సాక్షి, ఖమ్మం: ‘నామా నాగేశ్వరరావుది వరంగల్ జిల్లా... నారాయణది చిత్తూరు జిల్లా.. నాది కల్లూరు మండలం నారాయణపురం..నేను స్థానికుడిని..స్వతహా రైతు బిడ్డను... నన్ను ఆశీర్వదిస్తే జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తాను’- అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. ఖమ్మం పార్లమెంట్ ఏర్పడిన తర్వాత స్థానికుడిగా విజయం సాధించింది తమ్మినేని ఒక్కరేనని, ఆతర్వాత తాను స్థానికుడిగా ఈ ఎన్నికల్లో బరిలోకి దిగానని, స్థానిక నాయకత్వాన్ని రాజకీయ చైతన్యవంతులైన జిల్లా ప్రజలు తప్పకుండా ఆశీర్వదిస్తారని ఆయన ఆకాంక్షించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోనే రాష్ట్రంతో పాటు జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీలతో పాటు అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందేలా..., ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని పాలనచేసి చూపించిన ఘనత దేశంలోనే ఒక్క వైఎస్‌కే దక్కిందన్నారు.
సంక్షేమ పథకాలతో వైఎస్ తెలంగాణ ప్రజలను కూడా ఆకర్షితులను చేశారన్నారు. ఇదే స్ఫూర్తితో వైఎస్ తనయుడిగా జగన్‌మోహన్‌రెడ్డికి అన్ని ప్రాంతాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. వైఎస్‌ను జిల్లా ప్రజలు తమ గుండెల్లో పెట్టుకొని దీవిస్తున్నారనడానికి ఇటీవల జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శమన్నారు. కమ్యూనిస్టుల నినాదమైన దున్నేవాడికే భూమిని ఇచ్చిన మహనీయుడు వైఎస్.రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. గిరిజనులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న పోడు భూములపై వారికి హక్కులు కల్పించి.. హక్కు పత్రాలు ఇచ్చిన ఘనత వైఎస్‌ఆర్‌కే దక్కిందన్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రభంజనాన్ని అడ్డుకోలేరు..
సంక్షేమ పథకాలతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి ప్రజల మనిషిగా చిరస్థాయిగా నిలిచారని, అందుకే వైఎస్సార్‌సీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పొంగులేటి అన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు ముందే వస్తే వైఎస్సార్‌సీపీ సత్తా ఎంటో తెలిసేదన్నారు. జిల్లాలో జెడ్పీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడంతో పాటు ఎక్కువగా ఎంపీపీ స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంటుందని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం తప్పదని, పంచాయతీ ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే నామా నాగేశ్వరరావు కన్నా భిన్నంగా, నిస్వార్థంగా, ప్రజా సేవే లక్ష్యంగా జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని పొంగులేటి హామీ ఇచ్చారు. తాను వైఎస్సార్‌సీపీలోకి వచ్చిన 14 నెలల్లో జిల్లాలో అన్ని గ్రామాల్లో తిరిగానన్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ బలంగా ఉందని, ఈ ప్రభంజనాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరన్నారు.
జలయజ్ఞం ప్రాజెక్టుల పూర్తికి కృషి..
జలయజ్ఞంలో జిల్లాకు మంజూరైన సాగునీటి ప్రాజెక్టు పనుల పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే చందంగా మారిందన్నారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి అయ్యేందుకు, బయ్యారంలో స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు కూడా కృషి చేస్తానన్నారు. అలాగే జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా కృషి చేస్తానన్నారు. అంతేకాకుండా ఏజెన్సీ వాసుల కలనెరవేర్చేందుకు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న గిరిజన, మైనింగ్ యూనివర్శిటీలు, మాటలకే పరిమితమైన కొవ్వూరు రైల్వే లైన్ కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు.
పోలవరం నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చి వారిని తెలంగాణలోనే ఉంచేందుకు గిరిజనులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు జగన్ సీఎం అయితే నిర్వాసితులకు న్యాయం చేసేందుకు వైఎస్సార్‌సీపీ బాధ్యతగా తీసుకుంటుందన్నారు. అలాగే ఖమ్మంలో జర్నలిస్టుల, నిరుపేదల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తానన్నారు.
నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది..
ఆర్థికంగా నామాకు.. తనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని పొంగులేటి పేర్కొన్నారు. రూ. 2 కోట్లు ఉన్నా, లక్ష కోట్లు ఉన్నా కోటీశ్వరుడే అంటారన్నారు. డబ్బులు ఉంటే సరిపోదని, జనబలం, ప్రజల విశ్వసనీయత ఉంటేనే రాజకీయ నాయకుడవుతారన్నారు. కానీ డబ్బులుంటే రాజకీయనాయకుడవుతారన్నది అవివేకమన్నారు.
గత ఐదేళ్లలో నామా నాగేశ్వరరావు తన ఎంపీ ల్యాడ్స్ నిధులు ఖర్చు చేయకుండా చివరి రోజుల్లో ఎన్నికలను దృష్టి పెట్టుకొని ఖర్చు చేశారని, ఇది ప్రజలు గమనించాలని ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నామా తుంగలో తొక్కి బీజేపీతో పొత్తుతో మళ్లీ ఓట్ల కోసం వస్తున్నారని, ప్రజలు ఆయనకు తగిన గుణపాఠం చెప్పాలని పొంగులేటి పిలుపునిచ్చారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు కూరాకుల గోపి అధ్యక్షతన జరిగిన ఈ ‘మీట్‌ది ప్రెస్’కు ఉపాధ్యక్షులు గోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంధానకర్తగా వ్యవహరించారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు కట్టెకోల రాంనారాయణ, ఏనుగు వెంకటేశ్వర్లు, ప్రెస్‌క్లబ్ కార్యదర్శి మురళీకృష్ణ, కోశాధికారి వేణు పాల్గొన్నారు.
నేను స్థానికుడిని.. ఆశీర్వదించండి
Published Fri, Apr 25 2014 2:09 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement
Advertisement