
రేషన్ డీలర్లు పోటీకి అర్హులే
సాక్షి, హైదరాబాద్: రేషన్ డీలర్లు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ గురువారం పేర్కొన్నారు. వారి నామినేషన్లను తిరస్కరించవద్దని సూచించారు. అంగన్‌వాడీ వర్కర్, నీటి వినియోగదారుల సంఘం సభ్యుడు పంచాయతీరాజ్ ఎన్నికల్లో పోటీకి అనర్హుడని, మార్కె ట్ కమిటీ చైర్మన్, మార్కెట్ కమిటీ సభ్యుడు అనర్హులని వివరించారు. నామినేషన్ల పరిశీలన సమయంలో రిటర్నింగ్ అధికారు లకు కోర్టు తరహా అధికారాలు ఉంటాయని అందువల్ల తిరస్కృతి సమయంలో పంచాయతీరాజ్ ఎన్నికల చట్టం ఆధారంగా స్వతంత్రగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. అభ్యర్థుల నామినేషన్ల పరిశీలనకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఒకవేళ నామినేషన్ల పరిశీలనకు ముందు రోజు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్, సభ్యులు రాజీనామా చే సినట్లు అయితే వారి నామినేషన్లను అమోదించవచ్చని పేర్కొన్నారు.
కో ఆపరేటివ్ సొసైటీల్లోని చైర్‌పర్సన్‌లు, సభ్యులు పోటీకి అర్హులని సూచించారు. దేవాలయాల ట్రస్టుబోర్డు చైర్‌పర్సన్‌లు, సభ్యులు పోటీ చేయడానికి వీల్లేదన్నారు. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉన్నవారు పోటీకి అనర్హులని, అయితే 1994లో ఈ చట్టం అమలులోకి వచ్చిందని, అమలులోకి వచ్చిన సంవత్సరంలోగా ఒక పిల్లాడు పుట్టినా, ఆ తరువాత ఇద్దరు పిల్లలు పుట్టినా అలాంటి అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ప్రభుత్వ వాటా 25 శాతం కంటే అధికంగా ఉన్న ఏదైనా కార్పొరేషన్‌లో మేనేజర్‌స్థాయి లేదా ఇతర ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు పోటీ చేయడానికి అనర్హులని తేల్చారు. అయితే ఆర్టీసీలో మేనేజర్లు, కార్యదర్శులుపై స్థాయి అధికారులు కాకుండా దిగువన ఉన్నవారు పోటీకి అర్హులని కూడా మిట్టల్ పేర్కొన్నారు. ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి పంచాయతీకి ఆస్తిపన్ను లేదా ఇతరత్రా బకాయిలు ఉన్నంత మాత్రానా.. సదరు అభ్యర్థిని స్క్రూట్నీ సమయంలో అనర్హునిగా ప్రకటించడానికి వీల్లేదని, కేవలం మండల పరిషత్‌కు ఏవైనా బకాయిలు ఉంటేనే అనర్హునిగా ప్రకటించాలని సూచించారు. అదే విధంగా జడ్పీటీసీ సభ్యుడు జిల్లా పరిషత్‌కు బకాయి ఉంటే తప్ప.. అనర్హునిగా ప్రకటించడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు.