
రబ్రీదేవికి 65 ఆవులు, ఓ డబుల్ బారెల్ గన్
పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవికి 65 ఆవులు, దూడలు ఉన్నాయి. రబ్రీ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో ఈ వివరాలను తెలియజేశారు. బీహార్లోని సరన్ లోక్సభ నియోజవర్గం నుంచి ఆమె నామినేషన్ దాఖలు చేశారు. రబ్రీకి 6.5 కోట్ల రూపాయిల విలువైన ఇతర ఆస్తులున్నాయి. ఆమెకు వాహనాలేమీ లేవు. కాగా డబుల్ బారెల్ గన్, బంగారు ఆభరణాలున్నాయి. ఇక పాట్నాలో అరడజను ఇళ్లు ఉన్నాయి.
2010 బీహార్ ఎన్నికలప్పటి కంటే రబ్రీకున్న ఆవుల సంఖ్య తగ్గింది. అప్పట్లో ఆమెకు 62 ఆవులు, 42 దూడలు ఉన్నట్టు తెలియజేసింది. పాట్నా నగర శివారు ధనాపూర్ వద్ద గల లాలూ పశుక్షేత్రంలో వీటిని సంరక్షిస్తున్నట్టు ఆర్జేడీ వర్గాలు తెలిపాయి. లాలూ దంపతులకు పశువులంటే ప్రత్యేక ప్రేమ. రబ్రీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమెకు వందకు పైగా ఆవులున్నాయి. 2005 ఎన్నికల్లో ఓటమి అనంతరం అధికారిక నివాసం ఖాలీ చేశాక వీటి సంఖ్య క్రమేణా తగ్గుతూ వస్తోంది.