
ప్రజాదరణ మావైపే..
వైఎస్సార్ కుటుంబానికి అండగా ఉండేందుకు రాజకీయాల్లోకి వచ్చాను. కాంగ్రెస్‌లోని కొందరు ఆయన కుటుంబంపై ద్వేషంతో కనీసం ఓదార్పు యాత్రకూడా చేసేందుకు అవకాశం ఇవ్వకపోవటం దారుణం.
నాలుగేళ్ల క్రితం వరకు ఆయనకు తెలిసింది వైద్యం చేయడమే. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం కాంగ్రెస్, టీడీపీలు మహానేత కుటుంబాన్ని పెట్టిన ఇబ్బందులు, ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా జైలుకు పంపిన వైనాన్ని గమనించిన డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వారి కుటుంబానికి అండగా నిలవాలనుకున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించి నాలుగేళ్లపాటు వైఎస్సార్ సీపీని బలోపేతం చేసేందుకు అహర్నిశలు శ్రమించారు. ప్రజాసమస్యల పరిష్కారానికి పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో ముందున్నారు. ప్రస్తుతం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే..
- న్యూస్‌లైన్, నరసరావుపేటవెస్ట్
- వైఎస్సార్ కుటుంబానికి అండగా ఉండేందుకు రాజకీయాల్లోకి..
- ప్రజలే మాకు వెన్నుదన్ను
- జన సంక్షేమానికి పాటుపడతా..
- వైఎస్సార్ సీపీ నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి
వైఎస్సార్ కుటుంబానికి అండగా..
వైఎస్సార్ కుటుంబానికి అండగా ఉండేందుకు రాజకీయాల్లోకి వచ్చాను. కాంగ్రెస్‌లోని కొందరు ఆయన కుటుంబంపై ద్వేషంతో కనీసం ఓదార్పు యాత్రకూడా చేసేందుకు అవకాశం ఇవ్వకపోవటం దారుణం.
ధైర్యంతో రాజకీయ పోరాటం..
నరసరావుపేట రాజకీయాల్లో ఎప్పటినుంచో రెండు కొండల్లా కాసు వెంకటకృష్ణారెడ్డి, డాక్టర్ కోడెల శివప్రసాదరావులు ఉన్నా మొండిధైర్యంతో రాజకీయాల్లోకి ప్రవేశించి పోరాటాలు చేశా. మొదటి నుంచి పార్టీ పిలుపు మేరకు ధర్నాలు, రాస్తారోకోలు, బంద్‌లు నిర్వహించాం. విజయం సాధించాం. ప్రజల్లో నమ్మకం పెంచుకున్నాం. వారి ఆదరణ పొందాం.
వైఎస్సార్‌సీపీకి నైతిక విజయం
తెలుగుదేశం పార్టీ చేసుకున్న సర్వేలోనే నరసరావుపేట సీటులో పోటీ చేస్తే టీడీపీ ఓడిపోతుందనే ఫలితాలు రావటంతో డాక్టర్ కోడెల శివప్రసాదరావు వేరే నియోజకవర్గానికి వెళ్లారు. దీంతోనే వైఎస్సార్‌సీపీకి నరసరావుపేటలో మొదటే నైతిక విజయం దక్కింది. కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు. అందరూ ప్రచారంలో పాల్గొంటున్నారు. నన్ను గెలిపించుకోవాలని అందరూ ఆరాటపడుతున్నారు.
డబ్బుతో వస్తే ఆదరించరు..
నేను రాజకీయాలకు కొత్త వ్యక్తినైనా నాలుగేళ్ల నుంచి పార్టీలో తిరుగుతూ ప్రజల మధ్య ఉన్నా. నేనెవరో, నేనంటే ఏమిటో నియోజకవర్గ ప్రజలకు తెలుసు. కానీ నా ప్రత్యర్థిగా బీజేపీ తరఫున పోటీచేస్తున్న వ్యక్తి నాలుగురోజుల క్రితమే వచ్చారు. ఆ వ్యక్తి కేవలం డబ్బుతో ఓట్లు, మనుషులను కొని రాజకీయాలు చేయాలనుకుంటే పొరపాటే. డబ్బులకు ప్రజలు అమ్ముడుపోతారని నేను భావించట్లేదు. ప్రజలు చాలా తెలివిగలవారు.
విశ్వసనీయత జగన్ నైజం..
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, విశ్వసనీయత జగన్‌మోహన్‌రెడ్డి నైజం. టీడీపీ నాయకుడు చంద్రబాబుకు అవేంటో కూడా తెలియదు. ఆరునెలల క్రితం బీజేపీతో పొత్తు చారిత్రాత్మక తప్పిదమన్న బాబు అదే పార్టీతో మళ్లీ పొత్తు పెట్టుకోవటంలోనే ఆయన ధోరణి కనిపిస్తోంది. చంద్రబాబు అధికారం కోసం ఆల్ ఫ్రీ అంటే నమ్మేవారేలేరు.
ప్రజల సమస్యలు పరిష్కరిస్తా..
నేను విజయం సాధిస్తే ప్రజాసమస్యలు విని పరిష్కరించేందుకు రోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తా. ప్రజలు ఎదుర్కొంటున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య, ప్రకాష్‌నగర్ రెండోరైల్వేగేటు వద్ద బ్రిడ్జి నిర్మాణం, వరదనీరు కాలనీలను ముంచెత్తకుండా రిటైనింగ్‌వాల్ నిర్మాణం, పార్లమెంటు సభ్యుల సహకారంతోనరసరావుపేట-పిడుగురాళ్ళల మధ్య రైల్వే లైను నిర్మాణం, పట్టణ శివారు ప్రాంతాలను పట్టణంలో కలిపి వాటి అభివృద్ధికి కృషి చేస్తా. లింగంగుంట్ల భూములకు రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించేందుకు పాటుపడతా. టీటీడీ రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు, ప్రతి గ్రామంలో రక్షిత మంచినీటి సదుపాయాలను కల్పిస్తా.
క్యాడర్‌కు అండగా ఉంటా
పార్టీ కార్యకర్తలు ఈ ఎన్నికల్లో చాలా నమ్మకంగా పనిచేశారు. నా వెన్నంటి నిలిచారు. నాకోసం పనిచేస్తున్న క్యాడర్‌కు అన్నివిధాలుగా అండగా ఉంటా.