ‘దేశ్ బచావ్... కాంగ్రెస్ హటావ్’ అంటూ నినాదాలు చేశారు.
నా నరనరాల్లో.. ప్రతి రక్తం బొట్టులో తెలంగాణ
‘‘తెలంగాణ అంటే నాకెంతో ప్రేమ.. నా గుండె లోతుల్లో తెలంగాణ ఉంది.. నరనరాల్లో, రక్తంలో తెలంగాణ ఉంది. నాకు తెలంగాణ అంటే ఎంతో ఇష్టం’ అని అంతకుముందు నిజామాబాద్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో పవన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘జై తెలంగాణ’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణను వ్యతిరేకించిన పార్టీల కూటమైన మూడోఫ్రంట్‌లో కేసీఆర్ ఎలా కలుస్తారని ప్రశ్నించారు.