
పీఆర్కే హ్యాట్రిక్ విజయం
మాచర్ల టౌన్, న్యూస్‌లైన్ :మాచర్ల ఎమ్మెల్యేగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరుసగా మూడోసారి ఎన్నికై రికార్డు సృష్టించారు. నియోజకవర్గ చరిత్రలో పీఆర్కే మినహా ఎవరూ రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందలేదు. దానిని అధిగమిస్తూ 2012లో జరిగిన ఉపఎన్నికల్లో పీఆర్కే రెండోసారి గెలిచి నియోజకవర్గంలో ఎవరికైనా ఒకేచాన్స్ అన్న సెంటిమెంట్‌ను అధిగమించారు. మూడోసారి ముచ్చటగా ఈ ఎన్నికల్లో మాచర్ల ఎమ్మెల్యేగా ఎన్నికై పీఆర్కే చరిత్రను తిరగరాశారు. యువజన కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన పీఆర్కే 2006లో వెల్దుర్తి మండలం నుంచి జెడ్‌పీటీసీగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అప్పటినుంచి ఈ పుష్కరకాలంలో ఆయన అపజయమనేది లేకుండా దూసుకుపోతున్నారు.
మొదట 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిపై పోటీచేసి 9,700 ఓట్లతో విజయం సాధించారు. 2012లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అధికార పార్టీ నిర్ణయానికి భిన్నంగా వైఎస్ జగన్‌కు మద్దతు పలికి అనర్హతవేటుకు గురయ్యారు. దీంతో మాచర్ల నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2012లో జరిగిన ఉపఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పీఆర్కే పోటీచేసి టీడీపీ అభ్యర్థి చిరుమామిళ్ళ మధుబాబుపై 16వేల ఓట్లపైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు. మూడోసారి ముచ్చటగా నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీచేసిన పీఆర్కే సమీప టీడీపీ ప్రత్యర్థి కొమ్మారెడ్డి చలమారెడ్డిపై 3,378 ఓట్లతో విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు తన వైపే ఉన్నాయని ఈ ఎన్నిక ద్వారా పీఆర్కే నిరూపించారు.