70 నుంచి 80 శాతానికి పైగా పోలింగ్ నమోదు:రమాకాంత్ రెడ్డి
హైదరాబాద్: జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు తొలిదశ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదు అయినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్ నమోదైన తీరును బట్టి చూస్తే 70 నుంచి 80 శాతానికి పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఆదివారం జరిగే తొలి విడత ఎన్నికల్లో ఉదయం, సాయంత్రం సమయాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైందన్నారు. మధ్యాహ్నం వేళ ఎండ ఎక్కువగా ఉండటం వల్ల పోలింగ్ సరళి కాస్త తగ్గిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 557 జడ్పీటీసీలు, 8250 ఎంపీటీసీలకు జరిగిన పోలింగ్ ముగిసిందన్నారు విశాఖ జిల్లాలో పోలింగ్ మందకోడిగా సాగిందన్నారు. కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు.
ప్రస్తుతానికి అందిన సమాచారం మేరకు మూడు జిల్లాలో రీ పోలింగ్ చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. అనంతపురం లో ఒక చోట, నెల్లూరు జిల్లాలో నాలుగు చోట్ల, మెదక్‌లో ఒకచోట రీ పోలింగ్ నిర్వహిస్తామన్నారు. ఈ పోలింగ్ ను ఈ నెల 11 వ తేదీన నిర్వహిస్తామని రమాకాంత్ రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లాలో సాయంత్రం నాలుగు గంటలకే 80 శాతం పైగా పోలింగ్ నమోదు అయ్యిందన్నారు. బ్యాలెట్ బాక్సులను ఉంచి స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని రమాకాంత్ రెడ్డి తెలిపారు.